Share News

సరకులు కొంటేనే ఆసరా!

ABN , Publish Date - May 19 , 2024 | 12:36 AM

పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘ఆసరా’ పథకం నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమకావాలంటే డ్వాక్రా మాల్‌లో సరకులు కొనుగోలు చేయాల్సిందేనని ఐకేపీ సిబ్బంది కండిషన్‌ పెడుతుండడంపై డ్వాక్రా మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా సరకులు ఎలా కొనుగోలు చేస్తామని, అయినా ప్రభుత్వం ఇచ్చిన నిధులపై వీరి పెత్తనమేమిటని ప్రశిస్తు

సరకులు కొంటేనే ఆసరా!
ఎస్‌.రాయవరంలోని డ్వాక్రా మాల్‌ పథకం నిధులు జమ చేసేందుకు లింకు

డ్వాక్రా మాల్‌లో కనీసం రూ.500 సరకులు తీసుకోవాలని ఐకేసీ సిబ్బంది కండిషన్‌

లబోదిబోమంటున్న డ్వాక్రా మహిళలు

డిమాండ్‌ చేయడం లేదంటున్న ఏపీఎం

పాయకరావుపేట, మే 18:

పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘ఆసరా’ పథకం నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమకావాలంటే డ్వాక్రా మాల్‌లో సరకులు కొనుగోలు చేయాల్సిందేనని ఐకేపీ సిబ్బంది కండిషన్‌ పెడుతుండడంపై డ్వాక్రా మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా సరకులు ఎలా కొనుగోలు చేస్తామని, అయినా ప్రభుత్వం ఇచ్చిన నిధులపై వీరి పెత్తనమేమిటని ప్రశిస్తున్నారు.

పాయకరావుపేట మండలంలో 1,830 డ్వాక్రా సంఘాల సభ్యులకు వైఎస్‌ఆర్‌ ఆసరా నాల్గో విడత సాయంగా ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో రూ.16.3 కోట్లు విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు ఆ నిధులు డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాలకు జమకాకపోవడంతో డబ్బులు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు నిధులు విడుదల కాలేదని, పోలింగ్‌ ముగిసిన తరువాత వస్తాయని ఐకేపీ సిబ్బంది చెబుతూ వస్తున్నారు. కాగా ఈనెల 13న పోలింగ్‌ ముగియడంతో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీంతో డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాలకు ఆసరా నిధులు జమయ్యాయి. అయితే ఈ నిధులను డ్వాక్రా సభ్యుల వ్యక్తిగత ఖాతాలకు జమచేయాల్సి ఉంది.

ఇక్కడే అసలు మెలిక...

ప్రతి మహిళకూ ఆసరా నిధులు అందాలంటే ఎస్‌.రాయవరం మండలంలో డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మాల్‌లో కనీసం రూ.500 సరకులు కొనుగోలు చేసి రశీదు చూపాలని ఐకేపీ సిబ్బంది మెలిక పెట్టారు. దీంతో మహిళలు లబోదిబో మంటున్నారు. తమకు అవసరమైనపుడు సరకులు కొనుగోలు చేసుకుంటామని, ఐకేపీ సిబ్బంది ఇలా బలవంతం చేయడం సరికాదని పలువురు వాపోతున్నారు. దీనిపై ఐకేపీ ఏపీఎం రాజుబాబును వివరణ కోరగా మహిళలంతా తప్పనిసరిగా సరకులు కొనాలని తాము చెప్పలేదన్నారు. డ్వాక్రా మాల్‌లో సరకుల అమ్మకాలకు సంబంధించి సిబ్బందికి టార్గెట్లు విధించడంతో మోటివేషన్‌ కోసం కొనుగోలు చేయమని మాత్రమే సిబ్బంది అడుగుతున్నారని వివరించారు. ఆసరా నిధులు విడుదలకు సంబంధించి ఐకేపీ సిబ్బంది ఇబ్బంది పెట్టినా, డబ్బులు డిమాండ్‌ చేసినా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.

Updated Date - May 19 , 2024 | 12:36 AM