ఉద్యోగుల ఫండ్‌కు ఉక్కు ఎసరు
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:31 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం ముడి పదార్థాల కొనుగోలుకు నిధులు కొరత ఏర్పడడంతో ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పదవీ విరమణ చేసినప్పుడు సెటిల్‌మెంట్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న నిధుల నుంచి రూ.390 కోట్లు వాడేసుకుంది.
లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్/రిటైర్‌మెంట్
సెటిల్‌మెంట్ ఫండ్ నుంచి రూ.390 కోట్లు విత్‌డ్రా
ఏకపక్షంగా యాజమాన్యం నిర్ణయం
కార్మికుల ఆగ్రహం
విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం ముడి పదార్థాల కొనుగోలుకు నిధులు కొరత ఏర్పడడంతో ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పదవీ విరమణ చేసినప్పుడు సెటిల్‌మెంట్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న నిధుల నుంచి రూ.390 కోట్లు వాడేసుకుంది. ఆ ఫండ్‌లో మొత్తం రూ.609 కోట్లు ఉండాలని, కానీ రూ.219 కోట్లు మాత్రమే ఉన్నాయని కార్మిక సంఘ నాయకులు ఆలస్యంగా గుర్తించారు. మిగిలిన నిధులు ఏమయ్యాయని ఆరా తీస్తే...యాజమాన్యమే వాడేసుకుందని తెలియడంతో హతాశులయ్యారు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఉద్యోగులు తమ జీతాల నుంచి ప్రతి నెలా కొంత మొత్తం ఈ ఫండ్‌కు జమ చేస్తూ వస్తున్నారు. వీటిని ఉద్యోగుల సెటిల్‌మెంట్‌కు తప్ప ఇతర అవసరాలకు ఉపయోగించడానికి నిబంధనలు అంగీకరించవు. కానీ ఎవరినీ సంప్రతించకుండా, చర్చించకుండా యాజమాన్యం ఏకపక్షంగా భారీగా నిధులు వాడేసుకోవడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఈ ఏడాది మే నెల నుంచి రిటైరైన వారికి బెనిఫిట్స్ ఏమీ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టేశారు. ఆయా కుటుంబాలు వచ్చి ఆర్థిక విభాగంలో అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఢిల్లీ నుంచి అనుమతులు వస్తే తప్ప ఇవ్వలేమని బుకాయిస్తున్నారు. నిధులను అడ్డగోలుగా వాడేసుకోవడం వల్లనే ఇలా చేస్తున్నారనే విషయం బయటకు పొక్కడంతో స్టీల్ ప్లాంటు గుర్తింపు యూనియన్ సీఎండీకి శనివారం ఘాటుగా లేఖ రాసింది. ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ /రిటైర్‌మెంట్ సెటిల్‌మెంట్ ఫండ్ నుంచి రూ.390 కోట్లు విత్‌డ్రా చేశారని, ఇది ఎవరి నిర్ణయమో వెల్లడించాలని కోరింది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని ప్రస్తుత తరుణంలో ఇలాంటి చర్యలు అభద్రతా భావాన్ని పెంచుతాయని పేర్కొంది.
చట్టబద్ధ చెల్లింపులకు మరో రూ.900 కోట్లు
ఉద్యోగులకు సంబంధించి వివిధ పద్దుల కింద జమ చేయాల్సిన మొత్తం రూ.900 కోట్లకు చేరిందని, వీటి విషయంలోను తక్షణమే తగిన నిర్ణయం తీసుకోవాలని సీఎండీని గుర్తింపు యూనియన్ అధ్యక్షులు కేఎస్‌ఎన్ రావు కోరారు. ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్‌కు రూ.400 కోట్లు, సూపర్ యాన్యుయేషన్ బెనిఫిట్ ఫండ్‌కు రూ.325 కోట్లు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు రూ.65 కోట్లు, అనారోగ్యానికి గురైన ఉద్యోగుల కుటుంబాలకు రూ.40 కోట్లు, వీఎస్‌పీ త్రిఫ్ట్ సొసైటీకి రూ.70 కోట్లు యాజమాన్యం చెల్లించాల్సి ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ పథకాల కింద ప్రతి నెలా ఉద్యోగుల జీతాల నుంచి కోత విధిస్తూ ఆయా మొత్తాలను సదరు పద్దులకు జమ చేయకపోవడం వల్ల బకాయిలు రూ.900 కోట్లకు చేరాయని, ఇది కూడా అన్యాయమని ఆరోపించారు. వీటన్నింటిపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నందున తక్షణమే వాడుకున్న రూ.390 కోట్లు తిరిగి జమ చేయాలని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.