Share News

వణికిస్తున్న చలి

ABN , Publish Date - Jan 28 , 2024 | 10:55 PM

మన్యంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుమఖం పడుతుండడంతో పొగమంచు, చలి ప్రభావం అధికమవుతున్నది.

వణికిస్తున్న చలి
డుంబ్రిగుడ మండలం కొర్రా రహదారిలో మంచు

జి.మాడుగులలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

పాడేరు, జనవరి 28(ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుమఖం పడుతుండడంతో పొగమంచు, చలి ప్రభావం అధికమవుతున్నది. దీంతో ఏజెన్సీ వాసులు చలికి వణుకుతున్నారు. జి.మాడుగులలో 8, జీకేవీధిలో 11.6, చింతపల్లి, అరకులోయలో 12.8, పెదబయలులో 13, పాడేరులో 13.3, అనంతగిరిలో 13.4, హుకుంపేటలో 14.6 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఆదివారం నమోదయ్యాయి. తాజా వాతావరణ పరిస్థితులు చూస్తుంటే, మరికొన్ని రోజులు ఇదే చలి కొనసాగే అవకాశాలున్నాయని స్థానికులు అంటున్నారు. ఏజెన్సీలో తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగ మంచు కమ్మేస్తుంది. దీంతో లైట్లు వేసుకుని వాహనాలు రాకపోకలు సాగించక తప్పడం లేదు. మధ్యాహ్నం వేళలో ఒక మోస్తరుగా మాత్రమే ఎండ కాస్తున్నది. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి ప్రభావం చూపుతున్నది.

జీకేవీధి, చింతపల్లిలో..

చింతపల్లి: గిరిజన గ్రామాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదుకావడంతో చలి ఉధృతి అధికంగా వున్నది. ఆదివారం జీకే వీధిలో 11.6, చింతపల్లిలో 12.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం వల్ల గిరిజన గ్రామాల్లో చలి ప్రజలను వణికిస్తున్నది. ఉదయం, సాయంత్రం శీతలగాలులు అధికంగా వీస్తున్నాయి. అలాగే చింతపల్లి, లంబసింగి, తాజంగి, జీకేవీధి, ఆర్‌వీనగర్‌ ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తున్నది. ్థరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం పది గంటల వరకు మంచు కమ్మేస్తున్నది.

డుంబ్రిగుడలో..

డుంబ్రిగుడ: మండలంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాత్రి నుంచి ఉదయం పది గంటల వరకు మంచు దట్టంగా కురుస్తున్నది. జాతీయ రహదారిలో మంచు వల్ల వాహనాలు లైట్లను వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో గిరిజన గ్రామాల్లో చలిమంటలు వేసుకుని జనం ఉపశమనం పొందుతున్నారు. కాగా పర్యాటకులు మాత్రం మంచు అందాలను ఆస్వాదిస్తున్నారు. పర్యాటకులు ఆదివారం అంజోడ సిల్క్‌ఫాంలోని పీనరిలో మంచు అందాలను తిలకించి తమ కెమెరాల్లో బంధించారు.

Updated Date - Jan 28 , 2024 | 10:55 PM