భవనాల అన్వేషణలో టీసీఎస్!
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:38 AM
విశాఖపట్నంలో క్యాంపస్ ఏర్పాటు చేయాలని ముందుకు వచ్చిన టీసీఎస్ త్వరలో కార్యకలాపాలు ప్రారంభించే యోచనలో ఉంది.
రుషికొండలో మిలీనియం టవర్ లేదా ప్రైవేటు భవనాలపై దృష్టి
దశలవారీగా ఉద్యోగ నియామకాలకు చర్యలు
కార్యకలాపాల ప్రారంభానికి శరవేగంగా అడుగులు
త్వరలో నగరానికి రానున్న ఉన్నతస్థాయి బృందం
విశాఖపట్నం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో క్యాంపస్ ఏర్పాటు చేయాలని ముందుకు వచ్చిన టీసీఎస్ త్వరలో కార్యకలాపాలు ప్రారంభించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగానే 100 రోజుల్లో టీసీఎస్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తామని ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఇప్పటికిప్పుడు సొంత భవనాలు ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదని, అందువల్ల ప్రస్తుతం రుషికొండ ఐటీ హిల్స్‌లో ఉన్న మిలీనియం టవర్‌లో ఖాళీగా ఉన్న భవనాలు తీసుకోవాలా? లేదా ప్రైవేటు భవనాలు అద్దెకు తీసుకోవాలా ?అన్నదానిపై టీసీఎస్ ఆలోచన చేస్తోందని సమాచారం. టీసీఎస్ క్యాంపస్ రాబోతుందని మంత్రి నారా లోకేశ్ ప్రకటించిన వెంటనే భవనాల వేటకు సంబంధించి కంపెనీ ప్రతినిధులు చర్యలు ప్రారంభించారని తెలిసింది.
రుషికొండ ఐటీ హిల్స్ రెండు మిలీనియం టవర్స్‌లో ఒక భవనం ఖాళీగా ఉంది. సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ భవనం టీసీఎస్ కార్యకలాపాలకు సరిపోతుంది. అయితే ఈ భవనం ఉండే ప్రాంతం సెజ్ ఏరియా కావడంతో కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. అందువల్ల నగరంలో విశాలంగా ఉండే మూడు భవనాలు పరిశీలించారని చెబుతున్నారు. ప్రస్తుతానికి కనీసం లక్ష చదరపు అడుగుల భవనం అవసరమవుతుంది. విశాఖ క్యాంపస్‌లో 15వేల మంది పనిచేసేలా ప్రతిపాదిస్తున్నారు. అందరినీ ఒకేసారి కాకుండా, దశలవారీగా నియమించుకుని కార్యకలాపాలు చేపట్టనున్నారు. మిలీనియం టవర్‌లో ఒక భవనం, నగరంలో మూడు ప్రైవేటు భవనాల పరిశీలనకు కంపెనీ నుంచి ఉన్నత స్థాయి బృందం వచ్చే అవకాశం ఉందని తెలిసింది. అటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకోవడం, సొంత క్యాంపస్ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.