Share News

అడుగు పడని ప్రగతి

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:39 AM

అనకాపల్లి... జిల్లాగా అవిర్భవించి నేటితో సరిగ్గా రెండేళ్లు. కానీ అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనా సౌలభ్యం పేరుతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాను మూడుగా విభజించింది. దీంతో అనకాపల్లి జిల్లా ఏర్పాటయింది. అట్టహాసంగా కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసినా, మౌలిక వసతుల కల్పనకు కనీస నిధులు విడుదల చేయకపోవడంతో అరకొర వసతుల మధ్య కార్యాలయాల్లో పనులు సా...గుతున్నాయి.

అడుగు పడని ప్రగతి
అనకాపల్లి జిల్లా కలెక్టరు కార్యాలయం

అనకాపల్లి జిల్లా ఏర్పడి రెండేళ్లు

ఇంటిగ్రెటెడ్‌ కలెక్టరేట్‌ భవనానికి ఇప్పటికీ లభించని మోక్షం

ఉద్యోగుల కేటాయింపులతో సరిపెట్టేసిన ప్రభుత్వం

అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న కార్యాలయాలు

రాకపోకలకూ ఉద్యోగులకు తప్పని వెతలు

(అనకాపల్లి, ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి... జిల్లాగా అవిర్భవించి నేటితో సరిగ్గా రెండేళ్లు. కానీ అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనా సౌలభ్యం పేరుతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాను మూడుగా విభజించింది. దీంతో అనకాపల్లి జిల్లా ఏర్పాటయింది. అట్టహాసంగా కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసినా, మౌలిక వసతుల కల్పనకు కనీస నిధులు విడుదల చేయకపోవడంతో అరకొర వసతుల మధ్య కార్యాలయాల్లో పనులు సా...గుతున్నాయి.

జిల్లాలోని ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు ఇప్పటివరకు పరిపాలన భవనాలు సమకూర్చలేదు. అంతేకాకుండా ఉద్యోగులకు కనీస వసతులు కల్పించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాగా పేరు మార్చి, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సర్దుబాటుతో ప్రభుత్వం చేతులు దులుపుకోవడంపై విమర్శలు రేగుతున్నాయి.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి 2022 ఏప్రిల్‌ 3న అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించారు. జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో కలెక్టరేట్‌, పోలీసు హెడ్‌క్వార్టర్స్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఆదిలో సొంత భవనాలు లేక, అద్దె భవనాలు దొరకక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే రెండేళ్లు గడిచినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి నేటికీ పునాదులు పడలేదు. శంకరంలోని ఓ ప్రైవేటు భవనంలోనే కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయాలు నడుస్తున్నాయి. అనకాపల్లి కేంద్రంగా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ (వివిధ కార్యాలయాల సముదాయం) నిర్మాణానికి పది ఎకరాల స్థలాన్ని సేకరించడానికి అధికారులు ఏడాదిన్నరకుపైగా సమయం తీసుకున్నా, ఇంకా కొలిక్కిరాలేదు. ఎట్టకేలకు అనకాపల్లి మండలం కోడూరులో స్థలాన్ని సేకరించి కలెక్టరేట్‌ నిర్మాణానికి కోసం కేటాయిస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదిక పంపినా నిర్మాణాలకు నిధులు మంజూరు కాలేదు.

విశాఖ నుంచే బాధ్యతలు

అనకాపల్లి జిల్లా ఏర్పడిన తరువాత సుమారు 45 రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఇక్కడికి తరలించారు. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తిచేసి, రెండేళ్లు కావస్తున్నా నేటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులు విశాఖపట్నం నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రధానంగా జలవనరుల శాఖ, రోడ్లు, భవనాలు, ఏపీఈపీడీసీఎల్‌, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, జాతీయ రహదారుల శాఖల కార్యాలయాలు జిల్లా కేంద్రానికి రాలేదు. జిల్లా అధికారులుగా హోదా కల్పించి కొంతమంది సిబ్బందిని కేటాయించి నడిపిస్తున్నారు.

ఒక్క సొంత భవనమూ లేదు

జిల్లా ఏర్పడి రెండేళ్లైనా ప్రభుత్వ కార్యాలయాల కోసం కనీసం ఒక్క భవనాన్ని కూడా నిర్మించలేదు. దీంతో వివిధ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం చదరపు అడుగుకు రూ.10 చొప్పున అద్దె చెల్లించాల్సి వస్తోంది. కాగా పట్టు పరిశ్రమ, బీసీ సంక్షేమ శాఖ, జిల్లా ఖజానా అధికారి, స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో, తూనికలు కొలతల శాఖల కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలిసే పరిస్థితి లేదు. బీసీ సంక్షేమ శాఖ, ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ జిల్లా కార్యాలయాలు అద్దె చెల్లించలేని స్థితిలో సెల్లార్లలోనే నడుపుతున్నారు.

ఉద్యోగులకూ తప్పని వెతలు...

కలెక్టర్‌, జిల్లా పోలీసు కార్యాలయాలు అనకాపల్లి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని శంకరం గ్రామంలో ఏర్పాటు చేశారు. కనీసం ఆటోలు కూడా నడవకపోవడంతో ఉద్యోగుల రాకపోకలకు రెండేళ్లుగా అవస్థలు పడుతున్నారు. ప్రత్యేకంగా ఉద్యోగుల కోసం బస్సు సదుపాయం కల్పిస్తామని ప్రకటించిన అధికారులు పట్టించుకోలేదు. దీనికి తోడు అనకాపల్లి పట్టణంలో అద్దెకు ఇళ్లు లభించకపోవడం, రూ. వేలల్లో అడ్వాన్సులు డిమాండ్‌ చేస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. చేసేది లేక కొంతమంది విశాఖ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు.

కాగా జిల్లా ఏర్పడక ముందు ఆయా కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉండేవారని, ప్రస్తుతం జిల్లా ఉన్నతాధికారులు నిత్యం కలెక్టరేట్‌లో రివ్యూ మీటింగుల పేరుతో కార్యాలయాల్లో అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నారు. దీంతో వివిధ పనులపై జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికారులు మాత్రం కొత్త జిల్లాలో కార్యాలయాల ఏర్పాట్లు, సిబ్బంది సర్దుబాట్లు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయని, త్వరలోనే అభివృద్ధి దిశగా నడిపిస్తామంటున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 01:39 AM