అరకులోయలో ఇద్దరి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Dec 01 , 2024 | 11:38 PM
అరకులోయలోని అటవీశాఖ క్వార్టర్స్‌లో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో నాయనమ్మతో పాటు ఏడేళ్ల మనుమడు ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
మృతుల్లో నాయనమ్మ, మనుమడు
అటవీశాఖ క్వార్టర్స్‌లోని వెంటిలేషన్ లేని గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకోవడమే కారణమని అనుమానం
అరకులోయ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): అరకులోయలోని అటవీశాఖ క్వార్టర్స్‌లో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో నాయనమ్మతో పాటు ఏడేళ్ల మనుమడు ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
డుంబ్రిగుడ మండలం సొవ్వా ప్రాంతానికి చెందిన కొర్రా బలరాం తన భార్య, ముగ్గురు పిల్లలు, తల్లి చిలకమ్మతో పాటు అరకులోయలోని పాత పోస్టాఫీసుకు సమీపంలో గల అటవీశాఖ క్వార్టర్స్‌లో మూడేళ్లుగా నివాసముంటున్నారు. కూరగాయల విక్రయం, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి బలరాం తన భార్య, ఇద్దరు పిల్లలతో ఒక గదిలో, అతని తల్లి కొర్ర చిలకమ్మ(52), బలరాం పెద్ద కుమారుడు కొర్ర నాని(7) మరో గదిలో నిద్రించారు. చలికాలం కావడంతో చిలకమ్మ బొగ్గుల కుంపటి పెట్టుకొని మనుమడితో పాటు నిద్రించింది. వాస్తవానికి చిలకమ్మ వేకువజామునే లేచి పనులు చేసుకోవడం ఆనవాయితీ. అయితే ఆదివారం ఉదయం 7 గంటలు దాటినా గదిలోంచి బయటకు రాకపోవడంతో ఆమె కుమారుడు బలరాంకు అనుమానం వచ్చి తలుపులు తెరిచాడు. మంచం పక్కన పడి ఉన్న తల్లిని, మంచంపై బిగుసుకుపోయి ఉన్న తన కుమారుడిని చూసి దిగ్ర్భాంతి చెందాడు. వారు మృతి చెందారని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. విష సర్పం ఏదైనా కాటు వేసిందా అనే అనుమానంతో వారి శరీరాన్ని పరిశీలించాడు. అయితే ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. కాలనీ వాసులు కూడా పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
బొగ్గుల కుంపటి వల్లేనా?..
ఎటువంటి వెంటిలేషన్ లేని గదిలో తలుపులు వేసి బొగ్గ్గుల కుంపటి పెట్టుకొని నిద్రించడంతో బొగ్గు నుంచి వెలువడే కార్బన్‌మోనాక్సైడ్ మోతాదు ఎక్కువైన కారణంగా ఊపిరాడక వారు మృతి చెంది ఉంటారని వైద్యులు భావిస్తున్నారు.