Share News

దుమ్మురేపిన శ్రీభరత్‌

ABN , Publish Date - Jun 05 , 2024 | 01:39 AM

విశాఖపట్నం పార్లమెంటు సభ్యునిగా తెలుగుదేశం అభ్యర్థి మతుకుమిల్లి శ్రీభరత్‌ ఘన విజయం సాధించారు.

దుమ్మురేపిన శ్రీభరత్‌

రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ

వైసీపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీపై 5,04,247 ఓట్ల ఆధిక్యం

ఆమెకు లభించిన ఓట్ల కంటే టీడీపీ అభ్యర్థికి లభించిన మెజారిటీయే ఎక్కువ

ఇరువురికీ మధ్య 36.35 శాతం ఓట్ల వ్యత్యాసం

విశాఖపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం పార్లమెంటు సభ్యునిగా తెలుగుదేశం అభ్యర్థి మతుకుమిల్లి శ్రీభరత్‌ ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థులందరి కంటే అత్యధిక మెజారిటీ సాధించారు. 5,04,247 ఓట్లతో వైసీపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీలక్ష్మిని ఓడించారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో 13,87,125 ఓట్లు పోలవ్వగా అందులో ఆయనకు 9,07,467 ఓట్లు (65.42 శాతం) వచ్చాయి. వైసీపీ అభ్యర్థిని ఝాన్సీలక్ష్మికి కేవలం 29.07 శాతం అంటే 3,97,821 ఓట్లు లభించాయి. శ్రీభరత్‌కు లభించిన మెజారిటీ కంటే ఝాన్సీలక్ష్మికి వచ్చిన ఓట్లే తక్కువ కావడం గమనార్హం. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యారెడ్డికి 29,430 ఓట్లు దక్కాయి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌కు కేవలం 7,529 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో ఒక శాతం గాని, భరత్‌కు వచ్చిన ఓట్లలో ఒక శాతం గానీ ఆయన రాలేదు. ఆయనకు మొత్తం ఓట్లలో 0.55 శాతమే వచ్చాయి.

ఇక పోస్టల్‌ బ్యాలెట్లు 20,330 రాగా వాటిలో శ్రీభరత్‌కు 13,583, బొత్స ఝాన్సీలక్ష్మికి 5,399, సత్యారెడ్డికి 837 ఓట్లు, కేఏ పాల్‌కు 167 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన శ్రీభరత్‌ గత 2019 ఎన్నికల్లో ఇదే విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు. అప్పుడు వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో 4,414 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణకు సుమారు 2,75,000 ఓట్లు వచ్చాయి. దాంతో శ్రీభరత్‌ ఓడిపోయారు. ఈసారి అలా ఓట్లు చీలే అవకాశం లేకుండా జనసేన, బీజేపీలతో కలిసి పోటీ చేయడంతో భారీ మెజారిటీతో గెలిచారు. విజయం సాధించిన వార్తతో సతీసమేతంగా విజయవాడ వెళ్లి పార్టీ అధినేత చంద్రబాబునాయుడును, మామ బాలకృష్ణను కలిశారు.

విభజన హామీలు సాధిస్తాం

అధికారం ఉందని విర్రవీగితే

గుణపాఠం తప్పదని

ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారు

ఈ విజయం ద్వారా బాధ్యత పెరిగింది

విశాఖ లోక్‌సభ విజేత ఎం.శ్రీభరత్‌

విశాఖపట్నం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర విభజన చట్టంలో అమలుకాకుండా మిగిలి ఉన్న హామీలన్నింటినీ కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ద్వారా సాధించుకుంటామని విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన ఎం.శ్రీభరత్‌ తెలిపారు. కౌంటింగ్‌ సెంటర్‌లో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారన్నారు.

ఈ కలికాలంలో డబ్బుకు కొందరు, అధికారానికి కొందరు లొంగిపోతారని, ‘సమాజం మంచిని గుర్తిస్తుందా?’ అనే అనుమానం తనకు ఉండేదని, అవన్నీ పటాపంచలు చేస్తూ ప్రజలు తగిన తీర్పు ఇచ్చారన్నారు. ఎవరికీ భయపడకుండా ఓటు హక్కును ఉపయోగించుకున్నారన్నారు. విజయం వచ్చినప్పుడు ఒదిగి ఉండాలనేదే తన అభిమతన్నారు. గతంలో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయినా ఈసారి 1.5 లక్షల నుంచి 2 లక్షల మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం ఉండేందన్నారు. అయితే ప్రస్తుతం మెజారిటీ నాలుగు లక్షలు దాటిపోయిందన్నారు. ప్రజలు ఈ విజయం ద్వారా అత్యధిక భారం పెట్టారన్నారు. వైసీపీలా తమ ప్రభుత్వం వ్యాపారులను వేధించబోదని హామీ ఇచ్చారు. విశాఖపట్నానికి రైల్వే జోన్‌, స్టీల్‌ప్లాంటు సమస్య పరిష్కారం, గంజాయి రవాణాను అరికట్టడం, ఉద్యోగాల కల్పన, శాంతి భద్రతల వంటి సమస్యలపై తాము ఎన్నికల సందర్భంగా మాట్లాడామని, వీటిలో కొన్నింటిని ఏడాదిలోగా సాధిస్తామని, మిగిలిన వాటిని తక్షణమే అమలు చేస్తామని చెప్పారు.

తప్పులు చేస్తే చెప్పండి

ఐదేళ్ల వైసీపీ పాలనలో మీడియాపై దాడులు జరిగాయని, వేధింపులకు గురిచేశారని, అయితే కూటమి ప్రభుత్వం దీనికి విరుద్ధమన్నారు. ప్రజలకు మేలు చేయడానికే పనిచేస్తామని, ఆ క్రమంలో ఎక్కడైనా తప్పులు జరిగితే మీడియా నిజాయితీగా ఎత్తి చూపాలని, తప్పకుండా సరిచేసుకుంటామన్నారు. కులం, మతం పేరుతో సమాజాన్ని విడదీయడం మంచిది కాదన్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తామని, తప్పుచేసిన నాయకులకు ప్రజల తీర్పే సరైన శిక్షగా తాను భావిస్తున్నానన్నారు. ఐదేళ్లుగా కక్షపూరిత రాజకీయాలను సహించామని, అయితే ఎక్కడా లొంగిపోలేదని, తప్పులేని చోట ఎదిరించి పోరాడామని, ఇక ముందు కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు.

పర్యాటక ప్రాంతంగా రుషికొండ

రుషికొండపై కేవలం ఏడు ఎకరాల్లో మాత్రమే నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయని, కానీ అంతకు మించి తవ్వేశారన్నారు. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూస్తామన్నారు. రుషికొండలోని కట్టడాలను పర్యాటక భవనంగానే కొనసాగించాలన్నది తన అభిమతమన్నారు. పర్యాటక రిసార్టుల్లో ఒక గది విస్తీర్ణం 300 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఉండదని, కానీ ఇక్కడ ఒక్కొక్కటి 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తామన్నారు. దౌర్జన్యాలు చేసే ప్రభుత్వం ఉండగా ఎన్నికల్లో విజయం సాధించినా తన లాంటి వారు ఏమీ చేయలేరని, అందుకే గత ఎన్నికల్లో ఓడిపోయినందుకు పెద్దగా బాధ పడలేదన్నారు.

Updated Date - Jun 05 , 2024 | 01:39 AM