Share News

తెలంగాణ ఏసీపీ ఇంట్లో సోదాలు

ABN , Publish Date - May 22 , 2024 | 12:25 AM

తెలంగాణ సీసీఎస్‌ విభాగంలో ఏసీపీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఆ రాష్ట్ర ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఏకకాలంలో ఆయనతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.

తెలంగాణ ఏసీపీ ఇంట్లో సోదాలు
ఎల్‌బీపీ అగ్రహారంలోని ఉమామహేశ్వరరావు ఇంట్లో తనిఖీలు చేస్తున్న తెలంగాణ ఏసీబీ అధికారులు

- లింగభూపాలపుర అగ్రహారంలోని ఉమామహేశ్వరరావు స్వగృహంలో విస్తృత తనిఖీలు

బుచ్చెయ్యపేట, మే 21:

తెలంగాణ సీసీఎస్‌ విభాగంలో ఏసీపీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఆ రాష్ట్ర ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఏకకాలంలో ఆయనతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఉమామహేశ్వరరావు స్వగ్రామమైన అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం లింగభూపాలపుర అగ్రహారంలో మంగళవారం రాత్రి తెలంగాణ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు అక్కడికి వచ్చిన ఏసీబీ అధికారులు ఇంట్లో ఉన్న ఉమామహేశ్వరరావు బంధువుల సమక్షంలో రెండు గంటల పాటు రికార్డులను, బీరువాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలు ముగిసిన వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన నలుగురు ఏసీబీ అధికారులు కారులో వెళ్లిపోయారు. దీని వివరాలపై వారిని విలేకరులు ప్రశ్నించగా తెలంగాణలో వెల్లడిస్తామని వారు తెలిపారు.

రోలుగుంటలో ..

రోలుగుంట: రోలుగుంటలో మంగళవారం ఉదయం ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. తెలంగాణ సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసుకు సంబంధించి రోలుగుంటలోని సంతబైల వీధిలో ఉన్న మడ్డు తమ్మునాయుడు ఇంట్లో సోదాలు చేశారు. మంగళవారం ఉదయమే ఏపీ డిప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్‌ స్టేట్‌ ట్యాక్స్‌(జీఎస్టీ) అన్న బోర్డుతో ఉన్న కారు, పోలీసుశాఖకు చెందిన బోర్డుతో ఉన్న కారులో రెండు బృందాలుగా తెలంగాణ ఏసీబీ అధికారులు వచ్చారు. స్థానిక పంచాయతీ కార్యాలయం సిబ్బందిని సోదాలు చేసే ఇంటి వివరాలపై వాకబు చేశారు. వారి సహాయంలో మడ్డు తమ్మునాయుడు ఇంటి వద్దకు ఉదయం 8 గంటలకు చేరుకుని మధ్యాహ్నం మూడు గంటల వరకు సోదాలు చేశారు. ఇంట్లో ఉన్న బంధువుల వివరాలు సేకరించారు. మడ్డు తమ్మునాయుడు కుమారుడు మడ్డు జోగినాయుడు స్పెషల్‌ పార్టీ పోలీసుశాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం విశాఖ సింహాచలం దేవస్థానం సెక్యూరిటీ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ జోగినాయుడుకి, ఏసీపీ ఉమామహేశ్వరరావు బంధువులకు సంబంధాలు ఉండడం కారణంగానే సోదాలు చేసినట్టు సమాచారం. సోదాల వివరాలు వెల్లడించడానికి ఏసీబీ అధికారులు నిరాకరించారు.

Updated Date - May 22 , 2024 | 12:25 AM