అభివృద్ధి దిశగా అడుగులు
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:02 AM
గడచిన ఏడాది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లాను ముందుకు నడిపించడానికి కీలక స్థానాల్లో అధికారులుగా కొత్తవారికి అవకాశం కల్పించింది.

పాలనను గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం యత్నం
కీలక స్థానాల్లోకి కొత్త అధికారులు
పర్యాటకంగా మరో మెట్టు ఎక్కిన విశాఖ
కైలాసగిరిపై స్కై సైక్లింగ్, జిప్ లైనర్
ఐటీ రంగానికి ఊపిరిలూదిన మంత్రి లోకేశ్
నగరానికి టీసీఎస్
గూగుల్‌తోనూ ఒప్పందం
స్టీల్‌ప్లాంటుకు కేంద్రం సాయం
బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి పీవీ సింధు శ్రీకారం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
గడచిన ఏడాది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లాను ముందుకు నడిపించడానికి కీలక స్థానాల్లో అధికారులుగా కొత్తవారికి అవకాశం కల్పించింది. కలెక్టర్‌గా హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్‌గా శంఖబ్రత బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్‌గా సంపత్‌కుమార్, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా విశ్వనాథన్‌లు బాధ్యతలు చేపట్టారు.
పర్యాటకంగా చూసుకుంటే సందర్శకులకు ఈ ఏడాది నవంబరులో కైలాసగిరిపై స్కై సైక్లింగ్, జిప్ లైనర్ అందుబాటులోకి వచ్చాయి. యూహెచ్-3 హెచ్ హెలికాప్టర్ మ్యూజియం కూడా సిద్ధమవుతోంది. రుషికొండపై వైసీపీ హయాంలో రూ.500 కోట్లతో నిర్మించిన ప్యాలెస్‌ను సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు పరిశీలించారు. అది పర్యాటకులకు ఉపయోగపడదని తేలిపోయింది. వీఎంఆర్‌డీఏ ఆర్‌కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించగా, అది 24 గంటలు తిరగకుండానే ముక్కలుగా తెగిపోయింది. నెల రోజులు కుస్తీ పట్టినా ఫలితం లేక ఎత్తేశారు.
- షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నవంబరు 2న ఆరిలోవలో అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడాదిలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.
ఐటీ మెరుపులు
విశాఖను ఐటీ హబ్‌గా మారుస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన నారా లోకేశ్ మంత్రిగాబాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే టీసీఎస్ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. ఫిబ్రవరి 2025లోగా దాని కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. గూగుల్‌తోను ఒప్పందం చేసుకున్నారు.
కొత్తగా మూడు వందేభారత్ రైళ్లు
ఈ ఏడాది మార్చిలో విశాఖ ప్రజలకు కొత్తగా మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖకు అదనంగా మరో రైలు వేశారు. అదేరోజు విశాఖపట్నం నుంచి భువనేశ్వర్‌కు రైలు నడిపారు. సెప్టెంబరు 15న విశాఖ నుంచి దుర్గ్‌కు మరో వందేభారత్ రైలు వేశారు.
రెండు అణు జలాంతర్గాముల జల ప్రవేశం
విశాఖపట్నంలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్ అణు జలాంతార్గాముల నిర్మాణ కేంద్రంగా పేరు తెచ్చుకుంది. గతంలో ఐఎన్‌ఎస్ అరిహంత్‌ను తయారుచేయగా ఈ ఏడాది ఆగస్టు 29న ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేశారు. అక్టోబరు 16న రహస్యంగా మరో అణు జలాంతర్గామి ఎస్-4ను ప్రారంభించారు. ఫిబ్రవరిలో నిర్వహించిన మిలాన్-24కు 50 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
స్టీల్‌ప్లాంటుకు కూటమి సాయం
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా దానిని కాపాడతామని ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్మికులకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఢిల్లీ పెద్దలతో కూటమి నేతలు మాట్లాడి రెండు విడతలుగా రూ.1,650 కోట్ల ఆర్థిక సాయం అందించారు. భారీ ప్యాకేజీ కోసం మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు స్టీల్‌ప్లాంటు వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. సీఎండీ అతుల్‌భట్‌ను పదవీకాలం పూర్తికాక ముందే దీర్ఘకాలిక సెలవులో పంపించింది. శక్తిమణిని సీఎండీగా ఎంపిక చేయగా, ఆయన్ను కాదని ఎంఓఐఎల్ నుంచి సక్సేసాను తీసుకువచ్చారు. హెచ్‌బీ కాలనీలో స్టీల్‌ప్లాంటు భూములను యాజమాన్యం విక్రయించాలని యత్నించగా హైకోర్టు ఏప్రిల్ 25న స్టే విధించింది.
డీప్ టెక్నాలజీపై సీఎం సదస్సు
సీఎం చంద్రబాబునాయుడు డిసెంబరు 6వ తేదీన నోవాటెల్‌లో డీప్ టెక్నాలజీపై సదస్సు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి టెక్నాలజీ రంగంలో వస్తున్న నూతన పోకడలను ఆయన తెలుసుకున్నారు.
- విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సెప్టెంబరులో దాడులు నిర్వహించి మనీ ల్యాండరింగ్‌కు సంబంధించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు శివాజీపాలెంలోని ఆయనకు చెందిన భవనంలో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులు కేసు పెట్టారు.
పదవులు...బాధ్యతలు
మిజోరాం గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబును కేంద్రం ఒడిశా గవర్నర్‌గా నియమించింది. గిరిజన సహకార సంస్థ చైర్మన్‌గా కిడారి శ్రావణ్‌కుమార్ నవంబరు 18న, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా ప్రణవ్ గోపాల్ నవంబరు 25న బాధ్యతలు చేపట్టారు. జూన్ 14న పల్లా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్నారు.
- విశాఖకు డ్రగ్స్‌తో వచ్చిన కంటెయినర్‌ని సీబీఐ అధికారులు మార్చి నెలాఖరును సీజ్ చేశారు. ఆ తరువాత దానిపై విచారణ చేసి దొరికినవి డ్రగ్స్ కాదని డిసెంబరులో కేసును మూసివేశారు.
దిద్దుబాటు చర్యలు
శారదా పీఠానికి భీమిలి సమీపాన కేటాయించిన 15 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 19న రద్దు చేసి వెనక్కి తీసుకుంది. భీమిలి బీచ్‌లో సాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి అక్రమంగా నిర్మాణాలు చేపడుతుండగా వాటిని హైకోర్టు ఆదేశాల మేరకు జీవీఎంసీ అధికారులు కూలగొట్టారు. ఎండాడ హయగ్రీవ ప్రాజెక్టులో నిబంధనలు ఉల్లంఘించారని సీసీఎల్‌ఏ అనుమతులు రద్దుచేసింది. విశాఖ డెయిరీలో అక్రమాలు జరుగుతున్నాయని విచారణకు స్పీకర్ సభా సంఘాన్ని వేయగా ఆ కమిటీ విచారణ ప్రారంభించింది.
కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
ఆగస్టు 4వ తేదీన విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న కోర్బా ఎక్స్‌ప్రెస్ బీ-6, బీ-7 కోచ్‌లలో మంటలు చెలరేగాయి. రాయపూర్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఈ రైలు కోచింగ్ కాంప్లెక్స్‌కు క్లీనింగ్ కోసం వెళ్లాల్సిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు అంతా దిగిపోయిన తరువాత ఈ ఘటన జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది తేల్చనే లేదు.
దొరికిపోయిన అధికారులు
వాల్తేరు డీఆర్‌ఎంగా పనిచేస్తున్న సౌరభ్ ప్రసాద్ ఓ రైల్వే కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ ముంబైలో సీబీఐకి దొరికిపోయి అరెస్టు అయ్యారు. ఆ తరువాత సస్పెండ్ అయ్యారు. జీవీఎంసీలో జోన్-2 కమిషనర్‌గా పనిచేస్తున్న సింహాచలం ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు చేసి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని అరెస్టు చేశారు.