Share News

అడుగడుగునా నిఘా!

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:49 AM

బీచ్‌రోడ్డులో గురువారం పోలీసులు అత్సుత్సాహం ప్రదర్శించారు.

అడుగడుగునా నిఘా!

పోలీసులతో నిండిపోయిన బీచ్‌ రోడ్డు

రుషికొండ భవన సముదాయం ప్రారంభోత్సవం ప్రభావం

విస్తృత తనిఖీలతో జనం గగ్గోలు

విద్యాలయాల సిబ్బంది, ఐటీ ఉద్యోగుల అడ్డగింత

సామాన్యులకు తప్పని కష్టాలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి):

బీచ్‌రోడ్డులో గురువారం పోలీసులు అత్సుత్సాహం ప్రదర్శించారు. తెల్లవారు జాము నుంచి బీచ్‌రోడ్డును తమ అధీనంలోకి తీసుకున్నారు. రాకపోకలను నిర్బంధించారు. అడుగడుగునా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఐడీ కార్డులు లేని వారిని వెనక్కి పంపించారు. జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులను కూడా అనుమతించలేదు. ఇక్కడేదో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమం జరుగుతుందేమోనని అంతా అనుకున్నారు. కానీ జరిగింది ప్రభుత్వ కార్యక్రమం... రుషికొండపై నిర్మించిన భవన సముదాయ ప్రారంభోత్సవం. పర్యాటక శాఖా మంత్రి ఆర్‌కే రోజాతో పాటు ఐటీ శాఖా మంత్రి అమర్‌నాథ్‌ దీనికి హాజరయ్యారు.

రుషికొండపై భవన నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచీ బీచ్‌రోడ్డుపై ప్రయాణమంటేనే నగరవాసులు హడలెత్తిపోతున్నారు. ఈ ప్రాంతంలో ఏ చిన్న కార్యక్రమమైనా పోలీసులతో నింపేస్తున్నారు. విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. రాకపోకలపై విపరీతమైన ఆంక్షలు విధిస్తున్నారు. ఫలితంగా పోలీసుల తీరుపై జిల్లా వాసుల్లో తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోంది. రుషికొండపై ప్రజాధనంతో నిర్మించిన భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం చేసిన హడావుడిపైనా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టూరిజం శాఖ ఆధ్వర్యంలో పర్యాటకుల కోసం నిర్మించిన భవనాలు అంటూ మంత్రులు ఆర్‌కే రోజా, గుడివాడ అమర్‌నాథ్‌ ప్రకటించారు. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం లేకుండా అడ్డంకులు ఎందుకు సృష్టిస్తున్నారో మంత్రులు గానీ, అధికారులు, పోలీసులు గానీ సమాధానం ఇవ్వడం లేదు. అన్ని అనుమతులతో పక్కాగా నిర్మాణాలు జరిగాయని చెబుతున్నప్పటికీ, ఇంతలా ప్రజలను నిర్బంధించి కార్యక్రమం నిర్వహించడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఉద్యోగులకు నరకయాతన

బీచ్‌రోడ్డులో పలు విద్యాలయాలు ఉన్నాయి. ఐటీ కంపెనీలు కూడా ఇదే మార్గంలో ఏర్పాటు చేశారు. వీటిలో వందల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. నగరంలో నివాసముంటూ ప్రతిరోజూ ఆయా కార్యాలయాలకు వెళ్లి, వస్తుంటారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఉద్యోగులకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఏ చిన్న కార్యక్రమం జరిగినా వందల సంఖ్యలో పోలీసులను మోహరించడం, తనిఖీల పేరుతో ఉద్యోగులను వేధించడం రివాజుగా మారిపోయింది. గురువారం కూడా ఇదే పరిస్థితి ఎదురయింది. ద్విచక్రవాహనాలు, కార్లలో వస్తున్న ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. విస్తృత తనిఖీలు, శల్య పరీక్షలు నిర్వహించారు. ఎక్కడ పనిచేస్తున్నారో వివరాలను ఆరా తీశారు. ఐడీ కార్డులు చూపించినప్పటికీ.. ఆయా కంపెనీలకు మరో దారి లేకపోతేనే రుషికొండ మీదుగా ప్రయాణానికి అనుమతించారు. లేదంటే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలంటూ వెనక్కి పంపించేశారు. ఫలితంగా సమయానికి కార్యాలయాలకు చేరుకోలేకపోయామని పలువురు వాపోయారు.

మీడియాపైనా ఆంక్షలు

బీచ్‌రోడ్డులో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు అనుమానితులను రుషికొండ వైపు వెళ్లకుండా వెనక్కి పంపించారు. మీడియా ప్రతినిధులను కూడా రుషికొండ పరిసరాల వరకు చేరనివ్వలేదు. రుషికొండ రహదారికి ఇవతల వైపు నిల్చొని లోపలికి వెళ్తున్న వాహనాల ఫొటోలు తీసుకున్న ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి మొబైల్‌ ఫోన్‌ని ఓ పోలీస్‌ అధికారి లాక్కున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ రుషికొండకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసి, ముందుగానే హౌస్‌ అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేయడంతో రుషికొండ వరకు వెళ్లకుండా ఆపేశారు. సీఎం జగన్‌ పర్యటనల్లో భద్రత పేరుతో హడావుడి చేసే పోలీసులు ప్రభుత్వ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా ఇన్ని అడ్డంకులు కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Updated Date - Mar 01 , 2024 | 12:49 AM