జీఎంసీపై స్మార్ట్‌సిటీ భారం!
ABN , Publish Date - Jun 17 , 2024 | 01:39 AM
నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన ‘స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల’ నిర్వహణ భారం జీవీఎంసీ నెత్తినపడే పరిస్థితి కనిపిస్తోంది.

జీవీఎంసీ నెత్తిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల నిర్వహణ భారం!
ఈనెలాఖరుతో ముగియనున్న మిషన్ కాలపరిమితి
నగరంలో రూ.2,100 కోట్లతో 51 ప్రాజెక్టులు
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో పదేళ్లు నిర్వహణ
గడువు ముగిస్తే ఏమిటనే దానిపై సందిగ్ధం
రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాసిన అధికారులు
స్మార్ట్‌సిటీ ప్రారంభం: 2015
చేపట్టిన ప్రాజెక్టులు : 51
చేసిన ఖర్చు: సుమారు రూ.2వేల కోట్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన ‘స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల’ నిర్వహణ భారం జీవీఎంసీ నెత్తినపడే పరిస్థితి కనిపిస్తోంది. 2015లో ప్రారంభమైన స్మార్ట్‌సిటీ మిషన్ ఈ ఏడాది జూన్ నెలాఖరుతో ముగుస్తోంది. ఇంతవరకూ ఈ పథకం కింద చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైదొలగనున్నాయి. అంతేకాక నిర్వహణపై కేంద్రం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో జీవీఎంసీయే ఆ భారం భరించాల్సి వస్తుందనే ఆందోళనలో అధికారులున్నారు.
నగరాల్లో నివసించే ప్రజలకు సుస్ధిర అభివృద్ధితో కూడిన ఆరోగ్యప్రదమైన జీవనం, మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2015లో స్మార్ట్‌సిటీ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. మొదటి సంవత్సరం దేశవ్యాప్తంగా 20 నగరాలను ఎంపిక చేయగా అందులో విశాఖ చోటుదక్కించుకుంది. ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్‌సిటీ మిషన్‌కు రూ.వంద కోట్లు చొప్పున కేటాయించి నగరాల్లో అత్యాధునిక సదుపాయాలను కల్పించేలా రూపకల్పన చేశారు. ఆ మొత్తానికి సమానంగా స్థానిక సంస్థలు తమ వాటా కింద నిధులు సర్దుబాటు చేయాలని నిబంధన విధించారు. స్మార్ట్‌సిటీ మిషన్ అమలు, పర్యవేక్షణ కోసం జీవీఎంసీ పరిధిలో గ్రేటర్ విశాఖ స్మార్ట్‌సిటీ లిమిటెడెడ్ (జీవీఎస్‌ఎస్‌ఎల్)ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. జీవీఎస్‌ఎస్‌ఎల్‌కి ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, పనుల పర్యవేక్షణలో సహకరించేందుకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఏజెన్సీని కేంద్రమే ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించింది. ఏజెన్సీతోపాటు జీవీఎంసీలోని ఇంజనీరింగ్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు సభ్యులుగా ప్రాజెక్టు మోనటరింగ్ కమిటీ (పీవీసీ)ని ఏర్పాటు చేశారు. జీవీఎస్‌ఎస్‌ఎల్ సీఎండీ హోదాలో జీవీఎంసీ కమిషనర్ పీవీసీతో కలిసి స్మార్ట్‌సిటీ కింద చేపట్టాల్సిన పనులను గుర్తించడం, నిధులు ఖర్చు, పనుల పర్యవేక్షణ బాధ్యతలను కేంద్రం అప్పగించింది. స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు మొత్తం నగరాన్ని ఎంపిక చేస్తే నిధుల సమస్య ఎదురవడం ఖాయమని గుర్తించిన జీవీఎస్‌ఎస్‌ఎల్ అధికారులు బీచ్‌రోడ్డుని ఆనుకుని కోస్టల్‌బ్యాటరీ నుంచి జగదాంబ కూడలి, సిరిపురం జంక్షన్, పెదవాల్తేరు, పార్క్‌హోటల్ జంక్షన్ మధ్య ఉన్న 1,650 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాన్ని స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు ఏరియా బేస్డ్ డెవలప్‌మెంట్ (ఏబీడీ)గా ఎంపిక చేశారు. ఆ ప్రాంతంలో స్మార్ట్‌రోడ్లు, స్మార్ట్ లైటింగ్, 24/7 నీటిసరఫరా, విపత్తులను ముందుగానే గుర్తించి సమాచారాన్ని తెలియజేయడం ద్వారా నష్ట నివారణకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోనే సిటీ ఆపరేషన్ సెంటర్ (కమాండ్ కంట్రోల్‌రూమ్) ఏర్పాటు, నగరమంతటా స్మార్ట్‌పోల్స్, ముడసర్లోవ రిజర్వాయర్‌లో ఫ్లోటింగ్ సోలార్, స్మార్ట్ సిగ్నల్స్, సీసీ కెమెరాలు, 27 ఉన్నత పాఠశాలల్లో స్మార్ట్ క్యాంపస్‌లు, జీవీఎంసీకి చెందిన 12 భవనాలపై సోలార్ రూఫ్‌టాప్‌లు, వన్‌టౌన్‌లోని పురాతనమైన పాత మున్సిపల్ కార్యాలయంతోపాటు టౌన్‌హాల్‌ను హెరిటేజ్ భవనాలుగా అభివృద్ధి, స్మార్ట్ బస్‌షెల్టర్‌లు వంటి 51 ప్రాజెక్టులను సుమారు రూ.రెండు వేల కోట్లతో చేపట్టారు. వీటన్నింటినీ దశలవారీగా అమలుచేశారు. కొన్నిప్రాజెక్టులు ఇంకా పూర్తికావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన పదేళ్ల కాలం ఈనెలాఖరుతో ముగుస్తోంది.
ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను పదేళ్లుగా జీవీఎస్‌ఎస్‌ఎల్ చూస్తోంది. ఇందుకోసం ఏటా దాదాపు రూ.పది కోట్లు ఖర్చవుతోంది. ప్రధానంగా సిటీ ఆపరేషన్ సెంటర్ (సీఓసీ), వన్‌టౌన్‌లోని హెరిటేజ్ భవనాల నిర్వహణకే అధికభాగం ఖర్చు పెట్టాల్సివస్తోంది. స్మార్ట్‌సిటీ మిషన్ మరో 15 రోజుల్లో ముగుస్తున్నప్పటికీ ప్రాజెక్టుల తదుపరి నిర్వహణ ఏమిటనేదానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతంతా జీవీఎంసీ భరించకతప్పదని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై స్పష్టత కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖరాశామని చెబుతున్నారు.