హెచ్‌ఎంలకు భారంగా పాఠశాలల నిర్వహణ
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:41 AM
పాఠశాలల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు భారంగా పరిణమించింది.

నిర్వహణకు నిధులు ఇవ్వని గత వైసీపీ ప్రభుత్వం
విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్న నాటి విద్యా శాఖా మంత్రి
ప్రస్తుత విద్యా సంవత్సరానికి గ్రాంటు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
విద్యుత్ బిల్లులు కూడా చెల్లించాలంటున్న ఈపీడీసీఎల్ అధికారులు
బడ్జెట్ సరిపోదంటున్న ప్రధానోపాధ్యాయులు
విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):
పాఠశాలల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు భారంగా పరిణమించింది. ప్రధానంగా విద్యుత్ బిల్లుల చెల్లింపు చాలా కష్టంగా ఉంది. వైసీపీ పాలకులు గత విద్యా సంవత్సరంలో పాఠశాలల నిర్వహణకు పైసా విడుదల చేయలేదు. అంతకుముందు విద్యా సంవత్సరం అంటే 2022-23లో 20 శాతం నుంచి 30 శాతమే స్కూలు గ్రాంటు విడుదల చేసిన వైసీపీ సర్కారు సకాలంలో ఖర్చు చేయని పాఠశాలల నుంచి వెనక్కి తీసుకుంది. పరీక్షల నిర్వహణ, ఇతర బిల్లులు, నివేదికలకు అవసరమైన స్టేషనరీ ఖర్చు, ఇంటర్నెట్ బిల్లులు, టాయ్‌లెట్స్‌లో పైపులు, ట్యాపులు, మోటారు మరమ్మతులకు ప్రతినెలా ఎంతో కొంత ఖర్చవుతుంది. దీనికితోడు పాఠశాలను బట్టి విద్యుత్ బిల్లు రూ.రెండు వేల నుంచి రూ.20 వేల వరకూ వస్తుంటుంది. రాష్ట్రంలో అతి పెద్ద పాఠశాలగా గుర్తింపుపొందిన చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో నెలకు సగటున రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు విద్యుత్ బిల్లు వస్తోంది. పాఠశాల నిర్వహణ ఖర్చు మరో రూ.20 వేల వరకూ అవుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లులు చెల్లించలేమని ప్రధానోపాధ్యాయులు గత పాలకులకు విన్నవించుకున్నారు. ఆ మేరకు పాఠశాలల విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని గత ప్రభుత్వంలో విద్యా శాఖా మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ చెప్పడంతో హెచ్‌ఎంలు ఆ విషయం మరచిపోయారు.
గ్రాంటు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని 559 పాఠశాలలకు రూ.91,95,000 గ్రాంటు విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి పూర్తి గ్రాంటు రూ.1,83,90,000. 30 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఏడాదికి రూ.10 వేలు, 30-100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.25 వేలు, 100-250 మంది విద్యార్థులు ఉన్నట్టయితే రూ.50 వేలు, 250 మంది నుంచి 1000 మంది వరకు రూ.75 వేలు, 1000 మంది, అంతకంటే ఎక్కువ ఉన్న పాఠశాలలకు రూ.లక్ష గ్రాంటు కింద విడుదల చేస్తారు. పాఠశాలలో విద్యుత్ బిల్లులు, తాగునీటికి ఆ మొత్తం ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే పాఠశాలల్లో ఫ్యాన్లు, లైట్లు పెరగడం, ఇంకా తాగునీటి కోసం మోటారు నిర్వహణ నేపథ్యంలో విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయి. దాంతో మిగిలిన ఖర్చులకు స్కూలు గ్రాంటు సరిపోదని హెచ్‌ఎంలు వాపోతున్నారు. ప్రధానంగా విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. తాజాగా విడుదల చేసిన గ్రాంటు నుంచి విద్యుత్ బిల్లుకు కొంత మొత్తం వెచ్చించాలి. విద్యుత్ శాఖ నిబంధనల మేరకు పాత బకాయిలు చెల్లించిన తరువాతే మాత్రమే ప్రస్తుత బిల్లు చెల్లించాలి. బకాయిలు చెల్లించాలంటే ప్రస్తుత గ్రాంటు సరిపోదు. పైగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో వాడిన విద్యుత్‌కు మాత్రమే బిల్లు చెల్లించాలని ఆదేశాలు ఉన్నాయి. దీంతో విద్యుత్ బిల్లుల విషయంలో హెచ్‌ఎంల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని లేకపోతే పాఠశాలలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. పాఠశాలల నిర్వహణ గ్రాంటు పెంచాలని కోరుతున్నారు.