Share News

భయపెడుతున్న చోరీలు

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:38 AM

ఇటీవల పలు ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న చోరీలు నగరవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

భయపెడుతున్న చోరీలు

నగరంలో పెరుగుతున్న వైనం

వరుస చైన్‌స్నాచింగ్‌లు, ఇళ్లల్లో దోపిడీలు

నియంత్రణలో విఫలమవుతున్న పోలీసులు

ప్రముఖుల బందోబస్తుకే పరిమితం

రాత్రి సమయంలో తగ్గుతున్న నిఘా

విశాఖపట్నం, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి):

ఇటీవల పలు ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న చోరీలు నగరవాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత నెల రోజులుగా దాదాపుగా ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో చోరీ సంఘటన వెలుగు చూస్తోంది. పట్టపగలే దర్జాగా దొంగతనాలు జరుగుతున్నా అరికట్టలేని స్థితిలో పోలీసు యంత్రాంగం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నగరంలో ప్రముఖుల పర్యటనలు, అధికార పార్టీ నాయకుల సభలు ఇతర కార్యక్రమాలకు బందోబస్తు నిర్వహించేందుకే పోలీసు యంత్రాంగం పరిమితమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల నగరంలో చోరీలు పెరుగుతున్నాయి. తాజాగా పెందుర్తి ప్రశాంతినగర్‌లోని రాయల్‌ అపార్ట్‌మెంట్‌లో బుధవారం పట్టపగలే ఇంటితాళాలు పగలకొట్టి నగలు, నగదు దోచుకుపోయిన సంఘటన పోలీసు యంత్రాంగాన్ని కలవరపాటుకి గురిచేసింది. చోరుడు దర్జాగా కారులో వచ్చి, అఫీషియల్‌గా ఫోన్‌లో మాట్లాడుతూ చోరీ చేయడం విశేషం. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించకముందే దువ్వాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కిరణా దుకాణానికి వెళ్లిన ఓ ఆగంతకుడు వ్యాపారి లక్ష్మీ మెడలోని ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తి తెంచుకుని పరారైపోవడం పోలీసులకు సవాల్‌ విసిరినట్టయింది.

నగరంలో ఇళ్లలో చోరీలు, చైన్‌స్నాచింగ్‌లు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. వారం వ్యవధిలోనే పెందుర్తి పరిసరాల్లో నాలుగు ఇళ్లలో చోరీలు, సీబీఎం కాంపౌండ్‌తోపాటు దువ్వాడ ప్రాంతాల్లో రెండు చైన్‌స్నాచింగ్‌ కేసులు నమోదయ్యాయి. దీనికి పోలీసుల వైఫల్యమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో నేర పరిశోధనావిభాగం చురుగ్గా పనిచేసేది. రాత్రి సమయంలో పెట్రోలింగ్‌ చేపట్టడం, బీట్‌ గస్తీ పక్కాగా నిర్వహించేవారు. క్రైమ్‌ విభాగం అధికారులు నిరంతరం సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులతోపాటు కిందిస్థాయి సిబ్బంది పనితీరును నిత్యం సమీక్షించేవారు.

బందోబస్తు బాధ్యతల్లోనే...

తాజాగా పరిస్థితి మారిపోయింది. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతో క్రైమ్‌ విభాగంలో ఎవరు ఏ పనిచేస్తున్నారనే దానిపై జబాబుదారీతనం లోపించిందనే వ్యాఖ్యలు పోలీసు సిబ్బంది నుంచే వినిపిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక వేడుక పేరుతో అధికార పార్టీ నేతలకు బందోబస్తులు, ప్రముఖుల పర్యటనల వద్ద విధుల్లో ఉన్నతాధికారులు తలమునకలవుతున్నారు. దీంతో క్రైమ్‌ విభాగం పనితీరు సమీక్షించడం, కొత్తగా నేరం జరిగితే ఎవరు పాల్పడి ఉంటారనే దానిపై విశ్లేషణ చేయడం, ఆధారాలు సేకరించడం, ఆ తరహా నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఐ, ఎస్‌ఐలతోపాటు కిందిస్థాయి సిబ్బందితో విశ్లేషించే పరిస్థితి కనిపించడం లేదు. క్రైమ్‌ విభాగంలో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లుగా ఎస్‌ఐలే బాధ్యతలు నిర్వహిస్తుండడంతో వారిని ప్రశ్నించే నాథుడే లేకుండా పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఒకే తరహా ముఠా పలు ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్నా పోలీసులు గుర్తించలేకపోతున్నారని పోలీస్‌శాఖలోని ఇతర విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:46 AM