Share News

జడ్పీలో ఉద్రిక్తత

ABN , Publish Date - Jul 28 , 2024 | 01:11 AM

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో శనివారం కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

జడ్పీలో ఉద్రిక్తత

  • సర్వ సభ్య సమావేశంలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి పద్మనాభం జడ్పీటీసీ సభ్యుడు గిరిబాబు అనుచిత వ్యాఖ్యలు

  • అభ్యంతరం వ్యక్తం చేసిన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు

  • ‘భూముల ఆక్రమణలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలపై మాట్లాడదామా...’అంటూ సవాల్‌

  • శాసనసభ్యుని వైపు దూసుకువచ్చిన వైసీపీ సభ్యులు

  • కొద్దిసేపు వాగ్వాదం

  • సర్దిచెప్పిన బండారు, ఇతర సభ్యులు

విశాఖపట్నం, జూలై 27 (ఆంధ్రజ్యోతి):

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో శనివారం కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వాటి అమలుకు భయపడుతున్నారని వైసీపీకి చెందిన పద్మనాభం జడ్పీటీసీ సభ్యుడు సుంకరి గిరిబాబు చేసిన వ్యాఖ్యలపై ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సుందరపు విజయకుమార్‌తో వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యులు వాగ్వాదానికి దిగడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం ఏర్పడింది.

చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సమావేశం శనివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. వ్యవసాయ శాఖపై చర్చలో జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు వీరవెంకట సత్యనారాయణకుమార్‌ లేచి అచ్యుతాపురం మండలం దోసూరు జడ్పీ ఉన్నత పాఠశాల స్థలం ఆక్రమణకు గురవుతుందని, కబ్జాదారులు ఎమ్మెల్యే పేరు చెబుతున్నారని అనడంతో చర్చ పక్కదారి పట్టిస్తున్నారంటూ జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దశలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ జోక్యం చేసుకుని పాఠశాల భూమిని గత పాలకుల నుంచి తమ పార్టీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పోరాడి కాపాడుకున్నారని, కబ్జాలు ఎవరి హయాంలో ఎక్కువ జరిగాయో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. దోసూరు ఒక్కటే కాకుండా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు కాపాడాలని పేర్కొనడంతో బుచ్చెయ్యపేట జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు స్పందిస్తూ అంశాల వారీగా చర్చించుకోవాలే తప్ప రాజకీయాల ప్రస్తావన వద్దని పేర్కొనడంతో ఆయనకు పద్మనాభం జడ్పీటీసీ సభ్యుడు సుంకరి గిరిబాబు మద్దతు పలుకుతూ అప్రస్తుత విషయాలు ఇక్కడ వద్దన్నారు. దీనికి సుందరపు విజయకుమార్‌ మాట్లాడుతూ చర్చ పక్కదారిపడుతున్నా సభకు ఎందుకు నియంత్రించడం లేదంటూ చైర్‌పర్సన్‌ను నిలదీశారు. ఆ తరువాత తిరిగి వ్యవసాయ శాఖపై చర్చ ప్రారంభం కావడంతో పద్మనాభం జడ్పీటీసీ సభ్యుడు గిరిబాబు మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా ఇంతవరకూ రైతులకు రైతుభరోసా సొమ్ము జమ చేయలేదన్నారు. సూపర్‌ి సక్స్‌ పథకాల అమలుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భయపడుతున్నారని వ్యాఖ్యానించడంతో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని 9.7 లక్షల కోట్ల అప్పుల్లోకి గత పాలకులు తీసుకువెళ్లారని ఆరోపించారు. ఆర్థికంగా దివాలా తీయించారన్నారు. అందుకు ప్రతిగా గిరిబాబు మరోసారి మాట్లాడేందుకు యత్నించడంతో విజయకుమార్‌ జోక్యం చేసుకుని సీఎంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని...‘పద్మనాభంలో మీ భూఆక్రమణలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై మాట్లాడదామా?’ అని ప్రశ్నించారు. దీంతో వైసీపీ జడ్పీటీసీ సభ్యులు ఒక్కసారిగా లేచి విజయకుమార్‌తో వాగ్వాదానికి దిగడంతో సభలో దుమారం రేగి స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ సభ్యులు మూకుమ్మడిగా సుందరపు విజయకుమార్‌ వైపు రావడంతో జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, మిగిలిన సభ్యులు ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. గొడవకు దిగిన సభ్యులు బయటకు వెళ్లాలని సుభద్ర హెచ్చరించారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పరవాడ

జడ్పీటీసీ సభ్యుడు పైల సన్యాసిరాజు లేచి సభ్యులంతా సంయమనం పాటించాలని కోరడంతో సభలో వివాదం ముగిసింది. తరువాత బండారు మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన సమస్యలపై చర్చించేటప్పుడు ఇతర అంశాల ప్రస్తావన వద్దని సూచించగా, చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు మాట్లాడుతూ సభ్యులంతా సమన్వయంతో మెలిగి సమస్యలపై చర్చించాలని కోరారు.

స్థాయీ సంఘాల సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు

శనివారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతిచెందిన రావికమతం జడ్పీటీసీ సభ్యురాలు తలారి రమణమ్మ ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జడ్పీ స్థాయీ సంఘాల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్థానం కల్పించినట్టు జడ్పీ సీఈవో ఎం.పోలినాయుడు ప్రకటించారు. ప్రణాళిక, ఆర్థిక స్థాయీ సంఘం సభ్యులుగా అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం, పాయకరావుపేట, నర్సీపట్నం ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయకుమార్‌, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, వంగలపూడి అనిత, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘ సభ్యుడిగా పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు నియమితులయ్యారు. వ్యవసాయ స్థాయీ సంఘ సభ్యునిగా విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌, విద్య, వైద్య స్థాయీ కమిటీ సభ్యుడిగా అరకులోయ ఎంపీ తనూజరాణి, స్ర్తీ సంక్షేమ, రక్షణ స్థాయీ సంఘ సభ్యుడిగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌, వర్క్స్‌ స్థాయీ సంఘ సభ్యులుగా భీమిలి, పెందుర్తి, అరకులోయ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, రేగం మత్స్యలింగం నియమితులయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేశ్‌బాబు, మత్స్యలింగం, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, వరుదు కల్యాణి, జడ్పీటీసీ సభ్యులు, విశాఖ కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌, అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ విజయసునీతా కృష్ణన్‌, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

కేజీహెచ్‌ ప్రక్షాళనకు డిమాండ్‌

  • వైద్య సేవలు మెరుగుపరచాలని కోరిన సభ్యులు

  • తుంగ్లాం ప్రాథమిక పాఠశాల కబ్జాపై నిలదీసిన ఎమ్మెల్యే పల్లా

విశాఖపట్నం, జూలై 27 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌లో వైద్య సేవలు మెరుగుపరచాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు శనివారం జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో కోరగా అన్ని పార్టీల సభ్యులు ఆయనకు మద్దతు పలికారు. రోగుల కోసం వాకబు చేయడానికి యత్నిస్తే సూపరింటెండెంట్‌ కనీసం స్పందించడం లేదని పలువురు ఆరోపించారు. ఇటువంటి సమస్యకు తెరపడాలంటే కేజీహెచ్‌లో సూపరింటెండెంట్‌కు సాయంగా ఒక పీఆర్వోను నియమించాలని కోరగా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ సానుకూలంగా స్పందించారు. మరికొందరు సభ్యులు లేచి కేజీహెచ్‌ మార్చురీ వద్ద సొమ్ములు అడుగుతున్నారని, చివరకు సర్టిఫికెట్ల జారీకి పైసలు ఇవ్వాల్సి వస్తోందని ధ్వజమెత్తడంతో పాటు కేజీహెచ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు. సభ్యుల ఆందోళనపై కలెక్టర్‌ స్పందిస్తూ సేవలు మెరుగుపరచడంతో పాటు అవినీతిని అరికడతామని హామీ ఇచ్చారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో నిర్మాణాలకు ఒక మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలన్నారు. గాజువాక పరిధి తుంగ్లాం ప్రాథమిక పాఠశాల కబ్జాకు గురైందని, దీనిపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని అధికారులను నిలదీశారు. దీనిపై చైర్‌పర్సన్‌ సుభద్ర బదులిస్తూ తక్షణమే తుంగ్లాంలో ఆక్రమణలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈలోగా జడ్పీ సీఈవో పోలినాయుడు మాట్లాడుతూ ఆక్రమణల తొలగింపునకు న్యాయపరంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

వేర్వేరుగా సమావేశాలు నిర్వహించండి

జడ్పీ సమావేశంలో పూర్తిస్థాయిలో అజెండా చర్చకు రావడం లేదని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అభిప్రాయపడ్డారు. కేవలం మూడు, నాలుగు అంశాలు మాత్రమే చర్చకు వస్తున్నాయని పేర్కొంటూ మొత్తం అంశాలపై చర్చించాలంటే అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఒక సమావేశం, అనకాపల్లి, విశాఖ జిల్లాల పరిధిలో సభ్యులకు ఒక సమావేశం ఏర్పాటుచేయాలని సూచించగా, సీసీవో పోలినాయుడు వివరణ ఇస్తూ సమావేశాలు వేర్వేరుగా నిర్వహణకు కోరం సమస్య తలెత్తుతుందని పేర్కొంటూ, దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశానికి తొలిసారిగా వచ్చిన ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్‌బాబు, విశ్వేశ్వరరాజు, మత్స్యలింగం, సుందరపు విజయకుమార్‌లను సత్కరించారు.

Updated Date - Jul 28 , 2024 | 01:11 AM