Share News

విద్యుదాఘాతంతో సచివాలయం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మృతి

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:53 AM

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు తొలగిస్తుండగా గ్రామ సచివాలయం ఉద్యోగం ఒకరు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలంలో జరిగింది. ఎస్‌ఐ డి.నాగేంద్ర తెలిపిన సమాచారం మేరకు ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా వున్నాయి.

విద్యుదాఘాతంతో సచివాలయం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మృతి
డెక్క చిరంజీవి(పైల్‌)

ఎన్నికల అధికారుల ఆదేశాలతో ఫ్లెక్సీ తొలగిస్తుండగా ప్రమాదం

దేవరాపల్లి, మార్చి 17: ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు తొలగిస్తుండగా గ్రామ సచివాలయం ఉద్యోగం ఒకరు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలంలో జరిగింది. ఎస్‌ఐ డి.నాగేంద్ర తెలిపిన సమాచారం మేరకు ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా వున్నాయి.

విజయనగరం జిల్లా వేపాడ మండలం కుమ్మపల్లి గ్రామానికి చెందిన డెక్క చిరంజీవి (34) అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కొత్తపెంట గ్రామ సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లను ఆదివారం సాయంత్రంలోగా తొలగించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు మండల అధికారులు తమ పరిధిలో రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లను సత్వరమే తొలగించి, ఫొటోలను సంబంధిత యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని కిందిస్థాయి ఉద్యోగులకు హుకుం జారీ చేశారు. కొత్తపెంట సచివాలయం పరిధిలోని ఫ్లెక్సీలు తొలగించడానికి వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ డెక్క చిరంజీవి తన స్నేహితుడు దాసరి శ్రీనుతో కలిసి ద్విచక్రవాహనంపై ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ములకలాపల్లి చేరుకున్నాడు. పాల కేంద్రానికి సమీపంలో వున్న ఒక ఫ్లెక్సీని చిరంజీవి తొలగిస్తుండగా.. దీని ఇనుప చట్రం, పైన వున్న విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. సమీపంలోని పొలాల్లో పనులు చేస్తున్న రైతులు, కూలీలు వచ్చారు. ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో తొలుత ఇసుక తీసుకువచ్చి అతని శరీరంపై పోశారు. (దీని వల్ల అతని శరీరం విద్యుత్‌ శక్తి తగ్గుతుందని...) సమీపంలో వున్న ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బందిని రప్పించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్య సిబ్బంది చెప్పారు. మృతుడు చిరంజీవికి భార్య హేమలత, పిల్లలు చేతన్‌(6), ఇషాన్‌(3), తల్లి కృష్ణమ్మ ఉన్నారు. హేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ డి.నాగేంద్ర తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కాగా విద్యుదాఘాతంతో సచివాలయం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మృతిచెందిన విషయం తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టికి ఫోన్‌ చేసి కోరారు.

Updated Date - Mar 18 , 2024 | 12:53 AM