Share News

ప్రచారంపై ఎండ ప్రతాపం!

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:48 AM

గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఎండ తీవ్రత అభ్యర్థుల ప్రచారంపై పడుతోంది.

ప్రచారంపై ఎండ ప్రతాపం!

  • బయటకు వచ్చేందుకు భయపడుతున్న నేతలు, కేడర్‌

  • 40 డిగ్రీలు దాటుతున్న పగటి ఉష్ణోగ్రతలు

  • వేడిమి నేపథ్యంలో ప్రచారం స్టైల్‌ మార్చిన పార్టీలు

  • ఉదయం 6 నుంచి పది గంటల వరకు

  • సాయంత్రం నాలుగు తరువాత ప్రచారానికి మొగ్గు

  • సభలు, సమావేశాలూ సాయంత్రం వేళల్లోనే

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఎండ తీవ్రత అభ్యర్థుల ప్రచారంపై పడుతోంది. పగటిపూట బయటకు వచ్చేందుకే జనం భయపడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ప్రచారానికి విరామమే మంచిదని అభిప్రాయపడుతున్నారు. దీంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచార స్టైల్‌ మార్చారు. ఉదయం ఆరు గంటలకే ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్న నాయకులు పది గంటల తరువాత కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. మళ్లీ సాయంత్రం నాలుగు తరువాతే జనంలోకి వచ్చి ప్రచారం చేస్తున్నారు.

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఎండలు తీవ్రతరమయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భరించలేనంత ఎండలు కాస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు కూడా వీస్తున్నాయి. ఉదయం పదిగంటలకే భానుడు చుర్రుమనిపిస్తుండడంతో ప్రచారం చేసేందుకు పార్టీల నాయకులు, కార్యకర్తలు భయపడుతున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో అన్ని పార్టీల నేతలు ఉదయం నుంచి రాత్రి పదిగంటల వరకు ప్రచారం చేయడానికే మొగ్గుచూపుతారు. అయితే మండు వేసవిలో ఎన్నికలు కావడంతో అలాంటి ప్రచారాలకు చెక్‌ పడింది. ఎండలకు తోడు వడగాడ్పులకు రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో ప్రచారం చేసేవారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ దెబ్బకు భయపడి అనేక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు దాటిన తరువాతే పోటీలోని అభ్యర్థులు, కేడర్‌ బయటకు వచ్చి ప్రచారం సంగతి చూస్తున్నారు. మరికొన్నిచోట్ల ఉదయం ఆరుగంటల నుంచి పదిగంటల వరకు ర్యాలీలు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఆ తరువాత పార్టీ కార్యాలయాల్లో ఆయా సామాజిక వర్గాలు, ఇతర వర్గాల నేతలతో సమావేశాలు, సమీక్షలు, అసంతృప్తి నేతలకు బుజ్జగింపులు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఎండలో ప్రచారం కోసం వచ్చే నాయకులు, కార్యకర్తలకు అయ్యే ఖర్చు పెరుగుతోందని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు శీతలపానీయాలు, ఐస్‌ వాటర్‌ను వారికి అందించాల్సి రావడం వ్యయ ప్రయాసలకు గురిచేస్తోందని వాపోతున్నారు.

సభలు, సమావేశాలూ సాయంత్రమే

జిల్లాలో ఆయా పార్టీల ముఖ్య నేతల పర్యటనలు, రోడ్‌షోలు, బహిరంగ సభలను కూడా సాయంత్రం వేళలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఎండలకు భయపడి ప్రచారం కూడా చేయలేని స్థితిలో పగటిపూట సమావేశాలు పెడితే జనం వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఎండ ప్రభావం ప్రచారంపై పడిందని పలువురు అభ్యర్థులు అంగీకరిస్తున్నారు. మరో 20 రోజులు ప్రచారం చేయాల్సి ఉండడం, ఎండలు మరింతగా పెరగనున్న నేపథ్యంలో రాజకీయపార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

వేసవి ఎండల ప్రభావం ప్రచారంపై పడుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. గాడ్పుల ప్రభావం అంతగా లేకపోయినా రోజుల తరబడి ఎండలు కొనసాగుతున్నందున వాతావరణం వేడెక్కుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలప్రచారం చేసే అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటలలోపే ప్రచారం ముగించాలని, అభ్యర్థులు, అనుచరులు ఎప్పటికప్పుడు తాగునీరు తీసుకోవాలంటున్నారు. ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం తలపై టోపీలు ధరిస్తే వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుందంటున్నారు. ఉదయం పదిగంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకపోవడమే మంచిదంటున్నారు. మధ్యాహ్న సమయంలో రాయలసీమ, కోస్తాలో మారుమూల ప్రాంతాల్లో ప్రచారం చేయవద్దని, తీరప్రాంతతో పోల్చితే ఈ ప్రాంతాల్లో బయటకు వస్తే వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 01:48 AM