టీడీపీ నాయకుడి సరుగుడు తోటకు నిప్పు
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:42 AM
మండలంలోని జి.కోడూరు రెవెన్యూ పరిధిలో టీడీపీ మండల యూత్ ఉపాధ్యక్షుడు రొంగలి శంకర్‌గిరికి చెందిన ఐదు ఎకరాల సరుగుడు తోటకు మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.

గుర్తు తెలియని వ్యక్తుల దుశ్చర్య
మాకవరపాలెం, మార్చి 5: మండలంలోని జి.కోడూరు రెవెన్యూ పరిధిలో టీడీపీ మండల యూత్ ఉపాధ్యక్షుడు రొంగలి శంకర్‌గిరికి చెందిన ఐదు ఎకరాల సరుగుడు తోటకు మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఎరకన్నపాలెం గ్రామానికి ఆనుకొని ఉన్న జి.కోడూరు రెవెన్యూలోని సరుగుడు తోటలో మంగళవారం 12 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న రైతులు మంటలు అర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో వెంటనే ఆ భూమి రైతు శంకర్‌గిరికి సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి వచ్చేసరికి సుమారు నాలుగు ఎకరాల సరుగుడు తోట కాలిపోయింది. రైతుల సహకారంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, ఐదు ఎకరాల సరుగుడు తోట కాలిపోయిందని శంకరగిరి వాపోయారు. అనంతరం చుట్టుపక్కల ఉన్న సరుగుడు తోటలకు ఈ మంటలు వ్యాపించాయి. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నాయకులు తెలిపారు.