ఉక్కు ఉద్యోగులకు అందని వేతనాలు
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:14 AM
వేతనాల కోసం ఉక్కు ఉద్యోగులు (నాన్-ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్), కాంట్రాక్టు కార్మికులు ఎదురుచూస్తున్నారు.

జీతం తీసుకోని నెలగా డిసెంబరు?
సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించి కూడా బకాయిలు
ఆందోళనలో ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు
ఉక్కుటౌన్‌షిప్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
వేతనాల కోసం ఉక్కు ఉద్యోగులు (నాన్-ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్), కాంట్రాక్టు కార్మికులు ఎదురుచూస్తున్నారు. డిసెంబరు నెల 30వ తేదీ వచ్చినా నవంబరు నెలకు సంబంధించిన వేతనాలు అందలేదు. గతంలో ఉద్యోగులకు ఏ నెలకు ఆ నెల చివరి తేదీన లేదా మరుసటి నెల ఒకటో తేదీన జీతాలు ఇచ్చేవారు. కాంట్రాక్టు కార్మికులకు ప్రతి నెలా 5 నుంచి 10వ తేదీ మధ్య చెల్లింపులు జరిపేవారు. అలాంటిది ప్రస్తుతం వేతనాలు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేని పరిస్థితి వచ్చింది. మూడు నెలల కిందటి వరకూ రెండు వాయిదాల్లో జీతాలు చెల్లిస్తుండేవారు. అయితే సెప్టెంబరు నుంచి పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. సెప్టెంబరు జీతం 50 శాతం అక్టోబరులో ఇచ్చారు. అక్టోబరు జీతం ఒకసారి 35 శాతం, మరోసారి 30 శాతం, మొత్తం 65 శాతం నవంబరులో ఇచ్చారు. నవంబరు నెల జీతం ఇప్పటివరకూ ఇవ్వలేదు. ఇక కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి అయితే చెప్పాల్సిన పనిలేదు. కొన్ని విభాగాల్లో అయితే ఆరేడు నెలలు, మరికొన్ని విభాగాల్లో అయితే నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించలేదు. జీతం బకాయిలు కనీసం సంక్రాంతి పండుగ ముందైనా చెల్లించాల్సిందిగా ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు కోరుతున్నారు.