Share News

సంక్షోభంలో ఉక్కు

ABN , Publish Date - Mar 09 , 2024 | 01:05 AM

స్టీల్‌ప్లాంటు పరిస్థితి రోజురోజుకూ తీసికట్టుగా తయారవుతోంది.

సంక్షోభంలో ఉక్కు

ఈ నెల 8వ తేదీకి కూడా అధికారులకు అందని వేతనాలు

ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పని వైనం

నల్ల బ్యాడ్జీలతో నిరసన

విశాఖఫట్నం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటు పరిస్థితి రోజురోజుకూ తీసికట్టుగా తయారవుతోంది. జిందాల్‌ స్టీల్‌ సాయంతో మూడో బ్లాస్ట్‌ ఫర్నేసులో ఉత్పత్తి ప్రారంభించినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతోంది. ప్రతి నెలా జీతాలు చివరి 30, 31 తేదీల్లోనే ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఆర్థిక సమస్యల వల్ల ఇటీవల ఆలస్యం జరుగుతోంది. ఈ నెల మరీ ఘోరంగా 8వ తేదీ వచ్చినా అధికారులకు జీతాలు ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పకపోవడం మరో విశేషం.

ప్లాంటులో కార్మికులు, ఉద్యోగుల వేతనాలకు నెలకు రూ.86 కోట్లు (చెరో రూ.43 కోట్లు) అవసరం. కార్మికులకు జీతాలు సకాలంలో ఇవ్వకపోతే ఆందోళన చేస్తారని ఏదో తిప్పలు పడి వారికి సర్దుబాటు చేస్తున్నారు. అదే అధికార వర్గాలైతే ఆందోళనలు, ధర్నాలు చేయకూడదు కాబట్టి, నోరెత్తరని వారికి అన్నీ చూసుకొని కాసింత ఆలస్యంగా ఇస్తున్నారు. ప్లాంటు పరిస్థితి బాగా లేనందున వారు కూడా సర్దుకుపోతున్నారు. అయితే ఈ నెల 8వ తేదీ దాటినా అధికారులు ఎవరికీ జీతాలు ఇవ్వలేదు. తొమ్మిదో తేదీ రెండో శనివారం. పదో తేదీ...ఆదివారం. అంటే పదకొండో తేదీ సోమవారం కూడా ఇస్తారో లేదో తెలియదు. జీతాలపై ఆధారపడి జీవించేవారికి ఒకటో తేదీ రాగానే చెల్లించాల్సిన బకాయిలు అనేకం ఉంటాయని, ఇలా జీతాలు ఆలస్యం ఎలా అంటూ అధికార వర్గాలు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశాయి. తక్షణమే జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి.

టౌన్‌షిప్‌లో యూనిట్‌ విద్యుత్‌కు రూ.8

ఉక్కు టౌన్‌షిప్పుల్లో నివాసం ఉండే వారికి విద్యుత్‌ చార్జీలు చాలా స్వల్పం. యూనిట్‌కు 50 పైసలు మాత్రమే తీసుకుంటారు. దేశంలోని అన్ని ప్లాంట్లలో అలాగే ఉంది. ఇక్కడ కూడా ఆరు నెలల క్రితం వరకూ అలాగే ఉండేది. ఇప్పుడు ఆర్థిక స్థితి బాగా లేదని యూనిట్‌కు రూ.8 చొప్పున వసూలు చేస్తున్నారు. దాంతో భారీగా విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయి. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు పెద్ద పేరుందని వేరే ప్లాంట్లలో ఉద్యోగాలు వచ్చినా వెళ్లకుండా ఇక్కడే చేరామని, ఇప్పుడు జీతాలు ఇవ్వలేని దుస్థితికి చేర్చారని ఉద్యోగులు వాపోతున్నారు. తక్షణమే విశాఖపట్నం స్టీల్‌ప్లాంటును సెయిల్‌లో విలీనం చేసి ఆదుకోవాలని అధికారులు డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 09 , 2024 | 01:05 AM