Share News

‘ఉక్కు’లో ఉద్రిక్తత

ABN , Publish Date - Feb 28 , 2024 | 01:31 AM

స్టీల్‌ప్లాంటులో బయోమెట్రిక్‌ అమలుపై వివాదం తలెత్తింది.

‘ఉక్కు’లో ఉద్రిక్తత

బయోమెట్రిక్‌ అమలుపై వివాదం

తమ సమస్యలు పరిష్కరించిన తరువాతే అమలు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌

వచ్చే నెల 8వ తేదీ నుంచి అమలు చేస్తామంటూ యాజమాన్యం ఉత్తర్వులు

పర్సనల్‌ డైరెక్టర్‌ ఛాంబర్‌లో బైఠాయించిన సంఘ నాయకులు

అడ్మిన్‌ భవనం వద్ద కార్మికుల ధర్నా

రాత్రి 12 గంటలకు కూడా కొనసాగుతున్న నిరసన కార్యక్రమం

ఉక్కు టౌన్‌షిప్‌ (విశాఖపట్నం), ఫిబ్రవరి 27:

స్టీల్‌ప్లాంటులో బయోమెట్రిక్‌ అమలుపై వివాదం తలెత్తింది. తమ సమస్యలు పరిష్కరించిన తరువాతే బయెమెట్రిక్‌ అమలు చేయాలని కార్మిక సంఘాల నాయకులు మంగళవారం డైరెక్టర్‌ (పర్సనల్‌) ఛాంబర్‌లో ఆందోళనకు దిగారు. ప్లాంటులో బయోమెట్రిక్‌ ఏర్పాటుపై యాజమాన్యం ఈ నెల 24న కార్మిక సంఘ నాయకులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నాయకులు బయోమెట్రిక్‌కు తాము వ్యతిరేకం కాదని, అయితే కార్మికుల వేతన సవరణ, క్యాంటీన్‌, భద్రత పరిస్థితులు మెరుగు వంటి సమస్యలను పరిష్కరించాక అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే నాయకుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకుండా యాజమాన్యం మార్చి ఎనిమిది నుంచి బయోమెట్రిక్‌ అమలు చేస్తున్నట్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో కార్మిక నాయకులు మంగళవారం సాయంత్రం అడ్మిన్‌ బిల్డింగ్‌లోని డైరెక్టర్‌ ఛాంబర్‌కు వెళ్లి బయోమెట్రిక్‌ అమలు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అక్కడే బైఠాయించారు. ఈ విషయం తెలిసిన కార్మికులు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో కార్మికులు అడ్మిన్‌ గేటు వద్ద బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. గేటు బయట, డైరెక్టర్‌ ఛాంబర్‌ వద్ద నాయకులు, కార్మికులు నిరసన కొనసాగిస్తున్నారు. 42 ఏళ్ల ఉక్కు చరిత్రలో రాత్రి సమయంలో ఉద్యోగులు/కార్మికులు ధర్నాకు దిగడం ఇదే మొదటిసారి. డైరెక్టర్‌ (పర్సనల్‌) కార్యాలయం వద్ద ఆందోళన తెలియజేస్తున్న కార్మిక నాయకులకు మద్దతుగా ఉద్యోగులు (రాత్రి ‘సి’ షిఫ్టునకు వెళ్లేవారు) మెరుపు ధర్నాకు దిగారు. అదేవిధంగా ‘బీ’ షిఫ్టునకు వెళ్లిన ఉద్యోగులు రాత్రి 10.30 గంటలకు బయటకు వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. యాజమాన్యం స్పందించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించారు. రాత్రి 12 గంటలకు కూడా ధర్నా కొనసాగుతూనే ఉంది. ఉక్కు సీఎండీ బయటకు ఒకటి చెప్పి, మరొకటి అమలు చేస్తున్నారని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు డి.ఆదినారాయణ, నీరుకొండ రామచంద్రరావు, కేఎస్‌ఎన్‌ రావు, జె.అయోధ్యరామ్‌, యు.రామస్వామి, జి.గణపతిరెడ్డి, బీఎంకే నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 01:31 AM