Share News

ఫ్లైఓవర్‌లపై పైపై మాటలేనా!?

ABN , Publish Date - Jan 09 , 2024 | 01:29 AM

‘ఆలు లేదు...చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు.

ఫ్లైఓవర్‌లపై పైపై మాటలేనా!?

నగరంలో 12చోట్ల ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించనున్నట్టు మూడేళ్లుగా చెబుతున్న వైసీపీ నేతలు

ఇప్పటివరకూ కార్యరూపం దాల్చని వైనం

హనుమంతవాక జంక్షన్‌లో ఫ్లైవోవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు తాజాగా ప్రకటనలు

డీపీఆర్‌లు లేకుండా నిర్మాణాలా!!

నిధుల వ్యయంపై కొరవడిన స్పష్టత

ఎన్నికల స్టంటేనా...

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘ఆలు లేదు...చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. నగరంలో 12 ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడతామంటూ గత మూడేళ్ల నుంచి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పుకొస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ప్రతిపాదనలు కూడా సమర్పించారు. అనేక ఒత్తిళ్ల నేపథ్యంలో కేంద్రం కూడా ఈ ప్రాజెక్టును చేపడతామని హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకూ ఆ దిశగా ఎటువంటి అడుగులు ముందుకు పడలేదు. కానీ విశాఖ జిల్లా వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మాత్రం త్వరలోనే హనుమంతవాక జంక్షన్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తామంటూ పదేపదే చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యమో అర్థం కావడం లేదు.

విశాఖ నగరం మీదుగా వెళుతున్న చెన్నై-కోల్‌కతా 16వ నంబర్‌ జాతీయ రహదారి భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో ఉంది. ఫ్లైఓవర్లు కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలి. దానికి సీఎం జగన్‌ ఎలా శంకుస్థాపన చేస్తారో అర్థం కావడం లేదు. పోనీ ఈ రహదారిని ఏమైనా రాష్ట్రానికి అప్పగించారా?...అంటే అదీ లేదు. ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయ్యాక ఎన్‌హెచ్‌ఏఐ రాష్ట్రానికి అప్పగిస్తుందని, ఆ తరువాత జీవీఎంసీ ఆ మార్గం నిర్వహణ బాధ్యతలు చేపడుతుందని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున మూడు రోజుల క్రితం స్వయంగా వెల్లడించారు. అంటే విశాఖ ప్రజలను మోసం చేయడానికి చివరి వరకు అధికార పార్టీ వైసీపీ యత్నిస్తున్నదనే అర్థమవుతోంది.

అది కూడా టీడీపీ నిర్మించిన ఫ్లైఓవరే

విశాఖపట్నంలో విమానాశ్రయం ముందు వచ్చే ఎన్‌ఏడీ జంక్షన్‌లో ట్రాఫిక్‌ సమస్య చాలా తీవ్రంగా ఉందని గుర్తించిన నాటి సీఎం చంద్రబాబునాయుడు రూ.150 కోట్లతో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రత్యేకంగా డిజైన్లు తయారు చేయించి చకచకా పనుల పూర్తికి యత్నించారు. ఇంకో ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందనగా, ప్రభుత్వం మారిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. దానికి సీఎం జగన్‌ చేతులు మీదుగా శంకుస్థాపన చేసి తామే నిర్మించినట్టు ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే ఎన్‌ఏడీ జంక్షన్‌కి, విమానాశ్రయానికి మధ్య రైల్వేతో కలిసి అండర్‌ పాస్‌వే నిర్మించాల్సి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా ఆ పనిలో 50 శాతం కూడా పూర్తి కాలేదు. అందులో కేవలం 25 శాతమే పూర్తయిందని వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ హోదాలో కలెక్టర్‌ మల్లికార్జున ఇటీవలె వెల్లడించారు. వచ్చే సెప్టెంబరు నాటికి కాని పూర్తిచేయలేమని చెప్పేశారు. అంత పెద్ద ఫ్లైఓవర్‌ని టీడీపీ హయాంలో రెండేళ్లలో 80 శాతం పూర్తి చేస్తే, కేవలం అండర్‌ పాస్‌వే నిర్మాణాన్ని వైసీపీ పూర్తి చేయలేకపోవడం గమనార్హం.

12 చోట్ల ఫ్లైఓవర్ల ప్రతిపాదన

విశాఖపట్నంలో ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అంతా ఎండాడ, మధురవాడ, కొమ్మాది, ఆనందపురాల్లో నడుస్తోంది. అధికార పార్టీ నాయకులకు అటు వైపు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ట్రాఫిక్‌ కారణంగా అంత దూరం వెళ్లడానికి నగర ప్రజలు ఇష్టపడడం లేదు. హనుమంతవాక, ఎండాడ, కారుషెడ్‌ జంక్షన్లు బాగా ఇబ్బందికరంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడితే తప్ప ప్రజలు అటు వెళ్లరని గుర్తించి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారు. అనకాపల్లి నుంచి విశాఖపట్నం మీదుగా ఆనందపురం వెళ్లే జాతీయ రహదారిలో 12 చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాలని కోరారు.

కూర్మన్నపాలెం, గాజువాక, షీలానగర్‌, మురళీనగర్‌, తాటిచెట్లపాలెం, సత్యం జంక్షన్‌, మద్దిలపాలెం, ఇసుకతోట, హనుమంతవాక జంక్షన్‌, ఎండాడ, కారుషెడ్‌ జంక్షన్‌, కొమ్మాది ప్రాంతాల్లో ఫైఓవర్లకు ప్రతిపాదించారు. ఇదంతా 2020లో జరిగింది. అనేక సంప్రతింపుల తరువాత 2022లో ఎన్‌హెచ్‌ఏఐ అనకాపల్లి నుంచి విశాఖపట్నం మధ్య 58 కి.మీ. మార్గంలో ఫ్లైఓవర్ల నిర్మాణంపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేయడానికి బిడ్లను ఆహ్వానించింది. అవి ఏమయ్యాయో తెలియదు. ఏ ఫ్లైఓవర్‌కు ఎంత వ్యయం అవుతుందో అంచనాలు లేవు. కానీ వైసీపీ నాయకులు మాత్రం అవిగో ఫ్లైఓవర్లు...ఇవిగో ఫ్లైఓవర్లు అంటూ ఊదరగొడుతున్నారు. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ అఽధికారులు నోరు విప్పి మాట్లాడడం లేదు. కేంద్రం ఈ ప్రాజెక్టు చేపడతానన్న మాట వాస్తవం. కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ దీనిపై పార్లమెంటులో కూడా మాట్లాడారు. రైల్వే జోన్‌ ఎలాగైతే ఇస్తామని చెప్పి సాగదీసుకువస్తున్నారో...ఇది కూడా అంతే. డీపీఆర్‌లు లేవు. అంచనా వ్యయాలు లేవు. కానీ శంకుస్థాపనలు మాత్రం చేసేస్తామని వైసీపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ఎన్‌ఏడీలో ఫ్లైఓవర్‌ నిర్మించి ఇస్తే దానికి అండర్‌ పాస్‌వే ఏర్పాటుచేయలేకపోయిన పాలకులు ఏకంగా 12 ఫ్లైఓవర్లు నిర్మించేస్తామని చెబుతుంటే...విశాఖ ప్రజలు విస్తుపోతున్నారు.

Updated Date - Jan 09 , 2024 | 01:29 AM