Share News

రాష్ట్రస్థాయికి ఉక్కు ఉద్యమం

ABN , Publish Date - Nov 02 , 2024 | 01:20 AM

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రస్థాయికి ఉక్కు ఉద్యమం

కార్మికులకు మాత్రమే పరిమితం కారాదు, ప్రజా పోరాటంగా మలిచి ముందుకు తీసుకువెళ్లాలి

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపు

7న విజయవాడలో వామపక్షాల సమావేశం

త్వరలో చలో అమరావతి వంటి కార్యక్రమాలు నిర్వహణ

సీతంపేట, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ద్వారకానగర్‌ పౌర గ్రంథాలయంలో శుక్రవారం వామపక్షాలు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ‘ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం, కర్మాగారానికి సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం, సెయిల్‌లో విలీనం’ అనే అంశాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన కె.రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం కార్మికులకు మాత్రమే పరిమితం కాకూడదని, దీన్ని ప్రజా పోరాటంగా మలిచి ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఢిల్లీలోనూ పోరాట కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎన్నికలకు ముందు స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారని గుర్తుచేస్తూ...వారిపై ఇప్పుడు ఒత్తిడి తీసుకురావలసి ఉందన్నారు. ఈ నెల 7న విజయవాడలో వామపక్షాల సమావేశం ఏర్పాటుచేశామని, ఇందులో ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లడంపై చర్చిస్తామని తెలిపారు. ‘చలో అమరావతి’ వంటి కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. ఎన్నికల ముందుకంటే ఆ తరువాతే ఉక్కు పరిశ్రమకు ప్రైవేటీకరణ ముప్పు పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్లాంటు కుంటుపడేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటవుతుందంటున్న మిట్టల్‌ స్టీల్‌ప్లాంటుకు ముడి సరకుతో పాటు అవసరమైన అన్ని వనరులూ సమకూర్చడానికి సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ విషయంలో చొరవ చూపకపోవడమేమిటని రామకృష్ణ ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరిగితే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. దీన్ని కాపాడకుండా ఎన్ని మంచి పనులు చేసినా ప్రజలు గుర్తించరన్న విషయాన్ని గ్రహించాలన్నారు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపీలు ఆ విషయంపై ప్రధానిని కలుసుకునేందుకు చొరవ చూపడం లేదన్నారు. సుదీర్ఘకాలంగా జరుగుతున్న పోరాటం వల్లే విశాఖ ఉక్కును ఇంతవరకు కాపాడుకుంటూ రాగలిగామని, దీన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు ఆర్థిక మండళ్లు (ఎస్‌ఈజడ్‌) మాదిరిగా ప్రైవేటు ఇండస్ర్టియల్‌ పార్కులు పెట్టాలంటూ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడం సరికాదన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణ మూర్తి, స్టీల్‌ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏవీ వర్మరాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్‌, వామపక్ష, పౌర, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 01:20 AM