Share News

నత్తనడకన పనులు

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:53 AM

ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను శరవేగంగా పూర్తి చేస్తామని, వాటికి నిధుల కొరత లేదని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌ల భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుం డడమే దీనికి ఉదాహరణ.

నత్తనడకన పనులు
నర్సీపట్నం మండలం అమలాపురంలో పునాదుల స్థాయులో నిలిచిపోయిన విలేజ్‌ క్లినిక్‌

నియోజకవర్గానికి 61 సచివాలయాలు, 59 ఆర్‌బీకేలు, 49 హెల్త్‌ క్లినిక్‌లు మంజూరు

మూడున్నర సంవత్సరాలు దాటుతున్నా పూర్తి స్థాయిలో కాని పనులు

కాంట్రాక్టర్లకు సకాలంలో అందని బిల్లులు

ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకూ గ్రహణం

నర్సీపట్నం, జనవరి 20: ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను శరవేగంగా పూర్తి చేస్తామని, వాటికి నిధుల కొరత లేదని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌ల భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుం డడమే దీనికి ఉదాహరణ. కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల రాకపోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నట్టు సమాచారం.

వైసీపీ ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం నియోజకవర్గంలోని నర్సీపట్నం, నాతవరం, మాకవరపాలెం, గొలుగొండ మండలాలకు 52 రైతు భరోసా కేంద్రాలు, 61 సచివాలయాలు, 49 విలేజ్‌ క్లినిక్‌ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సచివాలయాల కొత్త భవనాలకు రూ.40 లక్షలు, పంచాయతీ కార్యాలయాల మీద నిర్మాణం చేసే భవనాలకు రూ.25 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేసింది. హెల్త్‌ క్లినిక్‌లకు రూ.17.5 లక్షలు, రైతు భరోసా కేంద్రాలకు రూ.21.8 లక్షలు మంజూరు చేసింది గ్రామాల్లో ఎంతో అట్టహాసంగా నిర్మాణాలు ప్రారంభించారు. ప్రతీ గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌లు, సచివాలయాలకు పక్కా భవనాలు అందుబాటులోకి వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. అయుతే నర్సీపట్నం నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, సచివాలయాల పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు రూ.4 కోట్లు వరకు బిల్లులు బకాయిలు పేరుకుపోయాయి. రెండు నెలలుగా కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తేనే పనులు చేద్దామని కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.

నత్తనడకన పనులు

నియోజకవర్గంలో 61 సచివాలయాల భవనాలు మంజూరు కాగా మూడున్నర ఏళ్లలో 47 భవనాలను మాత్రమే పూర్తి చేశారు. 49 హెల్త్‌ క్లినిక్‌లకు 18 భవనాలు పూర్తి చేశారు. రైతు భరోసా కేంద్రాలు 59 మంజూరు కాగా, వాటిలో ఏడు పునాదుల స్థాయిలో ఉండడంతో వాటిని వదిలేసి, మిగిలిన 52 భవనాల పనులు చేపట్టగా 29 భవనాలు పూర్తి చేశారు. మిగిలిన భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని చోట్ల నిర్మాణాలు నిలిచిపోయి అసంపూర్తిగా మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి.

Updated Date - Jan 21 , 2024 | 12:53 AM