Share News

నిఘా నిద్రపోతోంది!

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:35 AM

నగరంలో చోరీలకు అడ్డుకట్టవేస్తామంటూ పోలీసు అధికారులు చేస్తున్న ప్రకటనలు ఆచరణలో సాధ్యంకావడం లేదు.

నిఘా నిద్రపోతోంది!

నగరంలో పెరుగుతున్న చోరీలు

శివారు ప్రాంతాల్లో తరచూ దొంగతనాలు

తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్న చోరులు

కూడళ్లలో మూలకు చేరిన సీసీ కెమెరాలు

రద్దీ ప్రాంతాలు, అపార్ట్‌మెంట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుపై నిర్లక్ష్యం

దొంగలకు అవకాశంగా మారిన పరిస్థితి

నేరం జరిగినా నిందితుల ఆచూకీని గుర్తించలేకపోతున్న పోలీసులు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నగరంలో చోరీలకు అడ్డుకట్టవేస్తామంటూ పోలీసు అధికారులు చేస్తున్న ప్రకటనలు ఆచరణలో సాధ్యంకావడం లేదు. అధికారులు, సిబ్బంది కేటాయింపులు పెరుగుతున్నా చోరీలకు అడ్డుకట్టపడకపోవడం నేరపరిశోధనా విభాగం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. నిత్యం ఏదో ఒక చోట ఇళ్లలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. గత కొద్దిరోజులుగా వీటి సంఖ్య మరింతగా పెరుగుతుండడం నగరవాసులతో పాటు పోలీసులను కూడా ఆందోళన కలిగిస్తోంది. నగరంలో నిఘా లోపించడంతోపాటు సీసీ కెమెరాలు అవసరమైన సంఖ్యలో లేకపోవడమే దొంగలకు వరంగా మారుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

వరుసచోరీలు నగరవాసుల్లో అలజడి రేపుతున్నాయి. ఇంటికి తాళం వేసి ఉంటే చాలు అదను చూసి పట్టపగలే తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా చినముషిడివాడలోని ఒక కిరణా వ్యాపారి భార్య ఈనెల తొమ్మిదిన సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటికి తాళం వేసి భర్తకు సాయం చేసేందుకు దుకాణం వద్దకు వెళ్లి తిరిగి ఆరు గంటలకు ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వారం తాళాలు విరగ్గొట్టి కనిపించాయి. ఇంట్లోకి వెళ్లి బీరువా తెరిచి చూసేసరికి 20 తులాల బంగారం. 15 తులాల వెండితోపాటు రూ.52 వేలు నగదు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫ ఈనెల ఎనిమిదిన రాత్రి వేపగుంట సమీపంలోని అప్పన్నపాలెంలో పక్కపక్కనే ఉన్న రెండిళ్లలో దొంగలు చొరబడి 13 తులాల బంగారం, 200 తులాలు వెండి వస్తువులు అపహరించుకుపోయారు.

ఫ గతనెల 27న దువ్వాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కిరాణా దుకాణానికి నడిచివెళుతున్న మహిళ మెడలోని బంగారం ఆభరణాలను బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తెంచుకుని పరారయ్యారు. అదే రోజు సీబీఎం కాంపౌండ్‌లో కూడా ఒక మహిళ మెడలోని ఆభరణాలను తెంచుకుని పోయారు.

ఫ గతనెల 25న పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే నాలుగు ఇళ్లలో వరుస చోరీలు జరిగాయి.

ఫ నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధి రైల్వేన్యూకాలనీలో ఉంటున్న విశ్రాంత పోస్టల్‌శాఖ ఉద్యోగి ఇంట్లో అతని కుమా ర్తె స్నేహితురాలైన సినీనటి సౌమ్య సుమారు 70తులాల బంగారాన్ని అపహరించుకుని పోయింది. ఆమెపై బాధితుడు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు తమదైనశైలిలో విచారించి కేసుని ఛేదించగలిగారు. అదే అనుమానం వ్యక్తంచేసి ఉండకపోతే నేరం ఎవరు చేశారనే దానిపై పోలీసులు ఇంతవరకూ ఒక అంచనాకు వచ్చే పరిస్థితి లేదు. నగరంలో గతనెలరోజులుగా ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట ఇళ్లలో చోరీలు, చైన్‌స్నాచింగ్‌లు జరుగుతూనే ఉండడం పోలీస్‌ వర్గాలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.

పోలీసులకు సవాల్‌

రాష్ట్రంలో విశాఖ నగరానికి ప్రాధాన్యం పెరగడంతో సీపీగా ఐజీ ర్యాంక్‌ స్థాయి అధికారి నుంచి అదనపు డీజీపీ స్థాయి ర్యాంక్‌ అధికారిని నియమించారు. అంతేకాకుండా కొత్తగా జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌తోపాటు జోన్‌-2కి రెగ్యులర్‌ డీసీపీగా ఐపీఎస్‌ అధికారిని కేటాయించారు. క్రైమ్‌ విభాగానికి నాన్‌కేడర్‌ ఐపీఎస్‌ అధికారిని డీసీపీగా నియమించారు. సీసీఎస్‌కు, క్రైమ్‌కు వేర్వేరుగా ఇద్దరు ఏసీపీలను కేటాయించారు. సీఐలతోపాటు ఎస్‌ఐలను కూడా భారీగానే కేటాయించారు. నగరంలో బందోబస్తులు, ప్రముఖుల పర్యటనలు, సమావేశాల కారణంగా అదనపు సిబ్బంది అవసరమని అధికారులు చెబుతున్నా, గతంలో పోల్చితే కేటాయింపు భారీగానే పెరిగిందని అంగీకరిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో నగరంలో నేరాలను కనీసస్థాయికి తగ్గించాల్సి ఉన్నప్పటికీ, దీనికి భిన్నంగా రోజురోజుకీ పెరుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పరిణామం పోలీస్‌ అధికారులకు సైతం సవాల్‌గానే మారిందనే చెప్పుకోవాలి. నేరాల నియంత్రణపై పోలీస్‌ అధికా రులు మాటలే తప్ప, ఆచరణలో చూపించకపోవడమే నేరాల పెరుగుదల కారణంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రాత్రి గస్తీ పక్కాగా జరిగేది. బీట్‌ల సంఖ్య కూడా ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ గరిష్ట సంఖ్యలో నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం రాత్రి గస్తీ, బీట్‌ల నిర్వహణ తూతూమంత్రంగా మారిపోయింది. రాత్రిగస్తీ సిబ్బంది కొంతసేపు నగరంలో తిరిగి తర్వాత ఏదో ఒకసినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసుకుని గడిపేయడం, లేదంటే ఇంటికి వెళ్లి నిద్రపోయి తెల్లవారుజామున తిరిగి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని బీట్‌బుక్‌ను అందజేస్తున్నారని పోలీస్‌ సిబ్బందే చెబుతుండడం పరిస్థితికి అద్దంపడుతోంది.

అధ్వానంగా సీసీ కెమెరాలు

నగరంలో నేర నియంత్రణే లక్ష్యంగా పదేళ్ల కిందట ప్రజా భద్రత చట్టం కింద ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు టార్గెట్లు విధించి రద్దీగా ఉండే ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, ఆలయాలు, కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయించారు. అపార్టుమెంట్ల అసోసియేషన్లతో సమావేశాలు ఏర్పాటుచేసి సీసీ కెమెరాలు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకున్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా దాదాపు 580 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి కూడలిలోనూ వీటిని ఏర్పాటుచేశారు. దీంతో ఎక్కడైనా చోరీ జరిగితే ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి అనుమానితులను గుర్తించేవారు. కానీ ప్రస్తుతం చాలా వరకు సీసీకెమెరాలు మూలకు చేరాయి. వాటికి మరమ్మతులు చేయించే నాథుడే లేకుండా పోయారు. పోలీసులు కూడా నేరం జరిగిన సందర్భగా సీసీ కెమెరాలపై హడావుడి చేసి తర్వాత వదిలేస్తున్నారు.

Updated Date - Mar 11 , 2024 | 01:35 AM