Share News

ఏసీబీ వలలో గొలగాం పంచాయతీ కార్యదర్శి

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:45 AM

ఇంటి పన్నుకు సంబంధించి పేరు మార్చడానికి లంచం తీసుకుంటూ అనకాపల్లి మండలం గొలగాం పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించి ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.

ఏసీబీ వలలో గొలగాం పంచాయతీ కార్యదర్శి
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి కొసిరెడ్డి కనకబాబు

ఆస్తి పన్ను పేరు మార్చడానికి రూ.7 వేలు లంచం డిమాండ్‌

డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

అనకాపల్లి రూరల్‌, ఫిబ్రవరి 6: ఇంటి పన్నుకు సంబంధించి పేరు మార్చడానికి లంచం తీసుకుంటూ అనకాపల్లి మండలం గొలగాం పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించి ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.

గొలగాం గ్రామానికి చెందిన తోట ఈశ్వరరావు ఇటీవల ఇటీవల మృతిచెందాడు. ఇతని పేరున గ్రామంలో ఇల్లు ఉంది. తన తండ్రి పేరున ఉన్న ఆస్తి పన్నును తన పేర్ల మీదకు మార్చాలని ఈశ్వరరావు కుమారుడు బాబ్జీ ఇటీవల పంచాయతీ కార్యదర్శి కొసిరెడ్డి కనకబాబును కలిసి కోరారు. ఈ పని చేయాలంటే తనకు రూ.10 వేలు లంచం ఇవ్వాలని, లేకపోతే పేర్లు మార్చడం కుదరదని కార్యదర్శి స్పష్టం చేశాడు. దీంతో బాబ్జీ అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించి, పంచాయతీ కార్యదర్శి లంచం డిమాండ్‌ చేసిన విషయమై ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారులు చెప్పిన మేరకు బాబ్జీ మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు పంచాయతీ కార్యదర్శి కనకబాబుకు ఫోన్‌ చేసి, ఆస్తి పన్ను పేర్లు మార్చడానికి రూ.7 వేలు ఇస్తానని, డబ్బులు ఎక్కడకు వచ్చి ఇవ్వాలని అడిగారు. పంచాయతీ కార్యాలయంలోనే వున్నానని అతను చెప్పాడంతో బాబ్జీ అక్కడకు వెళ్లారు. రూ.7 వేలు ఇస్తుండగా అప్పటికే సమీపంలో మాటువేసిన ఏసీబీ డీఎస్పీ రమ్య, ఇతర అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యదర్శి టేబుల్‌ డ్రాలో అనధికార నగదు రూ.10 వేలు ఉన్నట్టు గుర్తించి ఆ సొమ్మును కూడా స్వాధీనం చేసుకున్నారు. కార్యదర్శి కనకబాబును సాయంత్రం వరకు విచారించి అనంతరం తమ వెంట తీసుకెళ్లారు.

Updated Date - Feb 07 , 2024 | 12:46 AM