Share News

వరండాలో చదువులు

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:21 AM

‘ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతాం. అన్ని వసతులు కల్పిస్తాం. విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని వైసీపీ ప్రభుత్వం తరచూ చెప్పే మాటలివి. అయితే ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లోని పాఠశాలలను పరిశీలిస్తే ఈ మాటలు ఒట్టి బూటకాలని తేలిపోతుంది.

వరండాలో చదువులు
వరండాలో చదువుకుంటున్న విద్యార్థులు

శిథిలావస్థలో చీడిపల్లి ప్రాథమిక పాఠశాల భవనం

రెండేళ్ల క్రితం భవనం పైకప్పు ధ్వంసమైనా పట్టించుకోని అధికారులు

విద్యార్థులు, ఉపాధ్యాయులకు తప్పని ఇబ్బందులు

కొయ్యూరు, ఏప్రిల్‌ 4: ‘ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతాం. అన్ని వసతులు కల్పిస్తాం. విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని వైసీపీ ప్రభుత్వం తరచూ చెప్పే మాటలివి. అయితే ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లోని పాఠశాలలను పరిశీలిస్తే ఈ మాటలు ఒట్టి బూటకాలని తేలిపోతుంది. అందుకు ఉదాహరణే బూదరాళ్ల పంచాయతీ శివారు చీడిపల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల. శిథిల భవనంలో ఈ పాఠశాల కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.

మండలంలోని బూదరాళ్ల పంచాయతీ శివారు చీడిపల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. రెండేళ్ల క్రితం వీచిన బలమైన గాలులకు భవనం పైకప్పు రేకులు ధ్వంసమయ్యాయి. భవనం గోడలు బీటలు వారాయి. గచ్చులు పెచ్చులూడాయి. ఈ పాఠశాలలో సుమారు 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఇద్దరు ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. ఈ భవనం పైకప్పు లేకపోవడంతో విద్యార్థులను ఉపాధ్యాయులు వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లామని, కానీ పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పాఠశాల భవనాలు మండలంలో మారుమూల కొండలపై సుమారుగా 10 వరకు ఉన్నాయి. ఇవి కొండలపై ఉండడం వల్లే అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై ఎంఈవో రాంబాబు వివరణ కోరగా చీడిపల్లి పాఠశాలను నాడు- నేడు పథకం రెండో విడతలో వర్తింపజేయడానికి నివేదికలు ఇచ్చినా నిధులు కేటాయించలేదన్నారు. రానున్న విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ పాఠశాలకు అన్ని వసతులు కల్పించేలా ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు.

Updated Date - Apr 05 , 2024 | 01:21 AM