Share News

తాడి.. కాలుష్యంతో తల్లడిల్లి..

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:26 AM

ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకుని తాడి గ్రామస్థులు విలవిల్లాడిపోతున్నారు. భరించలేని దుర్వాసన, తరచూ పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలతో భయం భయంగా గడుపుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాన్ని తరలించడానికి జీవో జారీ చేసి నిధులు కూడా కేటాయించింది. ఇంతలో ఎన్నికలు జరగడం, వైసీపీ అధికారంలోకి రావడంతో దీనికి బ్రేక్‌ పడింది. అయితే రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ గ్రామాన్ని తరలిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో గ్రామస్థులు మండిపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలను సైతం బహిష్కరించడానికి సిద్ధమవుతున్నారు.

తాడి.. కాలుష్యంతో తల్లడిల్లి..
ఫార్మాసిటీకి ఆనుకుని ఉన్న తాడి బీసీ కాలనీ

- ఫార్మాసిటీ కాలుష్యంతో గ్రామస్థులు ఉక్కిరిబిక్కిరి

- గ్రామాన్ని తరలించాలని 15 ఏళ్లుగా పోరాటం

- గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

- వైసీపీ అధికారంలోకి వచ్చాక మీనమేషాలు

- గ్రామాన్ని తరలిస్తామని రెండేళ్ల క్రితం సీఎం జగన్‌ హామీ

- ఇప్పటికి ఎటువంటి చర్యలు చేపట్టని వైనం

- మండిపడుతున్న గ్రామస్థులు

- సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం

పరవాడ, మార్చి 28: ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకుని తాడి గ్రామస్థులు విలవిల్లాడిపోతున్నారు. భరించలేని దుర్వాసన, తరచూ పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలతో భయం భయంగా గడుపుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాన్ని తరలించడానికి జీవో జారీ చేసి నిధులు కూడా కేటాయించింది. ఇంతలో ఎన్నికలు జరగడం, వైసీపీ అధికారంలోకి రావడంతో దీనికి బ్రేక్‌ పడింది. అయితే రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ గ్రామాన్ని తరలిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో గ్రామస్థులు మండిపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలను సైతం బహిష్కరించడానికి సిద్ధమవుతున్నారు.

ఫార్మా కాలుష్యంతో తాడి పంచాయతీ పరిధిలోని పెదతాడి, చినతాడి, తాడి బీసీ కాలనీల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భూగర్భ జలాలు సైతం కలుషితం కావడంతో తాగునీటికి అల్లాడిపోతున్నారు. కొందరు గత్యంతరం లేక కొళాయి నీరు తాగి అనారోగ్యానికి గురవుతున్నారు. చాలా మంది మోకాళ్ల నొప్పులతో నడవ లేని స్థితిలో మంచాన పడుతున్నారు. సురక్షిత తాగునీరు అందుబాటులో లేక లంకెలపాలెం, అగనంపూడి, పరవాడ తదితర ప్రాంతాల నుంచి మినరల్‌ వాటర్‌ క్యాన్లు కొనుగోలు చేసి ఆటోల్లో తెచ్చుకోవాల్సి వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వర్షాలు కురిసే సమయంలో కాలుష్య ప్రభావం మరింత తీవ్రంగా ఉండడంతో తలుపులు మూసుకున్నా ఇళ్లల్లో ఉండలేకపోతున్నామని వాపోతున్నారు. స్థానికుల్లో ఎక్కువ శాతం మంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని చెబుతున్నారు. దీనికి తోడు ఫార్మా పరిశ్రమల్లో సంభవిస్తున్న ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఏ సమయంలో ఎటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయం భయంగా కాలం గడుపుతున్నారు. ఫార్మాసిటీలోని పరిశ్రమల కాలుష్యంతో నరకయాతన అనుభవిస్తున్నా ఫార్మాసిటీ యాజమాన్యం గాని, ప్రభుత్వ యంత్రాంగం గాని పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పనులతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఫార్మాసిటీ యాజమాన్యం సీఎస్‌ఆర్‌ నిధులు వెచ్చించే అవకాశమున్నప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

15 ఏళ్లుగా పోరాటం

గ్రామాన్ని తరలించాలని గత 15 ఏళ్లుగా ఈ ప్రాంతవాసులు ఆందోళనలు చేస్తున్నారు. తాడి గ్రామం తరలింపు కోసం అప్పటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి 2012లో నిరాహరదీక్ష చేపట్టారు. కాగా గత టీడీపీ ప్రభుత్వం తాడి పంచాయతీని తరలించేందుకు 2019 ఫిబ్రవరిలో జీవో నంబరు 28ను విడుదల చేసింది. ఫార్మా కాలుష్యం నుంచి తాడి పంచాయతీ పరిధి గ్రామాలను తరలించేందుకు రూ. 59 కోట్లు విడుదల చేసింది. దీని కోసం ప్రత్యామ్నాయంగా పెదముషిడివాడలో లేఅవుట్‌ అభివృద్ధి చేసింది. ఇంతలో ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ గ్రామాన్ని తరలించేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది.

హామీ ఇచ్చి మరిచిన సీఎం జగన్‌

తాడి గ్రామాన్ని తరలిస్తామని 2022 ఏప్రిల్‌ 28న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలోని ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హామీ ఇచ్చారు. అయితే రెండేళ్లు అవుతున్నా గ్రామం తరలింపునకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. సీఎం ఇచ్చిన హామీ నెరవేరకపోవడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. కాగా కాలుష్యం నుంచి తమకు ఉపశమనం కల్పిస్తామన్న హామీని వైసీపీ పాలకులు నెరవేర్చనందుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తాడి గ్రామస్థులు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు గ్రామస్థులంతా కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:26 AM