31నే సామాజిక పింఛన్లు
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:54 AM
జనవరి ఒకటో తేదీన ఇవ్వాల్సిన సామాజిక పింఛన్లను ఈనెల 31వ తేదీనే పంపిణీ చేయనున్నారు.

విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
జనవరి ఒకటో తేదీన ఇవ్వాల్సిన సామాజిక పింఛన్లను ఈనెల 31వ తేదీనే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో 1,59,277 మంది పింఛనుదారుల కోసం రూ.69.21 కోట్లు విడుదల చేశారు. పింఛన్‌దారులకు అందజేయాల్సిన సొమ్ములు ఈనెల 30వ తేదీ నాటికి సచివాలయ సిబ్బందికి అందజేయనున్నారు.
-----------------------------------------------------------------------------------
టమాటా ధర తగ్గుముఖం
రైతు బజార్లలో కిలో రూ.20
గోపాలపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో టమాటా సీజన్ ప్రారంభం కావడంతో ధర తగ్గుముఖం పట్టింది. ఈ నెల ప్రారంభంలో రైతుబజార్లలో కిలో టమాటా ధర రూ.30 వరకూ ఉండేది. ప్రస్తుతం రూ.20కి వచ్చింది. సాధారణంగా డిసెంబరు నుంచి జిల్లాలో దేశవాళీ టమాటా దిగుబడులు ప్రారంభవుతాయి. అప్పటి నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకూ పంట వస్తుంది. దీంతో జనవరి నెల నుంచి ఏప్రిల్ వరకూ టమాటా ధర తక్కువగా ఉంటుంది. కాగా పూర్తిస్థాయిలో పంట రావడం మొదలైతే ధర మరింత తగ్గుతుందని అంటున్నారు.
-----------------------------------------------------------------------------------
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
వచ్చే నెల 5 నుంచి ప్రారంభం
విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
సంక్రాంతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టామని వాల్తేరు రైల్వే సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
విశాఖ-పార్వతీపురం-విశాఖ: 08565 నంబరు గల రైలు జనవరి 10 నుంచి 20 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు విశాఖలో బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు పార్వతీపురం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08566 నంబరుతో మధ్యాహ్నం 12.45 గంటలకు పార్వతీపురంలో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విశాఖ చేరుతుంది.
సికింద్రాబాద్-విశాఖ-సికింద్రాబాద్: 07097 నంబరు గల రైలు జనవరి 5, 12 తేదీల్లో (ప్రతి ఆదివారం) సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07098 నంబరుతో జనవరి 6, 13 తేదీల్లో (ప్రతి సోమవారం) రాత్రి 7.50 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
హైదరాబాద్-కటక్-హైదరాబాద్ వయా దువ్వాడ: 07165 నంబరు గల రైలు జనవరి 7, 14, 21 తేదీల్లో (ప్రతి మంగళవారం) రాత్రి 8.10 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.05 గంటలకు దువ్వాడ చేరుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు కటక్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07166 నంబరుతో ఈ రైలు జనవరి 8, 15, 22 తేదీల్లో (ప్రతి బుధవారం) రాత్రి 10.30 గంటలకు కటక్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.35 గంటలకు దువ్వాడ, రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
సికింద్రాబాద్-బ్రహ్మపూర్-సికింద్రాబాద్ వయా దువ్వాడ: 07027 నంబరు గల రైలు జనవరి 3, 10 తేదీల్లో (ప్రతి శుక్రవారం) రాత్రి 8.15 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.22 గంటలకు దువ్వాడ, మధ్యాహ్నం 2.45 గంటలకు బ్రహ్మపూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07028 నంబరుతో ఈ రైలు జనవరి 4, 11 తేదీల్లో (ప్రతి శనివారం) సాయంత్రం 4.45 గంటలకు బ్రహ్మపూర్‌లో బయలుదేరి రాత్రి 9.55 గంటలకు దువ్వాడ, మరుసటిరోజు ఉదయం 11.35 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.