Share News

అక్కడ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:46 AM

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల ‘చీడికాడ’ జనాభాపరంగా చాలా చిన్న మండలం.

అక్కడ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు

ఇదీ ‘చీడికాడ మండలం’ ప్రత్యేకత

1978 నుంచి ప్రతి ఎన్నికల్లో చీడికాడ మండల వాసుల పోటీ

మాడుగుల నియోజకవర్గానికి ఇప్పటికి 14సార్లు ఎన్నికలు...ఏడుసార్లు చీడికాడ మండలవాసుల గెలుపు

చీడికాడ, ఏప్రిల్‌ 15:

అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల ‘చీడికాడ’ జనాభాపరంగా చాలా చిన్న మండలం. అయితే మాడుగుల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 1978 నుంచి చీడికాడ మండల వాసులే పోటీ చేస్తున్నారు. 2019 వరకూ మాడుగుల నియోజకవర్గానికి 14 సార్లు ఎన్నికలు జరగ్గా చీడికాడ మండలవాసులే ఏడుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1978 నుంచి నేటి వరకూ ప్రతి ఎన్నికల్లోను చీడికాడ ప్రాంతవాసులు పోటీ చేస్తున్నారు. మండలంలో అప్పలరాజుపురం గ్రామానికి చెందిన కురచా రామునాయుడు 1978లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 1985, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాగే మండలంలోని పెదగోగాడ గ్రామానికి చెందిన రెడ్డి సత్యనారాయణ 1983, 1985, 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో ఆరుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీచేయగా ఒక్క 2004 మినహాయించి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు రాష్ట్ర మంత్రిగాను, అంచనాల కమిటీ చైర్మన్‌గాను, టీటీడీ బోర్డు సభ్యునిగాను పలుమార్లు పనిచేశారు. అదేవిధంగా అప్పలరాజుపురం గ్రామానికి చెందిన గవిరెడ్డి రామానాయుడు 2004 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గాను, 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయగా 2009లో గెలుపొందారు. అప్పలరాజుపురం గ్రామానికే చెందిన గవిరెడ్డి సన్యాసినాయుడు 1999లో అన్న టీడీపీ తరపున, 2019లో జనసేన తరపున పోటీ చేసి ఓటమిచెందారు. అదే గ్రామానికి చెందిన కురచా నారాయణమూర్తి 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అలాగే చీడికాడ గ్రామానికి చెందిన బొడ్డు శ్రీనివాసరావు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిచెందారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మండలంలో ఖండివరం గ్రామానికి చెందిన చిరుమూరి శివాజీరాజు 2009, 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. మాడుగుల నియోజకవర్గంలో మిగిలిన మండలాల కంటే ‘చీడికాడ’ చిన్న మండలం. జనాభా, ఓటర్లు తక్కువ. ఒకే వ్యక్తి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత ఈ మండలవాసి (రెడ్డి సత్యనారాయణ)కే దక్కుతుంది.

Updated Date - Apr 18 , 2024 | 01:46 AM