Share News

ఏజెన్సీలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - May 08 , 2024 | 12:32 AM

ఏజెన్సీలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జోనల్‌ మలేరియా అధికారి(జెడ్‌ఎంవో) డాక్టర్‌ శాంతిప్రభ తెలిపారు.

ఏజెన్సీలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు
చినబరడలో దోమల మందు పిచికారీని పరిశీలించి గిరిజనులతో మాట్లాడుతున్న జెడ్‌ఎంవో డాక్టర్‌ శాంతిప్రభ

- జోనల్‌ మలేరియా అధికారి డాక్టర్‌ శాంతిప్రభ

చింతపల్లి, మే 7: ఏజెన్సీలో మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జోనల్‌ మలేరియా అధికారి(జెడ్‌ఎంవో) డాక్టర్‌ శాంతిప్రభ తెలిపారు. మంగళవారం తాజంగి, లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. పెదబరడ పంచాయతీ చినబరడ గ్రామంలో జరుగుతున్న దోమల మందు పిచికారీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో మలేరియా వ్యాధులు అదుపులో ఉన్నాయన్నారు. ఎక్కడా మలేరియా మరణాలు లేవన్నారు. వైద్య ఆరోగ్యశాఖ క్షేత్ర స్థాయి ఉద్యోగులు, వైద్యులు గ్రామాలను సందర్శిస్తూ మలేరియా బాధితులకు సకాలంలో మెరుగైన చికిత్స అందిస్తున్నారన్నారు. గతంతో పోల్చుకుంటే మలేరియా కేసులు తక్కువగా ఉన్నాయన్నారు. గిరిజన ప్రాంతంలో తొలి విడత దోమల మందు పిచికారీ జరుగుతున్నదని చెప్పారు. గతంలో మలేరియా కేసులు నమోదైన గిరిజన గ్రామాలను గుర్తించి మొదటి విడత ఏసీఎం మూడు శాతం మందును గిరిజనుల ఇళ్లకు పిచికారీ చేస్తున్నామన్నారు. ఈ మందును ఆదివాసీలు కచ్చితంగా పిచికారీ చేయించుకోవాలని తెలిపారు. ఈ మందుకు వాసన, రంగు ఉండదన్నారు. ఇళ్లల్లో వాసన వస్తుందని కొంత మంది ఆదివాసీలు పిచికారీకి నిరాకరిస్తున్నారని, దీంతో వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులతో కౌన్సెలింగ్‌ చేయిస్తున్నామన్నారు. గ్రామాల్లో జ్వరం వచ్చిన వెంటనే ఆదివాసీలు ఆస్పత్రికి వచ్చి రక్త పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఆదివాసీలు పసర మందులు, నాటు వైద్యానికి దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి, జీకేవీధి మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారులు బుక్క చిట్టిబాబు, త్రీనాథరావు, ఎంటీఎస్‌ గుమ్మ యుగందర్‌, హెచ్‌వో మురళి పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 12:32 AM