రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:27 AM
రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ ధాత్రిరెడ్డి హెచ్చరించారు. మండలంలోని 12 ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం బియ్యం అందలేని నిర్వాహకుల ఫిర్యాదు మేరకు సబ్ కలెక్టర్ సోమవారం విచారణ చేపట్టారు.
- సబ్ కలెక్టర్ ధాత్రిరెడ్డి హెచ్చరిక
- పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం బియ్యం సరఫరాపై విచారణ
- సేల్స్‌మన్, సూపరింటెండెంట్ తొలగింపు
గూడెంకొత్తవీధి, ఫిబ్రవరి 5: రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ ధాత్రిరెడ్డి హెచ్చరించారు. మండలంలోని 12 ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం బియ్యం అందలేని నిర్వాహకుల ఫిర్యాదు మేరకు సబ్ కలెక్టర్ సోమవారం విచారణ చేపట్టారు. ఆమె తొలుత జీకేవీధి డీఆర్ డిపో, జీసీసీ గోదామును సందర్శించి మధ్యాహ్న భోజన పథకం బియ్యం పంపిణీపై ఆరా తీశారు. రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం స్థానిక ఎంపీయూపీ పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. డీఆర్ డిపో నుంచి బియ్యం సరఫరా చేయకపోవడం వల్ల అప్పు చేసి విద్యార్థులకు భోజనాలు పెడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం బియ్యం పంపిణీలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన జీకేవీధి డీఆర్ డిపో సేల్స్‌మన్ తొలగించాలని, రేషన్ సరకుల పంపిణీ బాధ్యతలను స్థానిక వీఆర్వోకు అప్పగించాలన్నారు. విధి నిర్వహణలో జీసీసీ గోదాము సూపరింటెండెంట్ లోపాలను గుర్తించి, ఆయనను తొలగించి సీనియర్ ఉద్యోగికి బాధ్యతలు అప్పగించాలని జీసీసీ డీఎం పి.దేవరాజును ఆదేశించారు. డీఆర్ డిపోను సీజ్ చేసి పౌరసరఫరాల శాఖ అధికారుల ఆధీనంలో ఉంచాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం బియ్యం పంపిణీపై నిర్లక్ష్యం ప్రదర్శించిన జీకేవీధి జీసీసీ బ్రాంచి మేనేజర్, ఉప తహసీల్దార్‌లకు షోకాజు నోటీసులు జారీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం రేషన్ సరఫరాపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు.