Share News

సెలవులో సూపరింటెండెంట్‌

ABN , Publish Date - May 30 , 2024 | 01:34 AM

కేజీహెచ్‌లో కొద్దిరోజులుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అశోక్‌కుమార్‌ సెలవు పెట్టారు. బుధవారం ఆయన విధులకు గైర్హాజరయ్యారు. ఇంటి వద్ద నుంచే సెలవుకు సంబంధించిన లెటర్‌ను ఉన్నతాధికారులకు పంపించినట్టు చెబుతున్నారు.

సెలవులో సూపరింటెండెంట్‌

డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌

డాక్టర్‌ వాణికి కేజీహెచ్‌ బాధ్యతలు

రెండు, మూడు రోజుల్లో

మరొకరికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం

డాక్టర్‌ అశోక్‌కుమార్‌ భార్య అరుణకుమారి విమ్స్‌కు బదిలీ

విశాఖపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌లో కొద్దిరోజులుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అశోక్‌కుమార్‌ సెలవు పెట్టారు. బుధవారం ఆయన విధులకు గైర్హాజరయ్యారు. ఇంటి వద్ద నుంచే సెలవుకు సంబంధించిన లెటర్‌ను ఉన్నతాధికారులకు పంపించినట్టు చెబుతున్నారు. ఆయనపై నర్సింగ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఒకరు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడిచిన 30 ఏళ్ల నుంచి ఉద్యోగ జీవితంలో ఎలాంటి మచ్చ లేని తనపై ఇలాంటి ఆరోపణలు రావడం చాలా బాధాకరమని సన్నిహితుల వద్ద డాక్టర్‌ అశోక్‌కుమార్‌ ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది.

ఇదిలావుంటే కేజీహెచ్‌లో వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. సూపరింటెండెంట్‌ అశోక్‌కుమార్‌ భార్య అరుణదేవిని వర్క్‌ ఆర్డర్‌ పేరుతో విమ్స్‌కు బదిలీ చేశారు. ఎమర్జన్సీ డిపార్ట్‌మెంట్‌లో మెడికల్‌ ఆఫీసర్‌గా ఆమెను నియ మించారు. ఈ మేరకు డీఎంఈ ఆదేశాలు జారీచేశారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ చేపట్టేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలావుంటే సూపరింటెండెంట్‌ సెలవుపై వెళ్లడంతో ఆ బాధ్యతలను తాత్కాలికంగా డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్‌ వాణికి అప్పగించారు. రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను వేరొకరికి అప్పగించే అవకాశం ఉంది. విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాంబాబు, ఆర్థో విభాగాధిపతి డాక్టర్‌ శివానంద్‌, శ్రీకాకుళంలో పనిచేస్తున్న డాక్టర్‌ ధర్మారావు పేర్లు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు ఎవరిని నియమిస్తారో చూడాల్సి ఉంది. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అశోక్‌కుమార్‌కు మద్దతుగా పలువురు వైద్యులు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు చెబుతున్నారు. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా అందరితో మంచిగా వ్యవహరించే ఆయన విషయంలో ఇలా జరగడం బాధాకరమని, ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరినట్టు చెబుతున్నారు.

ఇరువర్గాల మధ్య విభేదాలే కారణం

కేజీహెచ్‌లో ప్రస్తుత వివాదానికి ఇరువర్గాల మధ్య తలెత్తిన వ్యక్తిగత విభేదాలే కారణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలిసింది. డాక్టర్‌ అశోక్‌కుమార్‌ భార్య డాక్టర్‌ అరుణ కేజీహెచ్‌లోని ఒక విభాగంలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసేవారని, ఆయన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమెకు ఏకంగా ఏఆర్‌ఎంఓగా కీలకమైన బాధ్యతలు అప్పగించారని పోలీసుల విచారణలో తేలింది. ఆ సమయంలోనే డాక్టర్‌ అరుణకు మరికొందరు వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందికి మధ్య తలెత్తిన విభేదాల కారణంగానే సూపరింటెండెంట్‌కు, ఇతర అధికారులకు మధ్య ఆధిపత్య పోరు మొదలైందని పోలీసులు పేర్కొంటున్నారు. వేరే విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగిని అయిన డాక్టర్‌ అరుణకు ఏఆర్‌ఎంఓ బాధ్యతలు అప్పగించడంపై కొంతమంది డీఎంఈ కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించారని పోలీసులు తమ విచారణలో గుర్తించినట్టు సమాచారం. తాజాగా కేజీహెచ్‌లోని నర్సింగ్‌ సూపరింటెండెంట్‌తోపాటు డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఓ వంటి వారిపై డీఎంఈ కార్యాలయానికి ఫిర్యాదులు అందడంతో వాటిపై అక్కడి అధికారులు విచారణ జరిపి సరండర్‌ చేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించడం జరిగింది. దీంతో విభేదాలు తారస్థాయికి చేరినట్టు పోలీసులు భావిస్తున్నారు. తాము డాక్టర్‌ అరుణపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామనే అనుమానంతో తమపై సూపరింటెండెంటే కావాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయించి, కక్ష తీర్చుకుంటున్నారని ఇటీవల సరండర్‌ అయినవారు భావిస్తున్నారని, అదే తాజా వివాదానికి కారణమై ఉంటుందని కొంతమంది పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుంటే వైద్య పరీక్షలు పూర్తయి, నివేదికలు వచ్చిన తర్వాతే దీనిపై ఏదైనా అధికారికంగా మాట్లాడగలమని పోలీస్‌ అధికారులు స్పష్టంచేస్తున్నారు.

Updated Date - May 30 , 2024 | 08:35 AM