అటు వృథా... ఇటు వ్యథ!
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:34 AM
ప్రజాధనం అంటే లెక్కలేని తనం నెలకొంది. దీంతో అవసరమైన చోట భవన నిర్మాణాలకు నిధులివ్వని సర్కారు... మరో వైపు పూర్తయ్యే దశలో ఉన్న భవనాలను పట్టించుకోకుండా కొత్త భవనాలకు నిధులు మంజూరు చేస్తోంది. మన్యంలో ఇలాంటి పరిస్థితులు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొయ్యూరు మండలంలోని రెండు గ్రామాల్లో పంచాయతీలకు రూ.లక్షలు వెచ్చించి భవనాలు నిర్మించగా, వాటిని గాలికి వదిలేశారు. మరోవైపు గూడెం కొత్తవీధి మండలంలో అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణానికి నిధులు లేక మధ్యలోనే వదిలేశారు.

నిర్మాణాలను గాలికి వదిలేసిన అధికారులు
అవసరమైన చోట నిధులు లేక ఇబ్బందులు
నీడలేక అంగన్‌వాడీ చిన్నారుల అవస్థలు
ఏజెన్సీలో భవన నిర్మాణాల పరిస్థితి
ప్రజాధనం అంటే లెక్కలేని తనం నెలకొంది. దీంతో అవసరమైన చోట భవన నిర్మాణాలకు నిధులివ్వని సర్కారు... మరో వైపు పూర్తయ్యే దశలో ఉన్న భవనాలను పట్టించుకోకుండా కొత్త భవనాలకు నిధులు మంజూరు చేస్తోంది. మన్యంలో ఇలాంటి పరిస్థితులు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొయ్యూరు మండలంలోని రెండు గ్రామాల్లో పంచాయతీలకు రూ.లక్షలు వెచ్చించి భవనాలు నిర్మించగా, వాటిని గాలికి వదిలేశారు. మరోవైపు గూడెం కొత్తవీధి మండలంలో అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణానికి నిధులు లేక మధ్యలోనే వదిలేశారు.
కొయ్యూరు, ఏప్రిల్ 2: ప్రజా ధనం వెచ్చించి నిర్మించిన భవనాలు వినియోగించకపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. మండలంలోని కంఠారం, మంప పంచాయతీల్లో సుమారు రూ.కోటి వ్యయంతో నిర్మించిన భవనాలు ఐదేళ్లుగా వృథాగా దర్శనమిస్తున్నాయి. గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో పంచాయతీ భవన నిర్మాణాలు ప్రారంభించారు. తుది మెరుగులుదిద్దాల్సి ఉంది. వీటిని వినియోగంలోకి తెచ్చేలోగా ప్రభుత్వం మారడం, వైసీపీ అధికారంలోకి రావడంతో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. దీంతో పంచాయతీ భవనాన్ని ఇంజనీరింగ్ అధికారులు గాలికి వదిలేశారు. మంపలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణాలు సచివాలయానికి వీలుగా తీర్చిదిద్దే అవకాశమున్నా పట్టించుకోలేదు. నూతన భవన నిర్మాణాలు పూర్తయ్యేవరకు రూ.వేలు అద్దె చెల్లించి పరాయి పంచన నడిపేందుకూ ప్రభుత్వం మొగ్గు చూపింది. దీంతో రూ.లక్షల్లో ప్రజా ధనం వృథా అయింది.
ఈ అంశంపై భవన నిర్మాణ పనులు పర్యవేక్షించిన ఇంజనీరింగ్ సిబ్బందిని ప్రశ్నించగా నిర్మాణాల మేరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవటంతో నిలిచిపోయాయయన్నారు. ఇదిలా ఉండగా కంఠారం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనుక ఐటీడీఏ నిధులు రూ.20 లక్షలు వెచ్చించి పీహెచ్‌సీ సబ్‌సెంటర్‌తో పాటు అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణ 2015 చివరిలో నిధులు మంజూరు చేయగా 2016లో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. రెండున్నరేళ్లు నిర్మాణాలు కొనసాగి 2020 నవంబరులో అన్ని హంగులతో పీహెచ్‌సీ వైద్యాధికారికి అప్పగించారు. అయితే గ్రామంలో అప్పటికే అంగన్‌వాడీ భవనం, సబ్ సెంటర్ భవనాలు ఉండడంతో ఈ భవనాన్ని వినియోగించిన దాఖలాలు లేవు. దీంతో దాని చుట్టూ తుప్పలు పెరిగి, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ఈ భవనాన్ని భర్త్ వెయిటింగ్ హాల్‌గా మార్చి వినియోగంలోకి తేవాలని పలువురు ఉన్నతాధికారులు వైద్యాధికారికి ఆదేశించినా చర్యలు చేపట్టలేదు. ఇలా ప్రతి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ హయాంలో మంజూరైన భవనాలకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించక వృథాగా వదిలేసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి చివరి దశలో ఉన్న భవన నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
31జీకేవీ1 అసంపూర్తిగా దర్శనమిస్తున్న పెదగ్రహారం నూతన అంగన్‌వాడీ భవనం
31సీటీపీ2 గ్రామంలోని ఓ గృహం వద్ద నిర్వహిస్తున్న కేంద్ర వద్ద కూర్చున్న చిన్నారులు
చిన్నారులకు అవస్థలు
గూడెంకొత్తవీధి, ఏప్రిల్ 2: నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేసి కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కల్పించాం.. ఈ పథకం కొత్త ఒరవడిని సృష్టించిందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే చెబుతుంటారు. స్థానిక వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు నిత్యం సభలు, సమావేశాలో చెప్పే మాటలివి. అయితే గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ ప్రకటనలకు వాస్తవ పరిస్థితికి పొంతన లేకుండా పోయింది. పథకంలో భాగంగా ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు జరిపినా... నిధుల లేమితో ఎక్కడి పనులక్కడే నిలిచిపోయి... అసంపూర్తి భవనాలే దర్శనమిస్తున్నాయి.
దాదాపుగా ఏజెన్సీ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ గూడెంకొత్తవీధి మండలం, పంచాయతీ పరిధి పెదగ్రహారం గ్రామంలోనూ భవనాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రెండేళ్లుగా భవన నిర్మాణాలు మొండిగోడలకే పరిమితమయ్యాయి. నూతన భవనం అందుబాటులోకి రాకపోవడంతో ప్రైవేటు ఇంటి వరండాలోనే అంగన్‌వాడీ కార్యకర్త చిన్నారులకు విద్యా బోధన, మధ్యాహ్న భోజనం అందించాల్సిన పరిసితులు నెలకొన్నాయి. పెదగ్రహారం అంగన్‌వాడీ కేంద్రంలో 30 మంది చిన్నారులున్నారు. ఈ కేంద్రానికి శాశ్వత భవనంలేదు. కేంద్రం నిర్వహణకు అనువైన అద్దె భవనం కూడా అందుబాటులోలేదు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్త గ్రామంలోని ఓ ఇంటి వరండాలో కేంద్రాన్ని నిర్వహిస్తున్నది. సరకులు భద్రపర్చుకునేందుకు కూడా సరైన భవనంలేదు. శాశ్వత భవనంలేక పోవడంతో వర్షాకాలం, చలికాలంలో చిన్నారుల అవస్థలు వర్ణనాతీతం. వర్షానికి గృహాలు కారిపోతుంటే ఒక ఇంటి నుంచి మరో ఇంటికి పరుగులు పెట్టాల్సివస్తున్నది. ఈపరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నాడు-నేడు పథకం ద్వారా గ్రామానికి శాశ్వత భవనం మంజూరయిందని ఐసీడీఎస్ అధికారులు ప్రకటించారు. దీంతో గిరిజనులు సంబరపడ్డారు. భవన నిర్మాణానికి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్థలం దానం చేశాడు. ఆరు నెలలు, ఏడాదిలోగా శాశ్వత భవనం అందుబాటులోకి వస్తుందని భావించారు. అయితే నేటికీ అందుబాటులోకి రాక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నిధులు విడుదలకాకపోవడమే కారణం
పెదగ్రహారం అంగన్‌వాడీ కేంద్రం భవన నిర్మాణానికి నిధులు విడుదలకాకపోవడంతో ఇప్పటికీ పూర్తికాలేదు. నాడు-నేడు పేజ్-2లో భాగంగా 2022లో పెదగ్రహారం గ్రామానికి అంగన్‌వాడీ భవనం మంజూరైంది. ఇందుకోసం రూ.14లక్షల మంజూరు చేస్తున్నట్టు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తొలి విడతగా రూ.ఆరు లక్షలు మంజూరు చేయడంతో శ్లాబ్ లెవెల్ వరకు నిర్మాణాలు జరిగాయి. 2023 జనవరి నుంచి నేటివరకు మలివిడత బిల్లుల కోసం ఐసీడీఎస్ అధికారులు, కాంట్రాక్టర్ (గ్రామ కమిటీ) ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం పైసా విడుదల చేయలేదు. దీంతో చిన్నారులకు శాశ్వత భవనం అందుబాటులోకి రాకుండా పోయింది. ప్రస్తుతం ఎన్నిక కోడ్ అమల్లోకి రావడం వల్ల నిధులు విడుదలయ్యే అవకాశాలు లేవు. అంగన్‌వాడీ చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలోపెట్టుకుని అధికారులు మలివిడత నిధులు విడుదల చేసి, భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.