గంజాయిపై ఉక్కుపాదం
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:43 PM
జిల్లాలో ఈ ఏడాది గంజాయి సాగు, రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అదే తరహాలో మావోయిస్టుల కార్యకలాపాలపైనా గట్టి చర్యలు చేపట్టారు. అయితే రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, వ్యక్తుల అదృశ్యం, ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులు మాత్రం పెరిగాయి.
మావోయుస్టులను కట్టడి చేయడంలో సఫలం
గతేడాదితో పోలిస్తే పురోగతి
రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుదల
2023లో నేరాలు 1,580 కాగా, 2024లో 1,859
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఈ ఏడాది గంజాయి సాగు, రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అదే తరహాలో మావోయిస్టుల కార్యకలాపాలపైనా గట్టి చర్యలు చేపట్టారు. అయితే రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, వ్యక్తుల అదృశ్యం, ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులు మాత్రం పెరిగాయి.
జిల్లాలో ప్రధాన సమస్యలైన గంజాయి, మావోయిస్టులకు సంబంధించిన చర్యల్లో మాత్రం పోలీసులు ఈ ఏడాది సఫలీకృతమయ్యారనే చెప్పాలి. ఇతర నేరాలు, ప్రమాదాల కంటే జిల్లా వ్యాప్తంగా గంజాయి, మావోయిస్టులకు సంబంధించిన సమస్యే అధికంగా ఉండడంతో పోలీసు యంత్రాంగం దానిపైనే ప్రత్యేక శ్రద్ధ కనబరిచి అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. జిల్లాలో పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, చింతూరు కేంద్రాలుగా డీఎస్‌పీ కార్యాలయాలు, 12 సర్కిళ్లు, 30 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. దాదాపుగా అన్ని పోలీస్ స్టేషన్లు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పరిధిలోనే ఉండడం విశేషం.
ఈ ఏడాది 23,368 కిలోల గంజాయి స్వాధీనం
జిల్లాలో గంజాయి సాగు, రవాణాను అరికట్టడడంలో భాగంగా ఈ ఏడాది 316 కేసులు నమోదు చేసి 23,366 కిలోల ఎండు గంజాయిని, 91 కిలోల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 60 ఎకరాల్లో సాగవుతున్న 20,934 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.
మావోయిస్టుల దూకూడుకు ముకుతాడు
జిల్లాలో ఈ ఏడాది మావోయిస్టుల చర్యలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. దీంతో మావోయిస్టు నేతల అరెస్టు, మిలీషియా సభ్యుల లొంగుబాటు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మావోయిస్టు నేత దవల్ అలియాస్ బమన్‌తో పాటు ఏడుగురు మిలీషియా సభ్యులను అరెస్టు చేశారు. అలాగే మావోయిస్టులకు పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరిస్తున్న 33 మంది మిలీషియా సభ్యులను బైండోవర్ చేయడంతోపాటు 35 మంది ఆర్ముడ్ మిలీషియా సభ్యులు లొంగిపోయారు. పోలీసు శాఖ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ క్యాడర్లలో ఉన్న 14 మంది సభ్యులు లొంగిపోయారు. చింతపల్లి పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని కొయ్యూరు, జీకేవీధి మండలాల్లో రెండు చోట్ల మావోయిస్టుల డంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కట్టడి చర్యలతో కొత్తగా మావోయిస్టు పార్టీకి ఎటువంటి నియామకాలు లేవు. లొంగిపోయిన మావోయిస్టు సభ్యులు, మిలీషియా, సానుభూతిపరులకు సైతం ప్రత్యేక పునరావాస చర్యలను పోలీసులు చేపట్టారు.
జిల్లాలో 2023, 2024 సంవత్సరాల్లో నేర వివరాల పట్టిక
-------------------------------------------------------------------------------
వ.సం. విషయం 2023లో... 2024లో...
1. శారీరక నేరాలు 156 138
2. ఆర్థిక నేరాలు 65 52
3. రోడ్డు ప్రమాదాలు 228 245
4. మహిళలపై నేరాలు 140 106
5. అట్రాసిటీ కేసులు 19 20
6. సైబర్ నేరాలు 13 34
7. చీటింగ్ కేసులు 37 33
8. పెట్టీ కేసులు 361 177
9. మాదక ద్రవ్యాల కేసులు 263 316
10. మిస్సింగ్ కేసులు 70 85
11. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులు 228 658
-----------------------------------------------------------------------------------
మొత్తం కేసుల సంఖ్య 1,580 1,859
-----------------------------------------------------------------------------------