Share News

విద్యార్థుల మందు పార్టీ!

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:31 AM

వారంతా ఎనిమిది నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు...డిసెంబరు 31వ తేదీ రాత్రి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మందు పార్టీ చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.

విద్యార్థుల మందు పార్టీ!
మందు పార్టీలో మునిగి తేలుతున్న విద్యార్థులు

అంతా పదో తరగతిలోపు వారే...

చోడవరం, జనవరి 2: వారంతా ఎనిమిది నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు...డిసెంబరు 31వ తేదీ రాత్రి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మందు పార్టీ చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్థానిక కో-ఆపరేటివ్‌ కాలనీలోని బీసీ బాలుర వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులు 31వ తేదీ రాత్రి పక్కన నిర్మాణంలో ఉన్న భవనంలో మందు పార్టీ చేసుకున్నారు. వీరితో స్థానికంగా ఉన్న మరో ఇద్దరు యువకులు జత కలిశారు. బీరు తాగుతుండడాన్ని ఆ ఇద్దరు యువకులలో ఒకరు తన సెల్‌ఫోన్‌తో చిత్రీకరించడంతో విద్యార్థులు గొడవకు దిగారు. ఆ తరువాత కొంతసేపటికి అంతా సద్దుమణిగింది. అయితే విద్యార్థుల మందు పార్టీకి సంబంధించిన వీడియో మంగళవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ హాస్టల్‌ కొంతకాలం ఇన్‌చార్జి వార్డెన్‌ ఆధ్వర్యంలో నడిచింది. ఇప్పుడా ఇన్‌చార్జి వార్డెన్‌ చిన్నయ్యే రెగ్యులర్‌ వార్డెన్‌గా బాధ్యతలు చేపట్టారు. వార్డెన్‌ దిగువ స్థాయి సిబ్బందిపై భారం వేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే విద్యార్థులపై అజమాయిషీ కొరవడిందని స్థానికు అంటున్నారు.

పది గంటల వరకూ హాస్టల్‌లోనే ఉన్నా: వార్డెన్‌ చిన్నయ్య

కాగా హాస్టల్‌ విద్యార్థులు అందరూ మందు పార్టీలో మునిగితేలుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నా వార్డెన్‌ చిన్నయ్య మాత్రం 31వ తేదీ రాత్రి పది గంటల వరకూ తాను హాస్టల్‌లోనే ఉన్నానని, ఆ తరువాత ఇంటికి వెళ్లానని చెబుతున్నారు. తాను హాస్టల్‌ నుంచి వెళ్లిన తరువాత విద్యార్థులు ఏం చేశారో తెలియన్నారు. మళ్లీ ఆయనే...ఎవరో తాగుతుంటే చూడడానికి తమ హాస్టల్‌ విద్యార్థులు వెళ్లారు తప్పితే, వారు తాగలేదని చెప్పడం కొసమెరుపు.

Updated Date - Jan 03 , 2024 | 01:31 AM