బండరాళ్ల వాహనాలతో భయంభయం!
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:17 AM
మండలంలో రాజన్నపేట, వడ్డిప క్వారీల నుంచి నల్లరాయిని రవాణా చేసే వాహనదారులు కనీస నిబంధనలు పాటించడం లేదు. ఎటువంటి రక్షణ చర్యలుచేపట్టకుండా భారీ బండరాళ్లను రాంబిల్లి మండలంలో ప్రత్యామ్నాయ నేవల్ బేస్ నిర్మాణ పనులకు తరలిస్తున్నారు. రాళ్లపై టార్పాలిన్లు లేదా వలలు కప్పడం లేదు.

నిబంధనలు పాటించకపోవడంతో పొంచిఉన్న ప్రమాదం
రోలుగుంట, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలో రాజన్నపేట, వడ్డిప క్వారీల నుంచి నల్లరాయిని రవాణా చేసే వాహనదారులు కనీస నిబంధనలు పాటించడం లేదు. ఎటువంటి రక్షణ చర్యలుచేపట్టకుండా భారీ బండరాళ్లను రాంబిల్లి మండలంలో ప్రత్యామ్నాయ నేవల్ బేస్ నిర్మాణ పనులకు తరలిస్తున్నారు. రాళ్లపై టార్పాలిన్లు లేదా వలలు కప్పడం లేదు. పైగా లారీ బాడీ ఎత్తుకు మించి రాళ్లను నింపుతున్నారు. రవాణా చేసే సమయంలో రోడ్లపై గతుకులు ఉన్నచోట లారీ కుదుపునకు లోనై, బండరాళ్లు కింద పడే ప్రమాదం వుంది. ఇవి ఎక్కడ తమ మీద పడతాయోనని పాదచారులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాక నిత్యం పదుల సంఖ్యలో అధిక బరువుతో భారీ వాహనాలు వెళుతుండడంతో ఇప్పటికే అంతంతమాత్రంగా వున్న రోడ్లు మరింత దారుణంగా తయారవుతున్నాయి. కొన్ని లారీలకు నంబర్ ప్లేట్లు లేవు. ఒకవేళ వున్నా.. రిజిస్ట్రేషన్ నంబర్లు కనిపించడలేదు. వెనుకవైపు బ్లింకర్లు, డేంజర్ లైట్లు లేవు. రాత్రిపూట వెనుక నుంచి వచ్చే వాహనాలు ప్రమాదానికి గురయ్యే అవకాశం వుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.