Share News

భూ సమస్యలకు పరిష్కారం!

ABN , Publish Date - Oct 17 , 2024 | 01:31 AM

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. గత వైసీపీ ప్రభుత్వం భూముల రీసర్వే చేయించిన అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

భూ సమస్యలకు పరిష్కారం!
రెవెన్యూ సదస్సుల నిర్వహణపై అధికారులతో సమీక్ష జరుపుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

జిల్లాలో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు

రీసర్వే జరిగిన 455 గ్రామాల్లో సభలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. గత వైసీపీ ప్రభుత్వం భూముల రీసర్వే చేయించిన అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో గురువారం నుంచి 30 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. గత ప్రభుత్వ హయాంలో అనకాపల్లి జిల్లాలో 455 గ్రామాల్లో భూముల రీసర్వేను పూర్తి చేశారు. అయితే వైసీపీ నాయకులు ల్యాండ్‌ పూలింగ్‌, 22ఏ ఫ్రీహోల్డ్‌ పేరుతో పెద్దఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు భూములను తమ గుప్పెట్లో పెట్టుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో రీసర్వే పూర్తయిన 455 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావించింది. గతంలో జరిగిన రీసర్వే వల్ల నష్టపోయిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు జేసీ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 9 గంటలకు ఒక గ్రామంలో, మధ్యాహ్నం 3 గంటలకు మరో గ్రామంలో సదస్సులు నిర్వహిస్తారు. గ్రామస్థాయి సదస్సుల్లో ఆర్‌ఐ, వీఆర్‌ఓ, సర్వేయర్లు, రిజిస్ట్రేషన్‌, అటవీ, దేవదాయ శాఖల ఉద్యోగులు, వక్ఫ్‌బోర్డు ప్రతినిధులు వుంటారు. మండలస్థాయిలో జరిగే సదస్సులకు ఆర్డీఓ, తహసీల్దారు వుంటారు. సదస్సులకు వెళ్లే అధికారులు తమతోపాటు గ్రామ చిత్రపటాలు, ఆర్‌ఓఆర్‌, 1బీ అడంగల్‌, పహానీ, ప్రభుత్వ భూమి (22ఏ రికార్డు), వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాల నకళ్లను తీసుకెళతారు. భూఆక్రమణలపై ఫిర్యాదులు, 22ఏ రికార్డుల్లో భూముల స్థితిగతులు, రీసర్వే, కొత్త పట్టాదారు పాసుపుస్తకాల జారీ, సరిహద్దు రాళ్ల ఏర్పాటు వంటి వాటికి సంబంధించి ఫిర్యాదులు స్వీకరిస్తారు. గ్రామ సభల్లో అందిన ఫిర్యాదులను ఆర్డీజీఎస్‌లో నమోదు చేసి విచారణ జరుపుతారు.

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలో రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకొని, భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టరు విజయకృష్ణన్‌ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని సరిచేసే ప్రక్రియకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. గ్రామ సభలకు భూ యజమానులు హాజరై సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.

Updated Date - Oct 17 , 2024 | 07:38 AM