Share News

జోనల్‌ కమిషనర్‌ బరితెగింపు

ABN , Publish Date - Jan 18 , 2024 | 01:04 AM

జీవీఎంసీలో ఒక జోనల్‌ కమిషనర్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జోనల్‌ కమిషనర్‌ బరితెగింపు

యథేచ్ఛగా వసూళ్లు

రోజుకు రూ.లక్ష జేబులో పడాల్సిందే

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి కలెక్షన్‌ బాధ్యత

టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ, ప్రజారోగ్య విభాగాల నుంచి కూడా నెలవారీ మామూళ్లు కోసం ఒత్తిడి

స్థానిక అధికార పార్టీ నేత అండతో చెలరేగిపోతున్న వైనం

చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీలో ఒక జోనల్‌ కమిషనర్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోజుకు రూ.లక్ష కలెక్షన్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారని, రెవెన్యూ, ప్రజారోగ్య విభాగాల నుంచి కూడా నెలవారీ మామూళ్లు అందాల్సిందేనని హుకుం జారీచేసినట్టు సిబ్బందే ఆరోపిస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన ఒక అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని ప్రత్యేకంగా వసూళ్ల కోసం నియమించుకున్నారంటున్నారు.

అత్యంత కీలకమైన జోన్‌కు కమిషనర్‌గా పనిచేస్తున్న ఆ అధికారి తీరు జీవీఎంసీలో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో తనకున్న పలుకుబడితో పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా ప్రధానమైన జోన్‌కు ఏడాది కిందట కమిషనర్‌గా పోస్టింగ్‌ వేయించుకున్నారు. ఆయన గతంలో కూడా జీవీఎంసీ పరిధిలో జోనల్‌ కమిషనర్‌గా పనిచేశారు. అప్పుడు తప్పుడు డాక్యుమెంట్లతో దాదాపు 200 వరకూ ఆస్తి పన్ను అసెస్‌మెంట్‌లు జారీచేసేశారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన్ను జీవీఎంసీ నుంచి సీడీఎంఏకు సరండర్‌ చేసేశారు. తర్వాత పొరుగు జిల్లాలో కొన్నాళ్లు పనిచేసి...తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తిరిగి జీవీఎంసీలో పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. జోన్‌ను కూడా జీవోలోనే పొందుపరిచేలా చక్రం తిప్పారు. రెండోసారి జోనల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ నియోజకవర్గ అధికార పార్టీ నాయకుడిని ప్రసన్నం చేసుకున్నారు. ‘మీరు ఎలా చెబితే అలా చేస్తాను. ప్రతిరోజూ ఉదయం ముందుగా మీ వద్దకు వచ్చిన తర్వాతే కార్యాలయానికి వెళతానని’...చెప్పారని, అంతేగాకుండా మామూళ్లలో కొంతవాటాను సదరు నాయకుడి కుటుంబ సభ్యుడికి ముట్టజెబుతుంటారనే ప్రచారం జీవీఎంసీ వర్గాల్లో జరుగుతోంది. జోనల్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అటెండర్‌ను తొలగించి తన సామాజిక వర్గానికి చెందిన అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని పెట్టుకున్నారు. అతని ద్వారానే వసూళ్ల దందా సాగిస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. జోన్‌ పరిధిలో జరిగే భవన నిర్మాణాల వద్దకు వెళ్లి ఉల్లంఘనలు ఉన్నాయంటూ యజమానులను హడలగొడుతున్నారు. దీంతో చాలామంది ఎందుకొచ్చిన గొడవని ముడుపులు సమర్పించుకుంటున్నారు. ఒకవేళ అప్పటికీ భవన నిర్మాణ యజమానులు స్పందించకపోతే టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, సిబ్బందిని పిలిచి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని, అందరికీ మెమోలు ఇవ్వడంతోపాటు కమిషనర్‌ దృష్టికి తీసుకువెళతానని బెదిరిస్తున్నారు. అలాగే కార్యాలయంలో ఖర్చులు ఉన్నాయంటూ నెలవారీ మామూళ్లు వసూలు చేయిఇస్తున్నారని టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది ఆరోపిస్తున్నారు. రెవెన్యూ విభాగంలో కూడా వేలుపెట్టి ప్రతి ఫైలును క్షుణ్ణంగా చూసి ఏదో ఒక కొర్రీ వేసి కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బందిని ఇబ్బందిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రజారోగ్యంలో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఆ విభాగం అధికారులు వాపోతున్నారు. అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల హాజరును నిత్యం తనిఖీ చేస్తూ...కమీషన్‌గా కొంత మొత్తం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. అవుట్‌సోర్సింగ్‌ కార్మికుడు ఎవరైనా విధులకు హాజరుకాకపోతే....శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను పిలిచి వారికి హాజరు వేసి, ఆ మొత్తాన్ని తనకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని సమాచారం. అలాగే జీవీఎంసీకి కొన్ని సంస్థలు సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ఇచ్చే నిధులను కూడా సదరు జోనల్‌ కమిషనర్‌ దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సదరు జోనల్‌ కమిషనర్‌ జోలికి వెళ్లడానికి కమిషనర్‌ సాహసించలేకపోతున్నారంటు న్నారు. అందుకు కారణం అఽధికార పార్టీ నాయకుడి అండదండలు సదరు అధికారికి పుష్కలంగా ఉండడమేనని జీవీఎంసీ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. సదరు నేత అండ చూసుకునే బరితెగించి వసూళ్లకు పాల్పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jan 18 , 2024 | 01:04 AM