Share News

ఆది నుంచీ అవమానాలే

ABN , Publish Date - Jan 07 , 2024 | 01:09 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.సమతకు క్యాంపస్‌లో కొందరు కనీస గౌరవం ఇవ్వడం లేదు.

ఆది నుంచీ అవమానాలే

ఏయూలో ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ కె.సమతకు దక్కని కనీస గౌరవం

ఉద్దేశపూర్వకంగా కొంతమంది నిర్లక్ష్యం

చార్జ్‌ తీసుకునేందుకు ఛాంబర్‌కు వెళ్లకుండా అడ్డగింత

మూడు రోజుల వరకూ వాహనం కూడా ఇవ్వని వైనం

వైస్‌ చాన్సలర్‌కు చెప్పకుండానే కీలక నిర్ణయాలు

యూనిఫెస్ట్‌ నిర్వహణ సంబంధించిన సమాచారం నిల్‌

వాట్సాప్‌లో ఆహ్వానం

కార్యక్రమానికి ఆహ్వానించే పద్ధతి ఇదేనా?... అంటూ ప్రశ్నించిన ఇన్‌చార్జి వీసీ

నోరు తెరిస్తే వర్సిటీ పరువు బజారున పడుతుందని బాధను దిగమింగుకుంటున్నారంటున్న సన్నిహితులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.సమతకు క్యాంపస్‌లో కొందరు కనీస గౌరవం ఇవ్వడం లేదు. ఏ విషయం ఆమె దృష్టికి తీసుకువెళ్లడం లేదు. ప్రస్తుతం వర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న యూత్‌ ఫెస్టివల్‌కు సంబంధించిన సమాచారం కూడా ఆమె అడిగేంత వరకూ చెప్పలేదు. ప్రారంభోత్సవానికి ఆహ్వానం కూడా కేవలం వాట్సాప్‌లో పంపి ఊరుకున్నారు. ఈ పరిణామాలపై ఆమె మనస్తాపంతో ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితిని తాను మున్నెన్నడూ చూడలేదని, వర్సిటీ పరువు పోతుందనే ఉద్దేశంతోనే సైలెంట్‌గా ఉంటున్నానని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ప్రొఫెసర్‌ కె.సమత నవంబరు నెలాఖరులో ఏయూ ఇన్‌చార్జి వీసీగా నియమితులయ్యారు. సీనియర్‌ ప్రొఫెసర్‌ అయిన ఆమె అప్పటికి రెక్టార్‌గా ఉన్నారు. వర్సిటీలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆమె పట్ల అధికారులు, అధ్యాపకులు గౌరవ భావంతో వ్యవహరించాలి. కానీ, మాజీ వీసీకి సన్నిహితంగా మెలిగిన కొందరు ఆమెను కనీసం వీసీగా గుర్తించేందుకు అంగీకరించలేదు. చార్జ్‌ తీసుకునేందుకు వైస్‌ చాన్సలర్‌ ఛాంబర్‌లోకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. ఈ విషయమై మీడియాలో కథనాలు రావడంతో ఉలిక్కిపడిన అధికారులు తరువాత రోజు ఆమెను వీసీ చాంబర్‌కు తీసుకువెళ్లి సీటులో కూర్చోబెట్టారు. ఇలా తొలిరోజే వివక్ష ఎదుర్కొన్నందుకు ఆమె బాధపడ్డారు. ఆ తరువాత కూడా మూడు రోజులపాటు వీసీ వాహనాన్ని ఆమెకు కేటాయించకుండా చేశారు. దీనిపై రచ్చ జరుగుతుందన్న ఉద్దేశంతో తరువాత అప్పగించారు. అయితే, కీలక నిర్ణయాలు, ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రం ఆమెకు తెలియనివ్వడం లేదు. ఈ విషయమై అనేకమార్లు సన్నిహితుల వద్ద ఇన్‌చార్జి వీసీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్దకు ఎవరూ రావడం లేదని, ఏ విషయాలు తెలియజేయడం లేదంటూ వాపోయారు. ఇక ప్రస్తుతానికి వస్తే...ఆంధ్ర యూనివర్సిటీలో శుక్రవారం నుంచి 37వ సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ ఫెస్టివల్‌ (యూనిఫెస్ట్‌) 2023-24 జరుగుతోంది. ఈ వేడుకల నిర్వహణకు సుమారు 40 విశ్వవిద్యాలయాలు దరఖాస్తు చేసుకోగా, ఏయూకు అవకాశం దక్కింది. ఈ ఫెస్ట్‌లో పాల్గొనేందుకు వేర్వేరు రాష్ట్రాల నుంచి 800 మంది విద్యార్థులు, అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ నుంచి పరిశీలకులు హాజరయ్యారు. అంతటి కీలకమైన ఈ వేడుకలకు సబంధించిన సమాచారం ఇన్‌చార్జ్‌ వైస్‌ చాన్సలర్‌ను తెలియజేయలేదు. ఈ ఫెస్ట్‌కు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్‌ ఎన్‌.విజయ్‌మోహన్‌ను ఆమె పిలిపించి అడిగిన తరువాత గానీ షెడ్యూల్‌ ఇవ్వలేదు.

వాట్సాప్‌లో ఆహ్వానం..వీలుంటే రండి..

యూనిఫెస్ట్‌ వేడుకలను శుక్రవారం సాయంత్రం వర్సిటీలో అట్టహాసంగా ప్రారంభించారు. అయితే, ఈ వేడుకలకు సంబంధించిన ఆహ్వానాన్ని ఇన్‌చార్జ్‌ వీసీకి రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ వాట్సాప్‌లో పంపారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు కార్యక్రమం ప్రారంభించాల్సి ఉండగా రిజిస్ర్టార్‌ మూడు గంటలకు వీసీ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె...కార్యక్రమానికి ఆహ్వానించే పద్ధతి ఇదేనా అంటూ ప్రశ్నించారు. అలాగే వర్సిటీలో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రిన్సిపాల్స్‌తో సమావేశం ఎందుకు ఏర్పాటుచేయలేదని అడిగారు. అందుకు ఆయన...అన్నీ తాను చూసుకుంటానని, ‘వీలుంటే రండి’ అంటూ వెళ్లిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్‌చార్జ్‌ వీసీ వేడుకలకు దూరంగా ఉండిపోయారు.

సార్‌ రేపే వస్తున్నారంటూ ప్రచారం..

తన వద్దకు ఎవరూ రాకుండా, కనీసం గౌరవం ఇవ్వకపోవడం వెనుక వర్సిటీలోని కొంతమంది అధికారుల పాత్ర ఉందని ఇన్‌చార్జి వీసీ కె.సమత అభిప్రాయపడుతున్నారు. ‘సార్‌ రేపే వస్తున్నారు...బాధ్యతలు తీసుకుంటున్నారు’ అంటూ కొందరు ప్రచారం చేస్తుండడంతో అధికారులు, ప్రిన్సిపాల్స్‌, స్టాఫ్‌ చాలామంది ఇన్‌చార్జ్‌ వీసీ ఛాంబర్‌ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసేందుకు కూడా చాలామంది అధికారులు ఇన్‌చార్జి వీసీ ఛాంబర్‌కు వెళ్లలేదు. కనీసం మహిళా అధికారులు కూడా వెళ్లకపోవడంతో ఇన్‌చార్జ్‌ వీసీ తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. తనను ఇన్‌చార్జి వీసీగా ప్రభుత్వం నియమించిందని, తానేమీ కావాలని కూర్చోలేదంటూ పలువురి వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. వ్యక్తిగతంగా తనకు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదని, కానీ, వీసీ సీటుకు కూడా గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరు బాధిస్తోందని వాపోయినట్టు తెలిసింది.

ఇన్‌చార్జి వీసీని ఆహ్వానించకపోవడంపై నిరసన

విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న యూత్‌ ఫెస్టివల్‌కు ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.సమతను ఆహ్వానించకుండా అవమానించడాన్ని నిరసిస్తూ శనివారం ఉదయం క్యాంపస్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పలువురు నిరసన తెలియజేశారు. ఏయూ డాక్టోరల్‌ ఫోరం అధ్యక్షులు ఎం.సురేష్‌ మీనన్‌ నిరశన దీక్షలో కూర్చోగా, కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ అర్జునుడు, డాక్టర్‌ దాస్‌, డాక్టర్‌ శిరీష్‌, డాక్టర్‌ మోహమ్‌, డాక్టర్‌ పాల్‌ ప్రతాప్‌, తదితరులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మీనన్‌ మాట్లాడుతూ వీసీని అవమానించేలా వ్యవహరించడం దారుణమన్నారు. పూర్తిస్థాయి వీసీగా బాధ్యతలు అప్పగించి ఆమె గౌరవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టాలన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 01:09 AM