Share News

కలెక్టరేట్‌ వద్ద ఒకరి ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:25 AM

తన పూరిల్లు కాలిపోయి ఏడాదిన్నర దాటినా ప్రభుత్వం నుంచి పరిహారం సొమ్ము అందలేదంటూ ఓ వ్యక్తి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

కలెక్టరేట్‌ వద్ద ఒకరి ఆత్మహత్యాయత్నం

  • గతంలో కాలిపోయిన పూరింటికి పరిహారం ఇవ్వలేదని మనస్తాపం

  • ఆస్పత్రికి తరలించిన కలెక్టరేట్‌ సిబ్బంది

  • చికిత్స చేయడంతో తప్పిన ప్రాణాపాయం

  • రూ.8 వేలు సాయం చెక్కు అందించిన ఆర్డీవో

అనకాపల్లి కలెక్టరేట్‌/మాకవరపాలెం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):

తన పూరిల్లు కాలిపోయి ఏడాదిన్నర దాటినా ప్రభుత్వం నుంచి పరిహారం సొమ్ము అందలేదంటూ ఓ వ్యక్తి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కలెక్టరేట్‌ సిబ్బంది వెంటనే అతడిని ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

మాకవరపాలెం మండలం తూటిపాల గ్రామానికి చెందిన అనిమిరెడ్డి రమణ ప్రభుత్వం స్థలం సుమారు మూడు సెంట్లలో తాటి ఆకులతో ఇంటిని నిర్మించుకుని నివాసం ఉండేవాడు. గత ఏడాది మే నెలలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఇల్లు కాలిపోయింది. అప్పటి తహసీల్దార్‌, డీటీ విచారణ చేసి ప్రభుత్వం నుంచి రూ.8 వేలు పరిహారంగా అందించాలని నాటి జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపారు. పూరిల్లు కాలిపోయిన బాధితులకు నాటి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి పరిహారం ఇచ్చేది కాదు. ఈ కారణంగా రమణకు కూడా పరిహారం మంజూరుకాలేదు. కానీ ఈ విషయం రమణకు తెలియక పరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీ ఇవ్వడానికి వచ్చాడు. కార్యాలయం బయట పురుగుల మందు తాగిన రమణ...లోపల సమావేశ మందిరంలో అర్జీ ఇవ్వడానికి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కలెక్టరేట్‌ సిబ్బంది వెంటనే స్పందించి ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పింది. ఇదిలావుండగా అనకాపల్లి ఆర్డీవో షేక్‌ ఆయీషా ఎన్టీఆర్‌ వైద్యాలయానికి వెళ్లి రమణను పరామర్శించారు. ఇల్లు కాలిపోయినందుకు పరిహారం కింద రూ.8 వేల చెక్కును అందజేశారు.

తూటిపాలలో నర్సీపట్నం ఆర్డీవో విచారణ

తూటిపాలకు చెందిన అనిమిరెడ్డి రమణ కలెక్టరేట్‌కు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడంతో జిల్లా కలెక్టర్‌ స్పందించారు. వెంటనే గ్రామానికి వెళ్లి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణను ఆదేశించారు. దీంతో ఆయన సోమవారం మధ్యాహ్నం తూటిపాల వెళ్లి అనిమిరెడ్డి రమణ గురించి గ్రామస్థులను విచారించారు. గతంలో కాలిపోయిన పూరింటి స్థానంలో రేకుల షెడ్డు నిర్మించాడని, అతనికి 1.8 ఎకరాల భూమి ఉందని గుర్తించారు. ఈ మేరకు కలెక్టర్‌కు నివేదిక పంపినట్టు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.

Updated Date - Dec 31 , 2024 | 01:25 AM