Share News

సంక్షోభంలో ఎస్సీ హాస్టళ్లు

ABN , Publish Date - Nov 28 , 2024 | 01:51 AM

సాంఘిక సంక్షేమ (ఎస్సీ) శాఖ నిర్వహిస్తున్న విద్యార్థుల వసతి గృహాలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. హాస్టళ్ల నిర్వహణ, విద్యార్థుల భోజనం బిల్లులు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఒక్క నెల కూడా మంజూరు కాలేదు. వసతిగృహాల సంక్షేమాధికారులు చేతి డబ్బులు, లేదంటే అప్పులు చేసి హాస్టళ్లను నిర్వహించాల్సి వస్తున్నది. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన అన్ని వసతిగృహాలకు మీద కోటిన్నర రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్‌లో వున్నాయి.

సంక్షోభంలో ఎస్సీ హాస్టళ్లు
నర్సీపట్నంలో వసతి గృహం-2లో బాలికలకు భోజనం వడ్డిస్తున్న సిబ్బంది

విద్యా సంవత్సరం ఆరంభం నుంచి విడుదల కాని డైట్‌ బిల్లులు

అక్టోబరు చివరినాటికి జిల్లాలో రూ.1,57,40,394 బకాయిలు

అప్పులు చేసి వసతి గృహాలను నిర్వహిస్తున్న వార్డెన్లు

హాస్టల్‌ నిర్వహణ నిధులు సైతం పెండింగ్‌

నర్సీపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమ (ఎస్సీ) శాఖ నిర్వహిస్తున్న విద్యార్థుల వసతి గృహాలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. హాస్టళ్ల నిర్వహణ, విద్యార్థుల భోజనం బిల్లులు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఒక్క నెల కూడా మంజూరు కాలేదు. వసతిగృహాల సంక్షేమాధికారులు చేతి డబ్బులు, లేదంటే అప్పులు చేసి హాస్టళ్లను నిర్వహించాల్సి వస్తున్నది. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన అన్ని వసతిగృహాలకు మీద కోటిన్నర రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్‌లో వున్నాయి.

సాంఘిక సంక్షేమ శాఖ అనకాపల్లి, పాయకరావుపేట, నర్సీపట్నం ఏఎస్‌డబ్ల్యూవోల పరిధిలో ప్రీమెట్రిక్‌ (3 నుంచి 10వ తరగతి వరకు) బాలురు వసతిగృహాలు 13, బాలికల వసతి గృహాలు 10, పోస్టుమెట్రిక్‌ (ఇంటర్‌ నుంచి పీజీ వరకు) బాలురు వసతి గృహాలు 4, బాలికల వసతిగృహాలు 4 ఉన్నాయి. ప్రీమెట్రిక్‌ వసతి గృహాల్లో 2,506 మంది, పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాల్లో 571 మంది.. మొత్తం 3,077 మంది వుంటున్నారు. విద్యార్థులు వసతిగృహాల్లో వుంటూ సమీపంలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తుంటారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమల్లో వుండడంతో ఆయా విద్యార్థులకు వసతిగృహాల్లో ఉదయం అల్పాహారం, రాత్రికి భోజనం పెడతారు. పాఠశాలల సెలవు రోజుల్లో మధ్యాహ్నం కూడా హాస్టల్‌లోనే భోజనం చేస్తారు. కళాశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రికి వసతిగృహాల్లోనే భోజనం వడ్డిస్తారు. బియ్యం, వేరుశనగ చెక్కీలను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. వంట గ్యాస్‌తోసహా మిగిలిన అన్ని రకాల సరకులు, కూరగాయలను వార్డెన్లు స్థానికంగా కొనుగోలు చేసుకోవాలి. ప్రభుత్వం మూడు, నాలుగు తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.1,250, ఐదు నుంచి పదో తరగతి వరకు రూ.1,450, కళాశాలల విద్యార్థులకు రూ.1,600 చొప్పున చెల్లిస్తుంది. ప్రతి నెలా విద్యార్థుల హాజరునుబట్టి వార్డెన్లు బిల్లులు తయారు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. సాధారణంగా రెండు లేదా మూడు నెలలకు ఒకసారి బిల్లులు మంజూరు అవుతుంటాయి. అంతవరకు వార్డెన్లే సొంత సొమ్ముతో లేదా అప్పులు చేసి వసతిగృహాలను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది జూన్‌ 12వ తేదీన విద్యా సంస్థలతోపాటు ఆయా వసతిగృహాలను కూడా తెరిచారు. అక్టోబరు వరకు దాదాపు నాలుగున్నర నెలల బిల్లులు అప్‌లోడ్‌ చేయగా, ఇంతవరకు ఒక్క నెల కూడా డైట్‌ బిల్లులు మంజూరు కాలేదు. వసతిగృహాల వార్డెన్లు (హెచ్‌డబ్ల్యూవోలు) కిరాణా దుకాణాల్లో సరకులు అరువులు తెచ్చి భోజనం వండి పెడుతున్నారు. జీతం డబ్బులతో కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. అక్టోబరు వరకు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని అన్ని వసతిగృహాలకు రూ.1,57,40,394 బిల్లులు పెండింగ్‌లో వున్నాయి. అనకాపల్లి ఏఎస్‌డబ్ల్యూవో పరిధిలోని వసతి గృహాలకు రూ.77,76,675, నర్సీపట్నం పరిధిలో 58,14,665లు, పాయకరావుపేట పరిధిలో 21,49,054 బిల్లులు పేరుకు పోయాయి. మరో నాలుగు రోజుల్లో నవంబరు నెల కూడా ముగుస్తుంది. దీంతో కలిపితే పెండింగ్‌ బిల్లులు ఐదున్నర నెలలకు చేరుకుంటాయి.

ఇదిలావుండగా గతంలో ప్రీమెట్రిక్‌ వసతి గృహాలకు నిర్వహణ చార్జీలు కింద నెలకు రూ.1,000 చొప్పున ప్రభుత్వం మంజూరు చేసేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహణ నిధులు ఇవ్వడంలేదు.

Updated Date - Nov 28 , 2024 | 01:51 AM