Share News

టీడీపీ-జనసేన కూటమి గెలుపే లక్ష్యం

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:57 PM

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా టీడీపీ శ్రేణులంగా కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు.

టీడీపీ-జనసేన కూటమి గెలుపే లక్ష్యం
మాజీ మంత్రి గంటా సమక్షంలో చేతులు కలిపి ఐక్యతను చాటుతున్న టీడీపీ నేతలు

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపు

అనిత నివాసంలో సమావేశానికి హాజరైన అసమ్మతి నేతలు

నక్కపల్లి, ఫిబ్రవరి 13: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా టీడీపీ శ్రేణులంగా కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిర్వహించే కార్యక్రమాలకు హాజరుకాకుండా ఆమెకు దూరంగా వుంటున్నారు. అనిత ఈ విషయాన్ని ఇటీవల గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం అనిత నివాసంలో ఏర్పాటు చేసే సమావేశానికి రావాలని ఆయా నేతలకు వర్తమానం పంపినట్టు తెలిసింది. దీంతో పాయకరావుపేట నియోజకవర్గంలో అన్ని మండలాలకు చెందిన నేతలతోపాటు అసమ్మతి నాయకులు మజ్జూరి నారాయణరావు, గొర్లె రాజబాబు, నక్కపల్లి మండలానికి చెందిన బాబ్జీ, తదితరులు ఈ సమావేశానికి వచ్చారు. తనకు ఎవరూ విరోధులు కారని, అందరితోనూ సఖ్యతగానే వుంటానని ఈ సందర్భంగా అనిత చెప్పారు. దీంతో నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు, జడ్పీటీసీ మాజీ సభ్యులు, ఇతర నాయకులు మాట్లాడుతూ.. గంటా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత నేతృత్వంలో రానున్న ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. మజ్జూరి నారాయణరావు, గొర్రెల రాజబాబుపై గతంలో విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసేలా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో మాట్లాడుతానని అనిత వారికి హామీ ఇచ్చారు.

Updated Date - Feb 13 , 2024 | 11:57 PM