పదో తరగతి విద్యార్థి మృతి
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:33 PM
అరకులోయ గురుకుల బాలుర (పీవీటీజీ) ఆశ్రమోన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి బడ్నాయిని ప్రవీణ్‌కుమార్ శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు.

అనారోగ్యంతో కేజీహెచ్‌లో
చేర్పించిన ఆశ్రమ పాఠశాల సిబ్బంది
విద్యార్థికి ఊపిరితిత్తుల సంబంధిత సమస్య
చికిత్స పొందుతూ..
అరకులోయ, అక్టోబరు 25: అరకులోయ గురుకుల బాలుర (పీవీటీజీ) ఆశ్రమోన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి బడ్నాయిని ప్రవీణ్‌కుమార్ శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం అనారోగ్యంగా ఉందని విద్యార్థి చెప్పడంతో ఆశ్రమ పాఠశాల సిబ్బంది అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స చేసిన వైద్యులు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుముఖం పట్టడాన్ని గుర్తించి మెరుగైన వైద్యం నిమిత్తం గురువారం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ప్రవీణ్‌కుమార్ శుక్రవారం మృతిచెందాడు. ప్రవీణ్‌కుమార్ ముంచంగిపుట్టు మండలం మాకవరం పంచాయతీ కొల్లిపుట్ గ్రామానికి చెందినవాడు.
కాగా వారం రోజుల క్రితం దసరా సెలవుల నుంచి ప్రవీణ్‌కుమార్ స్కూల్‌గా వచ్చాడు. శుక్రవారం రాత్రి స్టడీ అవర్‌లో పాల్గొనకపోవడంతో శనివారం వైస్‌ప్రిన్సిపాల్ మందలిస్తూ కర్రతో నడుము వైపు కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు రావడం, ఏ కారణంతో కొట్టారంటూ వైస్ ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. కొట్టిన విషయంలో ప్రవీణ్‌కుమార్ తల్లి, బంధువుల డిమాండ్ మేరకు స్కానింగ్ చేయించారు. స్కానింగ్ రిపోర్టులో అంతా బాగానే ఉందని రావడంతో అక్కడితో ఆగింది. అయితే 23వ తేదీ బుధవారం ప్రవీణ్‌కుమార్ అనారోగ్యంగా ఉందని చెప్పడంతో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో ఆశ్రమ పాఠశాల సిబ్బంది చేర్పించారు. శ్వాస సక్రమంగా తీసుకోలేకపోవడం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుముఖం పడుతుండడంతో ఆస్పత్రి వైద్యులు గురువారం కేజీహెచ్‌కు తరలించారు. వైద్యులు అందించిన వివరాల మేరకు ప్రవీణ్‌కుమార్ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. చికిత్స చేస్తుండగా శుక్రవారం ప్రవీణ్‌కుమార్ మృతిచెందాడు. విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న జడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర కేజీహెచ్‌కు వెళ్లి తల్లి, బంధువులను పరామర్శించారు. మృతికి గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారని గురుకుల పాఠశాలల కో-ఆర్డినేటర్ మూర్తి తెలిపారు. అయితే వైస్‌ప్రిన్సిపాల్ కొట్టడం వల్లే ప్రవీణ్‌కుమార్ మృతి చెందాడంటూ విద్యార్థి తల్లి, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఐటీడీఏ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.