ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదల
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:12 AM
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా సోమవారం ఎన్నికల అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తుది జాబితా విడుదలచేశారు.

ఆరు జిల్లాల్లో 21,555 మంది ఓటర్లు
పురుషులు 12,948, మహిళలు: 8,607
అత్యధికంగా విశాఖ జిల్లాలో 5,277 మంది ఓటర్లు
2019 కంటే 1,968 మంది అధికం
తుది ఓటర్ల జాబితా
జిల్లా పురుషులు మహిళలు మొత్తం
శ్రీకాకుళం 3,275 1,554 4,929
విజయనగరం 3,100 1,837 4,937
పార్వతీపురం మన్యం 1,532 730 2,262
అల్లూరి సీతారామరాజు891 557 1,448
విశాఖపట్నం 2,403 2,874 5,277
అనకాపల్లి 1,747 1,055 2,802
మొత్తం 12,948 8,607 21,555
విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా సోమవారం ఎన్నికల అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తుది జాబితా విడుదలచేశారు. ఆరు జిల్లాల పరిధిలో 21,555 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 12,948 మంది పురుషులు కాగా 8,607 మంది మహిళలు. అత్యధికంగా విశాఖ జిల్లాలో 5,277 మంది, విజయనగరం జిల్లాలో 4,937, శ్రీకాకుళం జిల్లాలో 4,829, అనకాపల్లి జిల్లాలో 2,802, పార్వతీపురం మన్యంలో 2,262 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,448 మంది టీచర్లు ఓటర్లుగా నమోదయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 19,587. ఈ పర్యాయం స్వల్పంగా పెరిగారు.
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ ఏడాది సెప్టెంబరు 30వ తేదీ నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గత నెల 23న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. ఆ ప్రక్రియ ముగియడంతో సోమవారం ఎన్నికల అధికారి తుది జాబితా విడుదల చేశారు. గత నెల 23న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 15,297 మంది ఓటర్లు ఉండగా అభ్యంతరాలు స్వీకరించడంతోపాటు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా 19 మంది ఓటర్లపై అభ్యంతరాలు రాగా వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. కొత్తగా పురుషులు 3,325, మహిళలు 2,962 మంది వెరసి 6,287 మంది దరఖాస్తు చేయగా పరిశీలించి అందరినీ ఓటర్ల జాబితాలో చేర్చారు. ఇదిలావుండగా వచ్చే ఏడాది ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తరువాత మరోసారి ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం ఇవ్వనున్నది.