Share News

ఓటర్లకు తాయిలాలు!

ABN , Publish Date - Mar 10 , 2024 | 01:17 AM

వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నిస్తున్న కీలక నేతలు..వ్యక్తిగతంగా ప్రతి ఓటరును కలుస్తూనే...గంప గుత్తగా పడే ఓట్లపై దృష్టి సారించారు. ఇందుకు కుల, వృత్తి సంఘాలు, అసోసియేషన్లను ఎంచుకుంటున్నారు.

ఓటర్లకు తాయిలాలు!

ప్రలోభపెట్టేందుకు వైసీపీ నాయకుల యత్నాలు

ఇప్పటికే పంపిణీ ప్రారంభం

స్వీట్లు, చీరలు, డబ్బులు...

కులసంఘాలు, అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లు,

ఇతర సంఘాల నేతలతో రహస్య సమావేశాలు

ఎన్నికల్లో సహకరించాలంటూ కానుకల పంపిణీ

తాయిలాలకు పడిపోతే భవిష్యత్తు అంధకారమే

మంచి నేతను ఎన్నుకుంటేనే మనుగడ అంటున్న నిపుణులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు సమరానికి సన్నద్ధమవుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కొంతమంది ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఎలాగైనా విజయం సాధించేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా ఓటర్లకు తాయిలాలు పంచి గెలుపు గుర్రం ఎక్కాలని కొంతమంది ఉవ్విళ్లూరుతున్నారు. వర్గాల వారీగా ప్రజల అవసరాలు గుర్తించి వాటిని తీర్చడం ద్వారా గంపగుత్తగా ఓట్లను కొల్లగొట్టేందుకు ఎత్తులు వేస్తున్నారు.

ఓటర్లను వివిధ రకాలుగా ప్రలోభపెట్టడం, తాయిలాలు అందించి ఆకట్టుకునే చర్యల్లో అధికార వైసీపీ నాయకులు ముందున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు భారీఎత్తున కానుకల పంపిణీని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తున్న నేతల అనుచరులు...యూనియన్లు, కుల సంఘాలు, అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్ల వారీగా అవసరాలను తెలుసుకుంటున్నారు. వాటిని నెరవేర్చడం ద్వారా ఓట్లను కొల్లగొట్టే వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా భరించేందుకు కూడా సిద్ధమవుతున్నారు.

వైసీపీ కానుకల పంపిణీ

నగరంలోని పలువురు వైసీపీ నాయకులు కానుకల పేరుతో మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఇంటింటికీ స్వీట్‌ బాక్సులను అందించారు. ఓ కీలక నేత ఓటర్లకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు మహిళలకు చీరలు, ఇతర ఖర్చులకు రూ.500 చొప్పున పంపిణీ చేశారు. ప్రలోభాలకు ఓటర్లు లొంగిపోతే రానున్న రోజుల్లో ఈ నాయకులు మరింత రెచ్చిపోతారనే వాదన వినిపిస్తోంది.

అవసరాలు తెలుసుకుని..

వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నిస్తున్న కీలక నేతలు..వ్యక్తిగతంగా ప్రతి ఓటరును కలుస్తూనే...గంప గుత్తగా పడే ఓట్లపై దృష్టి సారించారు. ఇందుకు కుల, వృత్తి సంఘాలు, అసోసియేషన్లను ఎంచుకుంటున్నారు. ఆయా సంఘాల ముఖ్య నాయకులతో సమావేశమై వారి అవసరాలను తీరుస్తామని, ఎన్నికల్లో సహకరించాలని కోరుతున్నారు. ఇందుకోసం ఒక్కో నేతకు క్షేత్రస్థాయిలో రెండు, మూడు బృందాలు పనిచేస్తున్నాయి. వీరంతా నియోజకవర్గ పరిధిలోని కీలక సంఘాలు, అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశం కావడం, వారి అవసరాలను తెలుసుకుని పోటీలో ఉన్న నేతకు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం నగర పరిధిలోని మూడు నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ నేతలు ఇదే పనిలో ఉన్నట్టు సమాచారం. ఖర్చుకు వెనుకాడని ఈ నాయకులు యువతపైనా దృష్టిసారిస్తున్నారు. క్రికెట్‌ కిట్లు, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ కిట్లతో వారిని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు.

తాయిలాలకు లొంగిపోతే...అంతే!

ఎన్నికల సమయంలో నేతలు పంచే డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగిపోతే ఐదేళ్ల పాటు జీవితం అస్తవ్యస్తమవుతుందనే విషయాన్ని ఓటర్లంతా గుర్తుంచుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నేతలను ఎన్నుకుంటే మేలు జరుగుతుందని, పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుందని చెబుతున్నారు. ప్రస్తుత పాలకుల హయాంలో కనీస అవసరాలైన నీరు, రోడ్లు, విద్యుత్‌ తదితర సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోందా?, అభివృద్ధి పనులు చేపడుతున్నారా?...వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని ఓటు వేయాలంటున్నారు. ప్రలోభాలకు, తాయిలాలకు లొంగిపోయి అసమర్థలను గెలిపిస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్‌ పరమేశ్వరరావు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Mar 10 , 2024 | 01:17 AM