Share News

అంగన్‌వాడీలకు మొండిచేయి!

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:30 AM

హామీ ఇచ్చి 50 రోజులు పూర్తి కావస్తోంది.

అంగన్‌వాడీలకు  మొండిచేయి!

సమ్మె కాలానికి అందని వేతనాలు

మంత్రి మాట ఇచ్చినా అమలుకు నోచని వైనం

ఫిబ్రవరి వేతనాలకూ ఎదరుచూపులే

ఆరు నెలలుగా గ్యాస్‌, కూరగాయలు బిల్లులు పెండింగ్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి):

అంగన్‌వాడీల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమ్మె కాలానికి కూడా వేతనాలు చెల్లిస్తాం’

42 రోజులపాటు నిరవధిక సమ్మె చేసిన అంగన్‌వాడీ అసోసియేషన్‌ నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఇచ్చిన హామీ.

హామీ ఇచ్చి 50 రోజులు పూర్తి కావస్తోంది. ఇప్పటివరకు సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను చెల్లించలేదు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తున్నా ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదని సిబ్బంది వాపోతున్నారు.

జిల్లా వ్యాప్తంగా 770 అంగన్‌వాడీ కేంద్రాల్లో సుమారు 1,500 మంది కార్యకర్తలు, ఆయాలు పనిచేస్తున్నారు. సమ్మె కాలానికి కార్యకర్తకు రూ.15,350, ఆయాకు రూ.9,340 చొప్పున చెల్లించాల్సి ఉంది. సాక్షాత్తూ మంత్రి హామీ ఇచ్చి వారాలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో అసోసియేషన్‌ నాయకులను సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. తక్షణం వేతనం జమయ్యేలా చూడాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో మంత్రులను కలిసేందుకు అంగన్‌వాడీ అసోసియేషన్‌ నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఫిబ్రవరి వేతనాలేవీ?

ఇదిలా ఉండగా మార్చి పదో తేదీ వచ్చినా ఫిబ్రవరి నెల వేతనాలు ఇప్పటివరకు సిబ్బందికి జమకాలేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఆయాకు రూ.7 వేలు, కార్యకర్తకు రూ.11,500 చొప్పున చెల్లించాల్సి ఉంది. సమ్మె కాలానికి సంబంధించిన బకాయిలు, ఫిబ్రవరి వేతనం కలిపి ఒక్కో ఆయాకు రూ.16,340, కార్యకర్తకు రూ.26,850 చొప్పున ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే బకాయిలు చెల్లించాలని అంగన్‌వాడీ సిబ్బంది కోరతున్నారు.

బిల్లులకూ మోక్షం లేదు

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అక్కడే భోజనం వండి,వడ్డిస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే కూరగాయలు, ఇతర వంట సామగ్రితో పాటు వంట గ్యాస్‌ కొనుగోలు చేస్తుంటారు. ఇందుకయ్యే ఖర్చుకు సంబంధించిన బిల్లులు సమర్పిస్తే ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే గత జూలై నుంచి నవంబరు వరకు, మళ్లీ ఫిబ్రవరి నెలకు సంబంధించిన బిల్లులన్నింటినీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. కేంద్రాలకు వచ్చే చిన్నారుల సంఖ్యను బట్టి ఒక్కో కేంద్రానికి నెలకు రూ.వెయ్యి రూ.2,500 వరకు ఖర్చవుతుంది. ఒక్కో కార్యకర్తకు ఆరు నెలలకు సంబంధించి రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు బిల్లులను చెల్లించాల్సి ఉంది. ప్రతి నెలా బిల్లులు పెట్టడం మినహా చెల్లింపులపై అధికారులు పెదవి విప్పడం లేదని అంగన్‌వాడీలు వాపోతున్నారు.

Updated Date - Mar 11 , 2024 | 01:30 AM