Share News

మందకొడిగా అపార్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

ABN , Publish Date - Oct 27 , 2024 | 12:26 AM

కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ తరహాలోనే విద్యార్థులకు ఇవ్వాలనుకున్న అపార్‌ (ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ) గుర్తింపు కార్డు ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగుతోంది. ఆధార్‌ కార్డులో విద్యార్థుల పుట్టిన తేదీ, పేర్లు స్పెల్లింగ్‌లో తప్పులు ఉండడంతో రిజిస్ట్రేషన్‌కి అవాంతరం ఏర్పడుతున్నది.

మందకొడిగా అపార్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ
అపార్‌ నమూనా కార్డు

ఆధార్‌లో తప్పులు ఉండడంతో ఆలస్యం

ప్రతి విద్యార్థికి గుర్తింపు కార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

జిల్లాలో ఒకటి నుంచి ఇంటర్‌ వరకు 2,55,757 మంది విద్యార్థులు

వారం రోజుల క్రితం ఆన్‌లైన్‌ నమోదు ప్రారంభం

ఇప్పటి వరకు 30,782 మందికే రిజిస్ట్రేషన్‌

నర్సీపట్నం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ తరహాలోనే విద్యార్థులకు ఇవ్వాలనుకున్న అపార్‌ (ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ) గుర్తింపు కార్డు ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగుతోంది. ఆధార్‌ కార్డులో విద్యార్థుల పుట్టిన తేదీ, పేర్లు స్పెల్లింగ్‌లో తప్పులు ఉండడంతో రిజిస్ట్రేషన్‌కి అవాంతరం ఏర్పడుతున్నది.

కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి 12 అంకెలతో కూడిన అపార్‌ గుర్తింపు కార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారం రోజుల క్రితం తొమ్మిది, పదవ తరగతి విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ప్రారంభించారు. శుక్రవారం నుంచి ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ ప్రారంభించాలని ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో 1,813 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, 145 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలు ఉన్నాయి. ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్థులు 2,55,757 మంది ఉన్నారు. కాగా శనివారం ఉదయానికి 30,782 మందికి రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. అపార్‌ కార్డు కోసం విద్యార్థుల నుంచి వివరాలు తీసుకునేటప్పుడు వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అపార్‌ గుర్తింపు కార్డు ప్రయోజనంపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఆమోదం తీసుకొని రిజిస్ట్రేషన్‌ చేయాలి. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చైల్డ్‌ ఐడీ ఉండేది. తరువాత పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ అని పెట్టారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా విద్యార్థికి అపార్‌ గుర్తింపు కార్డు అందుబాటులోకి తెస్తున్నారు.

ఆధార్‌లో తప్పులతో ఆలస్యం

ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ, పేర్లు స్పెల్లింగ్‌లో తప్పులు ఉండడంతో రిజిస్ట్రేషన్‌కి ఆటంకం ఏర్పడుతోంది. పాఠశాలలో రికార్డుల వివరాలకు, ఆధార్‌లోని సమాచారానికి తేడాలు ఉంటున్నాయి. విద్యార్థి, వారి తల్లిదండ్రులు వివరాలు సవరణలు చేయాల్సి వస్తే ప్రధానోపాధ్యాయులు గుర్తించి మండల విద్యాశాఖ కార్యాలయానికి పంపించాలని ఎంఈవోలు కోరుతున్నారు. ఎంఈవో నుంచి డిప్యూటీ డీఈవో, డీఈవో, ఆర్‌జేడీకి పంపితే అక్కడ నుంచి ప్రొసీడింగ్‌ అర్డర్స్‌ వస్తాయి. ఈ తరువాత స్కూల్‌ స్థాయిలో హెచ్‌ఎం, కాలేజీలలో ప్రిన్సిపాల్‌ సవరణలు చేయడానికి వీలు అవుతుంది. ఆధార్‌లో పుట్టిన తేదీ, నెల, సంవత్సరం లేకపోతే ఆధార్‌ సెంటర్‌కి వెళ్లి మార్పించుకోవాల్సి ఉంటుంది.

అపార్‌ వల్ల ప్రయోజనాలు

అపార్‌ గుర్తింపు కార్డులో విద్యార్థికి సంబంధించి సమస్త సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. డీజీ లాకర్‌తో అనుసంధానం అయి ఉండడం వల్ల ధ్రువీకరణ పత్రాలను విద్యార్థి సురక్షితంగా భద్రత పరుచుకోవచ్చు. పాఠశాల మారినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. విద్యార్థులు పొందుతున్న ఉపకార వేతనాలు, సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు, ఉద్యోగాల భర్తీ సమయంలో అపార్‌ కార్డులోని వివరాల ఆధారంగా సమాచారం తీసుకుంటారు.

Updated Date - Oct 27 , 2024 | 12:26 AM