Share News

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:29 AM

జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. దీనికి అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్‌ ఎం.విజయసునీత ఆధ్వర్యంలో పూర్తి చేశారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో 65 పరీక్షా కేంద్రాల్లో 12,051 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు
పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్న హెచ్‌ఎం విశ్వప్రసాద్‌ తదితరులు

జిల్లాలో హాజరుకానున్న విద్యార్థులు 12,051 మంది

65 పరీక్షా కేంద్రాలు

ప్రతి కేంద్రం పరిధిలో 144 సెక్షన్‌

విద్యాశాఖ కంట్రోల్‌ నెంబర్లు: 9490204585, 9493426468

నామమాత్రంగా సీసీ కెమెరాల ఏర్పాటు

పాడేరు, మార్చి 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. దీనికి అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్‌ ఎం.విజయసునీత ఆధ్వర్యంలో పూర్తి చేశారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో 65 పరీక్షా కేంద్రాల్లో 12,051 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 10,986 మంది రెగ్యులర్‌, 1,065 మంది ప్రైవేటు విద్యార్థులుకాగా, మొత్తం విద్యార్థుల్లో 5,066 మంది బాలురు, 5,920 మంది బాలికలున్నారు. పరీక్ష పత్రాలను భద్రపరిచేందుకు గాను 22 పోలీస్‌స్టేషన్లను పాయింట్‌లుగా అధికారులు గుర్తించారు. సోమవారం నుంచి ఈనెల 30 వరకు జరిగే పరీక్షలను పర్యవేక్షించేందుకు గాను 65 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 65 మంది డిపార్టుమెంట్‌ ఆఫీసర్లు, నలుగురు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను, 634 మంది ఇన్విజిలేటర్లను అధికారులు నియమించారు. అలాగే ప్రతి పరీక్షా కేంద్రం పరిధిలో 144 సెక్షన్‌ను అమలు చేయడంతో పాటు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన ఎటువంటి సమస్యలపైనా విద్యార్థులు తెలిపేందుకు కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సమస్యలను తెలియజేసేందుకు 9490204585, 9493426468 సెల్‌ నంబర్లకు సంప్రతించాలని విద్యాశాఖాధికారులు కోరారు. జిల్లాలోని టెన్త్‌ పరీక్షలను జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఉపసంచాలకుడు ఐ.కొండలరావు, మండల విద్యాశాఖాధికారులు పర్యవేక్షించనున్నారు.

నామమాత్రంగా సీసీ కెమెరాల ఏర్పాటు

జిల్లాలో పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో నామమాత్రంగానే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాస్తవానికి గతంలో 70 నుంచి 80 శాతం పరీక్షా కేంద్రాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో గత కొన్నాళ్లుగా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో అధికారులు సైతం మిన్నకున్నారు. గతంలో కేవలం పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోనే 25 నుంచి 30 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం కేవలం ఆరు కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ముంచంగిపుట్టు, అనంతగిరి, అరకులోయ మండలం కొత్తభల్లుగూడ, కూనవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Updated Date - Mar 18 , 2024 | 12:29 AM