Share News

కొత్త జిల్లాలకు ఎస్‌ఈలు ఏరి?

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:38 AM

రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి రెండేళ్లు కావస్తున్నా విద్యుత్‌ శాఖలో అధికారుల నియామకం చేపట్టలేదు.

కొత్త జిల్లాలకు ఎస్‌ఈలు ఏరి?

- మూడు జిల్లాలకు ఒకరే విద్యుత్‌ అధికారి

- భారమవుతున్న పనుల పర్యవేక్షణ

- జేఏసీ సమావేశంలో సర్కిల్స్‌ ఏర్పాటుకు మంత్రి అంగీకారం

- ఏళ్లు గడుస్తున్నా చర్యలపై మీనమేషాలు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి రెండేళ్లు కావస్తున్నా విద్యుత్‌ శాఖలో అధికారుల నియామకం చేపట్టలేదు. పనులన్నీ పాత జిల్లాల అధికారుల ఆధ్వర్యంలోనే చేపడుతున్నారు. అంతేకాదు పదోన్నతులు, కొత్త ఉద్యోగాల సృష్టి, సిబ్బంది నియామకం చేపట్టలేదు. గతంతో పోల్చుకుంటే విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. 24/7 సరఫరా ఇవ్వాల్సి ఉంది. సకాలంలో బిల్లుల జారీ, వసూలు కత్తిమీద సాముగా మారింది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రాజెక్ట్‌లను కూడా ఇక్కడి డిస్కమ్‌ అధికారులే పర్యవేక్షించాల్సి ఉంది. వ్యవసాయానికి విద్యుత్‌ మీటర్ల అమరిక, భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ పనులు, స్మార్ట్‌ మీటర్లు.. ఇలా అనేక అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది.

జిల్లా కేంద్రంగా సర్కిల్‌ ఏర్పాటుచేసి దానికి సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ (జిల్లా అధికారి), డివిజన్లు, డివిజనల్‌ ఇంజనీర్లు, సహాయక, జూనియర్‌ ఇంజనీర్లు, లైన్‌మెన్లు, ఇలా వందలాది మందిని నియమించాల్సి ఉంది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా నిర్దేశించిన సమయం (కొన్ని గంటలు)లోనే పరిష్కరించాలి. అంతేకాదు దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని ఇటీవల కేంద్రం సూచించింది. వీటిని అమలు చేయాల్సింది కూడా క్షేత్రస్థాయిలోని ఇంజనీర్లే. అయినప్పటికీ సర్కిల్స్‌ ఏర్పాటు కాక సమస్యలు ఎదురవుతున్నాయి.

రాష్ట్రంలో గతంలో 13 జిల్లాలుండగా రెండేళ్ల క్రితం ప్రభుత్వం అదనంగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేసింది. వాటికి కలెక్టర్‌, జేసీ, డీఆర్వో, ఆర్డీవోలను నియమించింది. విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, ఉద్యానవన, నీటి పారుదల ఇలా అన్ని శాఖలకు జిల్లా అధికారుల నియామక ప్రక్రియ సాగింది. కానీ విద్యుత్‌ శాఖకు సంబంఽధించి కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేయలేదు. ఎస్‌ఈలను నియమించలేదు. ఈ వ్యవహారాలన్నీ స్థానిక విద్యుత్‌ పంపిణీ సంస్థలే చూసుకోవాలని తేల్చి చెప్పింది. కొన్నాళ క్రితం ఏపీ ట్రాన్స్‌కో, పంపిణీ సంస్థల సీఎండీలతో నిర్వహించిన జాయింట్‌ కమిటీ సమావేశంలో కొత్త సర్కిళ్ల ఏర్పాటు, అధికారుల నియామకంపై సీఎండీలు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. దీనికి ఆ శాఖ మంత్రి కూడా ఆమోదం తెలిపారు. ఆ మేరకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఫైళ్లు సిద్ధం చేశాయి. అయితే ఆ తరువాత ఏం జరిగిందో... ఆమోదించిన మంత్రే తరువాత చూద్దామంటూ పక్కన పెట్టేశారు.

మరో మూడు సర్కిల్స్‌ అవసరం

ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉండగా పార్వతీపురం మన్యం, అనకాపల్లి, పాడేరు (అల్లూరి సీతారామరాజు) జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. అంటే అదనంగా మూడు సర్కిల్‌ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. పార్వతీపురం, అనకాపల్లి, పాడేరుల్లో ఆయా కార్యాలయాలు, ఎస్‌ఈలను నియమించి, సిబ్బందిని సమకూర్చాలి. కానీ రెండేళ్లుగా ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్‌ఈతోనే అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలను నడిపిస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో స్పందన కార్యక్రమం జరుగుతుంది. విద్యుత్‌ శాఖ సమస్యలపై చర్చించేందుకు ఎస్‌ఈ ఉండాలి. మూడు జిల్లాలకు కలిపి ఒకరే ఎస్‌ఈ ఉండడంతో ఒక్కచోట మాత్రమే హాజరుకాగలుగుతున్నారు. స్మార్ట్‌సిటీగా విశాఖకు, వందలాది పరిశ్రమలున్న జిల్లాగా అనకాపల్లికి, ఏజెన్సీ కేంద్రంగా అల్లూరి జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఒక్కరే ఎస్‌ఈతో పని విభజనకు అవకాశం లభించడం లేదు. విశాఖలో జిల్లా పరిషత్‌ సమావేశాలు నిర్వహించినప్పుడు అనకాపల్లి, అల్లూరి జిల్లా ప్రజాప్రతినిధులు దీనిపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడం, విద్యుత్‌ సౌకర్యాలు మెరుగుపడడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ అంశాలను ఆయా జిల్లాల కలెక్టర్లు ఈపీడీసీఎల్‌ సీఎండీ దృష్టికి తీసుకువెళుతున్నా ఫలితం కనిపించడం లేదు,

ఏళ్లుగా పదోన్నతులూ లేవు

ఈపీడీసీఎల్‌లో ఇంజనీర్లకు ఏళ్ల తరబడి పదోన్నతులు కల్పించడం లేదు. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నా డివిజనల్‌ ఇంజనీర్‌ కాలేకపోతున్నారు. కొత్త జిల్లాల్లో సర్కిల్‌ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే సీనియర్‌ డీఈలకు ఎస్‌ఈలుగా, మిగిలిన వారికి ఇతర హోదాల్లో పదోన్నతులు లభిస్తాయి. ఆయా కార్యాలయాలకు అవసరమైన సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఇంజనీర్ల అసోసియేషన్లు డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - Mar 11 , 2024 | 01:38 AM