స్వర్ణాంధ్ర 2047 ప్రణాళిక
ABN , Publish Date - Oct 05 , 2024 | 01:00 AM
అందరి సహకారంతోనే స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళిక అమలు సాధ్యమని, వైసీపీ పాలనలో ఐదేళ్లు వెనుకబడిన రాష్ట్రాన్ని విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో స్వర్ణాంధ్రగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
అందరి సహకారంతోనే సమగ్ర అభివృద్ధి
ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు
హోం మంత్రి వంగలపూడి అనిత
‘స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళిక’పై అధికారులతో సమీక్ష
అనకాపల్లి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): అందరి సహకారంతోనే స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళిక అమలు సాధ్యమని, వైసీపీ పాలనలో ఐదేళ్లు వెనుకబడిన రాష్ట్రాన్ని విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో స్వర్ణాంధ్రగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళిక అమలుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపేందుకు స్వర్ణాంధ్ర-2047 ప్రణాళిక తయారీలో అధికారులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. గ్రామీణ ప్రాంతం అధికంగా వున్న అనకాపల్లి జిల్లాలో వ్యవసాయం, పర్యాటకం, మత్స్య రంగాలను మరింత విస్తరింపజేయవచ్చన్నారు. అన్ని వర్గాల ప్రజల సూచనలు తీసుకొని సమగ్ర ప్రణాళికను రూపొందిస్తే రాబోయే 22 ఏళ్లలో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని ఆమె అన్నారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకుతీసుకెళ్లి, ప్రత్యేక గుర్తింపు వచ్చేలే స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళికను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో వివిధ వర్గాలు, రంగాలకు చెందిన వారి విజన్ ప్రణాళిక రూపొందించేందుకు సూచనలు సలహాలు తీసుకుని ప్రణాళికలో పొందుపర్చాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు అధికారులు ప్రాథమికంగా రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ ప్రణాళిక వివరాలను కలెక్టర్ విజయకృష్ణన్ మంత్రికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జేసీ జాహ్నవి, డీఆర్‌ఓ దయానిధి, సీపీఓ రామారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై నివేదికలను అందజేశారు.
ఎమ్మెల్యేలు గైర్హాజరు
స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళిక సమావేశానికి జిల్లాకు చెందిన ఎంపీతో సహా ఎమ్మెల్యేలు ఎవ్వరూ హాజరు కాలేదు. హోంమంత్రి అనిత, వివిధ శాఖల అధికారులు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేలు వెళ్లడంతో విజన్ ప్రణాళిక సమావేశానికి హాజరు కాలేదని అధికారులు చెబుతున్నారు. దీనిపై మంత్రి అనిత స్పందిస్తూ.. విజన్ ప్రణాళక సమావేశాన్ని ఈ నెలలో మరొకసారి ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.